కొండా సురేఖకు ప్రజాప్రతినిధుల కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. రాజకీయ విమర్శలు చేయడానికి బదులు నాగార్జున కుటుంబంలోని వ్యక్తులకు.. కేటీఆర్కు అభ్యంతరకర సంబంధాలు అంటగట్టి చేసిన ఆరోపణలపై కేటీఆర్ వంద కోట్లకు పరువు నష్టం పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ పై కోర్టు విచారణ జరుపుతోంది.కేటీఆర్ వైపు నుంచి సాక్ష్యాల నమోదు ప్రారంభమయింది. కోర్టుకు హాజరు కావాల్సి ఉన్నాకొండా సురేఖ హాజరు కావడం లేదు. దీంతో కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసి వచ్చే ఏడాది పిబ్రవరి ఐదో తేదీకి తదుపరి విచారణను వాయిదా వేసింది.
ఇలాంటి కేసే ముందుగా నాగార్జున దాఖలు చేశారు.ఆయన కూడా చాలా సీరియస్ గా కోర్టులో ప్రొసీజర్ ప్రకారం అన్ని సాక్ష్యాలు ఇప్పించారు. అయితే ఏం జరిగిందో ఏమో కానీ కొండా సురేఖ ఓ అర్థరాత్రి క్షమాపణలు చెబుతూ ట్వీట్ చేశారు.తర్వాత రోజే నాగార్జున తన పిటిషన్ ను వెనక్కి తీసుకున్నారు. ఆమె చెప్పిన క్షమాపణలతో సంతృప్తి చెందారు. కానీ కొండా సురేఖ.. కేటీఆర్ కుమాత్రం ఎలాంటి క్షమాపణలు చెప్పలేదు. అలాంటి ఆలోచన కూడా చేయలేదు. దాంతో ఆ కేసు కొనసాగుతోంది.
కొండా సురేఖ చేసినవి రాజకీయ విమర్శలు కాదు. అభ్యంతరక వ్యాఖ్యలు. రెండు కుటుంబాల్లోని మహిళలను అవమానపరిచే మాటలు. ఆ మాటల వల్ల ఆయా కుటుంబాలపై సోషల్ మీడియాలో ఎన్నో రకాలుగా చర్చలు జరిగాయి. మహిళా మంత్రిగా కొండా సురేఖ చేయాల్సిన వ్యాఖ్యలు కాదని అందరూ అభిప్రాయం వ్యక్తం చేశారు. అయితే నాగార్జునకు సారీ చెప్పిన కొండా సురేఖ..కేటీఆర్ విషయంలో మాత్రం న్యాయపరంగానే తేల్చుకుందామని అనుకుంటున్నారు.