Coolie movie review
తెలుగు360 రేటింగ్: 2.25/5
కూలీ… ఈ సినిమా కోసం ఎన్ని కబుర్లో. ఖైదీ.. విక్రమ్… లియో ఇలాంటి సినిమాలు తీసిన లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ లాంటి ఓ సూపర్ స్టార్ తో కలసి పని చేస్తున్నాడు అంటే ఆ ఊహే ఒక సూపర్ హిట్ సినిమాతో సమానం. దానికి తోడు నాగార్జున, ఉపేంద్ర, అమీర్ ఖాన్ లాంటి స్టార్స్ తోడయ్యారు. అనిరుధ్ వుండనే వున్నాడు. టేబుల్ పై ప్రాపర్ హిట్ సినిమా ఉన్నట్టు లెక్క. దాన్ని సూపర్ హిట్ చెయ్యాల్సిన బాధ్యత దర్శకుడిగా లోకేష్ పై వుంది. మరి ఆ ప్రయత్నం లో లోకేష్ సఫలం అయ్యాడా? ఇన్ని భారీ అంచనాలు ఈ కూలీ తట్టుకోగలిగాడా?
ముందు కథలోకి వెళదాం:
కూలీ ప్లాట్ సింపుల్ గా చెప్పుకోవాలి అంటే.. తన ప్రాణ స్నేహితుడి చావుకి గల కారణాలు తెలుసుకుని, అందుకు ప్రతీకారం తీర్చుకోవాలి అనుకునే హీరో కథ ఇది. లైన్ గా చెప్పుకుంటే చాలా సాధారణమైన కథ. కానీ దాని చుట్టూ లోకేష్ భారీ సెటప్పులు వేసుకున్నాడు. ఒక పోర్ట్.. అక్కడ జరుగుతున్న స్మగ్లింగ్.. దాని వెనుక అవయవాలు బదిలీ చేసే మూఠా.. సైమన్ అనే కిరాతకుడు.. మొబైల్ క్రిమెషన్ అనే పరికరం.. ఇలా చాలా లేయర్లు వున్నాయి. ఒక నేర సామ్రాజ్యం.. దానిని అంతం చెయ్యాలి అనుకునే ఒక హీరో.. లోకేష్ సెటప్స్ ఇలానే ఉంటాయి. దాని చుట్టూ హీరోఇజం పండిస్తూ కమర్షియల్ ఎలిమెంట్స్ జోడిస్తూ.. అక్కడక్కడా ట్విస్ట్స్ ఇస్తూ కథలు రాసుకోవడం లోకేష్ కి బాగా అలవాటు. కూలీ అలానే సాగింది.
ఒక సాధారణమైన కథని తారాబలంతో నెట్టుకు రావచ్చు అని లోకేష్ నమ్మాడు. అది అక్కడక్కడా వర్క్ అవుట్ అయ్యింది కూడా. రజనీ మానియా, నాగ్ స్వాగ్.. సన్నివేశాలు సాధారణంగా వున్నా ప్రేక్షకుల కళ్ళు తెరకు అతుక్కునేలా చేశాయి. కాకపోతే బలమైన స్టార్స్ దొరికినప్పుడు కథ ఇంకా బలంగా రాసుకోవాలి అనే ఆలోచన లోకేష్ కి వస్తే ఇంకా బాగుండేది. ఇంత మంది స్టార్లని పెట్టుకుని రాసుకోదగ్గ కథ అయితే ఇది కాదు. లోకేష్ ట్రాక్ రికార్డు చూసి ఈ సినిమా ఒప్పుకోవాలి తప్పితే.. కథని నమ్మి ఈ సినిమా చేసి వుండరు.
తొలి సగంలో అక్కడక్కడా కొన్ని హైస్.. చాలా చోట్ల లోస్ కనిపించాయి. రజనీ ఎంట్రీ సాధారణంగా అనిపించింది. కథకు లో బడి సాగే ఎంట్రీ నే కావచ్చు. కానీ రజనీ నుంచి.. ముఖ్యంగా లోకేష్ నుంచి ఆశించే ఎంట్రీ ఐతే కాదు. షౌబిన్ షాహిర్ పాత్ర, అందులోని క్రూరత్వం వల్ల కొన్ని సీన్లు పండాయి. మోనికా పాట విడుదల కు ముందు తెచ్చిన హైప్ అంతా ఇంతా కాదు. కూలీ క్రేజ్ అమాంతం పెంచిన పాట అది. కానీ స్క్రీన్ పై ఆ పాట చూస్తే అస్సలు కిక్ రాలేదు. దానికి కారణం రాంగ్ ప్లేస్ మెంట్.
నాగార్జున చేసిన సైమన్ పాత్ర గురించి చాలా ఎక్కువ కబుర్లు వినిపించాయి. నాగ్ లాంటి ఒక పెద్ద స్టార్ తొలిసారి విలన్ పాత్ర పోషిస్తే తప్పకుండా ఆసక్తి రెట్టింపు అవుతుంది. అలా సైమన్ పాత్ర టాక్ అఫ్ ది టాలీవుడ్ అయ్యింది. నాగ్ స్టైల్, స్వాగ్ అన్నీ బాగా కుదిరాయి. కానీ స్క్రీన్ పై ఆ పాత్ర అనుకున్న స్థాయి లో మాత్రం పండలేదు. తొలి సగం లో సైమన్ కనిపించడం చాలా తక్కువ. సైమన్ తో పోలిస్తే షోబిన్ పాత్ర ఎక్కువ ఎలివేట్ కావడం వల్ల ఆ ఫీలింగ్ రావచ్చు. ఈ పాత్రని ముగించిన విధానం కూడా నాగార్జున అభిమానులకు సంతృప్తి ఇవ్వదు. ఒక రకంగా కూలీ లో విలన్ నాగార్జున కాదు…షోబిన్.
విశ్రాంతి ఘట్టం ముందు ఒక పది నిమిషాలు స్క్రీన్ ప్లే చాలా స్పీడ్ గా సాగింది. చాలా పాత్రలు ఓపెన్ అవుతాయి. సెకండ్ ఆఫ్ కి మంచి లాక్ పడింది. దాంతో అక్కడ వరకూ కాస్త అసంతృప్తి వున్నా ఫస్ట్ ఆఫ్ పాస్ ఆగిపోతుంది. సెకండ్ ఆఫ్ లో కూడా అక్కడక్కడా లోకేష్ మెరుపులు కనిపిస్తాయి. విక్రమ్ లో టీనా అనే ఒక పవర్ఫుల్ పాత్ర, దాన్ని రివీల్ చేసే విధానం ఆహా అనిపిస్తాయి. అలాంటి మూమెంట్ ఒకటి సెకండ్ ఆఫ్ లో వుంది. కాకపోతే టీనా స్థాయిలో ఇంపాక్ట్ రాలేదు. రజిని, షోబిన్ ఫోన్ లో మాట్లాడుకునే సీన్ ఒకటి భలే పండింది. అక్కడ ఇచ్చిన ఎలివేషన్లు బాగున్నాయి. ఉపేంద్ర పాత్రని ట్రంప్ కార్డులా వాడారు. ఒక యాక్షన్ సీన్ కి అది పనికి వచ్చింది. విక్రమ్ లో రోలెక్స్ లా ఈ సినిమాలో అమీర్ ఖాన్ ని తీసుకొచ్చారు. ఒక సౌత్ ఇండియన్ సినిమాలో అమీర్ ని చూడడం మంచి అనుభవం. కానీ రోలెక్స్ ని ఊహించుకుంటే మాత్రం అమీర్ ఈ సినిమాలో తేలిపోతాడు.
రజనీకాంత్ స్క్రీన్ మీద వున్నప్పుడు ఎలాంటి సీన్ అయినా రాసుకోవచ్చు. కానీ లోకేష్ రజనీ మానియా వాడాలనుకోలేదు. అలాగని కొత్త రజనీని చూపించే ప్రయత్నం జరగలేదు. జైలర్ లో నెల్సన్ రజనీ స్టార్ పవర్ ని వాడిని విధానం ఓ కొత్త అనుభూతిని ఇచ్చింది. కూలీలో ‘పవర్ హౌస్’ అంటూ ఒక బ్యాక్ స్టొరీ రాసుకున్నారు కానీ అది అంతగా పండలేదు. రజనీ డీఏజింగ్ లుక్ మాత్రం బావుంది. శ్రుతి హాసన్ కి లెన్తీ రోల్ పడింది. అయితే ఆ పాత్రలోని ఎమోషన్ తెరపైకి ఎఫెక్టివ్ గా రాలేదు.
లోకేష్ సినిమా అంటే అనిరుధ్ పూనకం వచ్చేలా మ్యూజిక్ ఇస్తాడు. కానీ కూలీలో ఆ మ్యాజిక్ తప్పింది. బిజీఎంతో ఎలివేట్ చేయడానికి సరైన సీన్స్ పడలేదు. దీంతో మ్యూజిక్ సోసోగానే సాగింది. ప్రొడక్షన్ డిజైన్ లో క్యాలిటీ వుంది. ఫస్ట్ హాఫ్ లో సస్పెన్స్ కంటిన్యూ చేసే ఎడిటింగ్ స్టయిల్ బావుంది కానీ సెకండ్ హాఫ్ లో చాలా వరకూ ఫ్లాట్ అయిపొయింది. రజనీ సినిమా అంటే వైరల్ డైలాగులు వుంటాయి. కూలీలో అలాంటి మెరపులు కనిపించలేదు.
ఒక సినిమా కోసం దేశమంతా ఎదురుచూడడం చాలా అరుదు. అలాంటి అరుదైన అవకాశం కూలీ సినిమాకి వచ్చింది. కూలీలో ఒక స్టార్ ఆర్మీ ఉంది. రాజు, సైన్యాధ్యక్షుడు, మంత్రి, దుర్భేద్యమైన సైన్యం.. ఇలా అన్ని శాఖలు బలంగా ఉన్నప్పుడు యుద్ధంలో తేలిపోవడం అన్నది ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తన కథ, కథనంలో లోపాలు ఉన్నాయని లోకేష్ కి ముందే తెలుసేమో. అందుకే స్టార్స్ తో నింపేసి దాన్ని మేనేజ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ ఎంత మంది స్టార్స్ ఉన్నప్పటికీ కథ, కథనాల్లో లోపాలుంటే అది ఖచ్చితంగా తేలిపోతుంది. కూలీతో అది మరోసారి రుజువైయింది.
తెలుగు360 రేటింగ్: 2.25/5