ఆగస్ట్ 14న రెండు భారీ సినిమాలు బాక్సాఫీసు ముందుకు వస్తున్నాయి. కూలీ, వార్ 2. ఈ రెండు కూడా తెలుగులో తయారైన సినిమాలు కాకపోయినప్పటికీ తెలుగు ఆడియన్స్‌ని ఎట్రాక్ట్ చేసే బోలెడు ఎలిమెంట్స్ వున్నాయి. రజనీకాంత్ ఎప్పటి నుంచి తెలుగులో మంచి మార్కెట్ వున్న స్టార్. రీసెంట్గా జైలర్ లాంటి సక్సెస్ ఇచ్చారు. కూలీలో ఆయనతో పాటు తెలుగు హీరో నాగార్జున కీలక పాత్ర. అమీర్ ఖాన్, ఉపేంద్ర లాంటి స్టార్స్ వున్నారు. లోకేష్ కనకరాజ్ డైరెక్టర్. ఇవన్నీ కూడా సినిమాపై కావాల్సిన హైప్‌ని క్రియేట్ చేశాయి. ఇక వార్ 2 బాలీవుడ్ సినిమా. హృతిక్‌తో కలసి ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకోవడం బిగ్గెస్ట్ ఎట్రాక్షన్. ఇది తెలుగులో స్ట్రయిట్ సినిమా రేంజ్లో రిలీజ్ కావడానికి మెయిన్ రీజన్ తారక్. ఈ రెండు సినిమాలకి కూడా ఒకే రేంజ్లో హైప్ వుంది.
అయితే ట్రైలర్స్ రిలీజ్ అయిన తర్వాత బజ్‌లో కొంత తేడా వచ్చింది. వార్ 2 ట్రైలర్ ఇద్దరు హీరోల్ని ఎలివేట్ చేస్తూ లార్జర్ దెన్ లైఫ్ ఈవెంట్ స్టయిల్లో కట్ చేశారు. సినిమాలో ఏముందో ఆడియన్స్‌కి ఒక క్లారిటీ వచ్చింది. ఇద్దరు హీరోలు కలసి ఒక యాక్షన్ విజువల్ ఫీస్ట్ అందించబోతున్నారనే ఐడియా వచ్చింది. ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత కూడా సినిమాపై అదే హైప్ వుంది.
అయితే కూలీ ట్రైలర్ మాత్రం కొంత విభిన్నమైన రెస్పాన్స్ అందుకుంది. లోకేష్ కట్ చేసిన ట్రైలర్లో బిగ్ ఈవెంట్స్ అన్నీ దాచేశాడు. వార్ సిరీస్‌పై ప్రేక్షకులకి ఒక అంచనా వుంది. కానీ కూలీ కథ ఏమిటి, ఎలాంటి పాత్రలు వుంటాయి, ఆ పాత్రలు ఏం చేస్తాయనేది తెలీదు. లోకేష్ మొదట దీనిపై ఫోకస్ చేశాడు. కూలీ వరల్డ్ చూపించి, ఆ పాత్రల్ని పరిచయం చేశాడు. కథ జోలికి వెళ్ళలేదు. ఆ పాత్రలతో ఎలాంటి కథని చెప్పబోతున్నాడనేది సినిమాలోనే చూసుకోవాలి.
ట్రైలర్ అనేది కూడా కథ లాంటిదే, దానికి స్టార్ట్, ట్విస్ట్, ఫినిషింగ్ వుంటేనే ఆడియన్స్ కి ఇన్‌స్టంట్‌గా పడుతుంది. కూలీ విషయంలో లోకేష్ ఈ ఫార్ములాకి భిన్నంగా వెళ్ళాడు. అందుకే వార్ 2తో పోల్చుకుంటే హైప్ పెంచడంలో కూలీ ఓ మెట్టు తగ్గింది. అయితే ఇది కంప్లీట్ లోకేష్ కనకరాజ్ క్రియేటివ్ డెసిషన్. ఆయనకంటూ ఒక మార్క్ వుంది. విక్రమ్ ట్రైలర్ కూడా అంతగా రిజిస్టర్ కాలేదు. ట్రైలర్లో కథని మెటాఫర్గా చూపించే ప్రయత్నం చేశాడు. కూలీ ట్రైలర్ విషయంలో కూడా హైప్ గురించి ఆలోచించలేదు. హై మూమెంట్స్ కాకుండా కథకు కట్టుబడి కట్ చేసిన ట్రైలర్‌లా అనిపించింది. ఈ కథ కూడా ఎక్కువ రివీల్ కాలేదు. అసలు కథని థియేటర్‌కు రిజర్వ్ చేశాడు.
అందుకే కూలీ ట్రైలర్ బజ్ పరంగా కొంచెం వెనుకబడినట్టనిపించినా ఇది పూర్తిగా లోకేష్ కనకరాజ్ క్రియేటివ్ డెసిషన్. ఏదేమైనా ఈ రెండు సినిమాలూ దేనికవే ప్రత్యేకం. ఈ రెండు కూడా బాక్సాఫీసు వద్ద సంచలనం నమోదు చేయగల సత్తా వున్న సినిమాలే.