ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంలో ఆల్ ఈజ్ నాట్ వెల్ అన్నట్లుగా కనిపిస్తోంది. సమన్వయం అసలు కనిపించడం లేదు. రాజకీయ పరంగానే కాదు.. పాలన విషయంలోనూ అదే లోపం కనిపిస్తోంది. ముఖ్యంగా టీడీపీ, జనసేన మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ చాలా ఎక్కువగా ఉంది. ఈగోలకు పోతున్నారో… ఓ పార్టీ ఎక్కువగా బెండ్ అయిపోతోందన్న భావనో కానీ .. దీనివల్ల .. అనే పరిణామాలకు కారణం అవుతున్నాయి. అత్యవసరంగా కూటమిపార్టీలు ఇప్పుడు తమ మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉండకుండా చూసుకుని.. పరిస్థితుల్ని చక్కబెట్టుకోవాల్సిన అవసరం కనిపిస్తోంది.
ఇతర శాఖల్లో పవన్ జోక్యం – సమన్వయలోపం
పవన్ కల్యాణ్ హోంశాఖ విషయంలో జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఓ డిఎస్పీ స్థాయి అధికారి ఆయన నేరుగా ఎస్పీతో మాట్లాడితే తప్పు లేదు. కావాలంటే ఆయన నేరుగా సీఎంతో మాట్లాడి ఆ అధికారి గురించి విచారణ చేయించి అక్కడి నుంచి బదిలీ చేయించవచ్చు. కానీ ఇదంతా బయటకు రావాల్సిన అవసరం లేదు. పాలనలో అంతర్గతంగా జరిగిపోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారని.. దానిపై నివేదిక కావాలని డీజీపీని అడిగినట్లుగా ప్రచారం జరిగింది. ఇలాంటివి అన్నీ జనసేన, డిప్యూటీ సీఎం అధికారిక హ్యాండిల్స్ లోనే బయటకు తెలుస్తాయి. దీని వల్ల సంబంధిత మంత్రిని అవమానించినట్లే అవుతుంది. ఈ విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ఇలాంటివి అన్ని ప్రభుత్వాల్లోనూ ఉంటాయి. సమన్వయం చేసుకోవడమే ముఖ్యం.
పార్టీ పరంగానూ కోఆర్డినేషన్ కరువు
పార్టీ పరంగానూ రెండు పార్టీల మధ్య కోఆర్డినేషన్ కరవు అయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. కూటమి అంటే.. ఓ లీడర్ బలంగా ఉన్నాడని అతన్ని జీరో చేసి ఇతర పార్టీకి మేలు చేయడం కాదు. అందరూ బలంగా ఉండాలి. ఎవరు బలహీనపడినా కూటమి బలహీనపడుతుంది. అధికారం ఉంది కాబట్టి.. పదవుల కోసం.. పనుల కోసం చాలా మంది కార్యకర్తల పేరుతో బ్లాక్ మెయిల్ చేస్తూంటారు. అలాంటి వాటిని పార్టీలు ఎప్పటికప్పుడు చెక్ పెట్టాలి. ఒక పార్టీపై మరో పార్టీ బ్లాక్ మెయిల్ కు పాల్పడితే విశ్వసనీయత తగ్గిపోతుంది. పై స్థాయిలో ఆత్మీయంగా ఉంటే సరిపోదు.. అది కింది స్థాయి వరకూ ఉండాలంటే.. మంచి కోఆర్డినేషన్ ఉండాల్సిన అవసరం కనిపిస్తోంది.
పాలనే కాదు.. పార్టీలపైనా దృష్టి పెట్టాల్సిన సమయం !
ప్రస్తుతం కూటమి పార్టీలు పూర్తిగా పాలనపైనే దృష్టి పెట్టాయి. చంద్రబాబు లోకేష్.. ఏపీకి పెట్టుబడులు సాధించడానికి.. ప్రపంచవ్యాప్త పెట్టుబడిదారుల్ని ఆకర్షించేందుకు అవిశ్రాంత ప్రయత్నాలు చేస్తున్నారు. నవంబర్ లో నిర్వహించనున్న సీఐఐ ఇన్వెస్టర్స్ సమ్మిట్ తో రాష్ట్ర భవిష్యత్ ను మార్చడానికి గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ తర్వాత అయినా.. కూటమి మధ్య పాలనలో.. రాజకీయాల్లో సమన్వయం చేసుకునేందుకు ప్రయత్నించాలి. పరిస్థితుల్ని గాడిలో పెట్టుకోవాలి. లేకపోతే కూటమి స్ఫూర్తి నీరుగారిపోతుంది.
