ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని వైసీపీ నుంచి పొమ్మనలేక పొగపెడుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. పార్టీలో ఆదరణ లేక.. పట్టించుకునేవారు లేక చాలా రోజులుగా చెన్నైకే పరిమితమైన మాగుంట.. .. ఇప్పుడు ప్రజల కష్టాల్లో భాగం పంచుకోవాలని.. ప్రభుత్వం సాయం చేసే వరకూ వేచి చూడకుండా.. తన సొంత ఖర్చుతో ఆదుకోవాలని ప్రయత్నిస్తున్నారు. కానీ సొంత పార్టీ నేతలే అంగీకరించని పరిస్థితి ఏర్పడింది.
ఒంగోలు రిమ్స్‌కు మాగుంట శ్రీనివాసులరెడ్డి…తన సొంత ఖర్చుతో.. ఆక్సిజన్ సిలిండర్లను ఏర్పాటు చేశారు. అలాగే ఎనభై పడకలతో ఆక్సిజన్ సౌకర్యం ఉన్న కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దానికి కలెక్టర్ అనుమతి తీసుకున్నారు. మాగుంట కోవిడ్ కేర్ సెంటర్ అని పేరు కూడా పెట్టి పనులు ప్రారంభించారు. కానీ హఠాత్తుగా మాగుంట కోవిడ్ కేర్ సెంటర్ కాస్తా.. బాలినేని కోవిడ్ కేర్ సెంటర్‌గా పేరు మారిపోయింది. దీంతో ఆశ్చర్యపోవడం.. మాగుంట వంతయింది. తాను నిధులు ఇచ్చి.. కోవిడ్ కేర్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తే.. బాలినేని పేరు పెట్టడం ఏమిటని ఆరా తీస్తే షాకింగ్ విషయాలు వెల్లడయ్యాయి.
సొంత ఖర్చుతో మాగుంట కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేస్తే ఆయనకు మంచి పేరు వస్తుందని.. ఆయన ఫీలయ్యారు. వెంటనే.. అధికారులను పిలిచి.. మాగుంట ఎంత విరాళం ఇచ్చారో అంతా తాను ఇచ్చేస్తానని.. మాగుంట పేరు తీసేసి.. తన పేరు పెట్టాలని హుకుం జారీ చేసేశారు. ప్రభుత్వంలో మాగుంట కన్నా… బాలినేనికే పలుకుబడి ఎక్కువ. ఆయన జగన్‌కు దగ్గరి బంధువు. దాంతో అధికారులు మాగుంట పేరు పీకేసి.. బాలినేని పేరును కోవిడ్ కేర్ సెంటర్‌కు చేర్చారు. దీంతో మాగుంటకు అవమానం ఎదురయినట్లయింది. ఇంత దారుణమైన అవమాన్ని గతంలో ఎప్పుడూ చూడలేదని ఇప్పుడు సొంత పార్టీ నేతలు.. అవమానిస్తున్నారని ఆయనవర్గీయులు ఆవేదన చెందుతున్నారు.