ఎన్నికలకు ముందు విచారణ కూడా చేయకుండా ఇతర పార్టీల్లో చేరని వారిపై కూడా అనర్హతా వేటు వేసిన మండలి చైర్మన్.. ఇప్పుడు తాము రాజీనామా చేశాం ఆమోదించండి అని కోర్టుకు వెళ్లినా ఆమోదించడం లేదు. కోర్టు ఆదేశాలతో విచారణ ప్రక్రియ అంటూ సాగదీస్తున్నారు. ఎలాగైనా రాజీనామాలు చేసిన వారి మనసు మార్చాలని వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది.
ఇప్పటికే జకియా ఖానం అనే బీజేపీలో చేరిన ఎమ్మెల్సీ మనసు మార్చి రాజీనామాను ఉపసంహరించుకునేలా చేశారు. ఇప్పుడు మిగిలిపోయిన మరో ఐదుగురు ఎమ్మెల్సీలకు వ్యక్తిగతంగా రావాలని నోటీసులు జారీ చేశారు. మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ రాజీనామాలు చేసి ఇతర పార్టీల్లో చేరిపోయారు. మర్రి రాజశేఖర్, బల్లి కళ్యాణ చక్రవర్తి, కర్రి పద్మశ్రీ టీడీపీలో , పోతుల సునీత బీజేపీలో, జయమంగళ వెంకటరమణ జనసేనలోచేరిపోయారు.
మామూలుగా అయితే వీరిపై అనర్హతా వేటు వేయాలని వైసీపీ ఫిర్యాదు చేయాలి. కానీ రాజీనామా చేసినా.. తమ పార్టీకే చెందిన మండలి చైర్మన్ పై ఒత్తిడి చేసి ఆమోదించకుండా చేసుకుంటున్నారు. రాజీనామాలు ఆమోదిస్తే ఒక్కటి కూడా వైసీపీకి రాదు. అందుకే ఈ వేచి చూసే ధోరణిలో ఉన్నారు. వారిలో ఎవరైనా మనసు మార్చుకుంటారేమోనని ఆశపడుతున్నారు. ఇటీవల అసెంబ్లీలో జయమంగళ వెంకటమరణ.. తాను రోజూ లేవగానే జగన్ రెడ్డికి దండం పెట్టుకుంటానని మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ లో చెప్పారు. అసలు విషయం ఏమిటంటే ఆయనకు రాజకీయ జీవితం ఇచ్చింది టీడీపీ. టీడీపీ ఇంచార్జ్ అని పిలిచి వైసీపీలో చేర్చుకుని ఎమ్మెల్సీ చేశారు. అయితే ప్రభుత్వం మారగానే రాజీనామా చేయడమే కాకుండా.. ఆమోదించాలని కోర్టుకు కూడా వెళ్లారు.
ఇప్పుడు ఆయనతో రాజీనామాను ఉపసంహరింపచేస్తారో .. లేకపోతే ఆయన కూడా వైసీపీ ఇక అవసరం లేదని అంటారో చూడాల్సి ఉంది. మిగిలిన ఎమ్మెల్సీలతోనూ .. చర్చలు జరుపుతున్నట్లుగా చెబుతున్నారు.
