వివేకా హత్య కేసులో సంచలనం నమోదు అయింది. సీబీఐ దర్యాప్తును కొనసాగించేందుకు సీబీఐ కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కాల్ రికార్డ్స్ ఆధారంగా దర్యాప్దు చేసేందుకు సీబీఐకి.. కోర్టు అనుమతి ఇచ్చింది. తన తండ్రి వివేకాను దారుణంగా హత్య చేసిన వారు.. సూత్రధారుల్ని పట్టుకోవాలంటే.. మరింత లోతైన దర్యాప్తు అవసరం అని సునీత దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం ఈ తీర్పు ఇచ్చింది. తదుపరి దర్యాప్తు అవసరం లేదని.. హత్య కేసు నిందితుల చేసిన వాదనలను తోసి పుచ్చింది.
గతంలో వివేకా హత్య కేసులో దర్యాప్తుకు సుప్రీంకోర్టు గడువు పెట్టడంతో.. ఆగిపోయింది. అయితే అలా ఆగిపోయే సమయానికి వివేకా హత్య గురించి బయట ప్రపంచానికి తెలియక ముందే.. జగన్ కు, భారతికి తెలుసని సీబీఐ గుర్తించింది. ఆ మేరకు కోర్టుకు కూడా చెప్పింది. వివేకా హత్య జరిగిన రోజున తెల్లవారుజామున నాలుగు గంటలకే జగన్. తన బాబాయ్ ఇక లేరని ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్న కొంత మందికి చెప్పారు. వారిలో మాజీ సీఎస్ కల్లాం అజేయరెడ్డి ఉన్నారు. ఆ విషయాన్ని ఆయన సీబీఐకి వాంగ్మూలం ఇచ్చారు.తర్వాత మాట మార్చినా అప్పటికే అది కోర్టు రికార్డుల్లోకి పోయింది.
ఇలా ఎలా తెలుస్తుందన్న అనుమానాలు అందరిలో ఉన్నాయి. తన తండ్రి హంతకుల్ని ఖచ్చితంగా శిక్షించాల్సిదేనని పట్టుదలగా ఉన్న సునీత.. కోర్టుల చుట్టూ తిరిగి దర్యాప్తును కొనసాగించేందుకు అనుమతి తెచ్చుకున్నారు. ఇప్పుడు అసలు కథ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.
