ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన దగ్గర నుంచీ వరుసగా సన్మానాలు అందుకుంటున్నారు కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు. ఈ క్రమంలో చాలా విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు. ఏం సాధించారని ఆయన సన్మానాలు అందుకుంటున్నారు అని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఇలా వెంకయ్య సన్మానాలపై రాజకీయ వర్గాల్లో పలు విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా శనివారం నాడు తిరుపతిలో ఒక సభను ఏర్పాటు చేశారు. దీన్లో ప్రత్యేక ప్యాకేజీపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కూడా మరోసారి వెంకయ్య సన్మానం చేయించుకుంటున్నారు. అయితే, వెంకయ్య నాయుడు తిరుపతికి వస్తున్న సందర్భంలో వామపక్ష నేతల్ని పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ స్పందించారు. ఈ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు.
తిరుపతిలో వెంకయ్య సన్మానం చేయించుకుంటూ ఉంటే వామపక్షాలకు చెందినవారిని అరెస్టు చేయాల్సిన అవసరం ఏముందని ఆయన మండిపడ్డారు. చుట్టూ పోలీసులను పెట్టుకుని, దిగ్బంధనం చేసేసి, ఆ మధ్య జరుగుతున్నది సన్మానమా, సంతాపమా అని నారాయణ ఎద్దేవా చేశారు. వెంకయ్య సభకీ వామపక్షాల నేతల అరెస్టుకీ సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. ‘మీకు నిజంగానే దేశంపై ఏమాత్రం భక్తి ఉన్నా… ఈ సమయంలో సన్మానాలు అందుకోవడం సరికాదు. ముందుగా దేశం కోసం ప్రాణాలు విడిచిన అమరవీరులకు సంతాపం సభ ఏర్పాటు చేయండి. అలాంటి సభలకు తమ మద్దతు కూడా ఉంటుంది” అని నారాయణ మండిపడ్డారు.
వెంకయ్య – నారాయణల మధ్య విమర్శల పర్వం మొదలైందంటే ఇద్దరూ ఏమాత్రం తగ్గరనేది గతానుభవం. ఇంతకుముందు ఇలానే ఓ అంశంపై విమర్శలకు దిగుతూ పంచెకట్టుపై పంచ్ లు వేసుకున్నారు. వెంకయ్య పంచె ఊడదీసి కొట్టాలని, ఆయన పంచెలో ఏమీ లేదని నారాయణ విమర్శిస్తే… తన పంచెలో ఏముందో అనే ఆసక్తి నారాయణకు ఎందుకో, పంచెలో ఏముందో ఆయనకి తెలియదా అంటూ వెంకయ్య తనమార్కు పంచ్ వేశారు. తాజాగా వెంకయ్య సన్మానాల నేపథ్యంలో నారాయణ విమర్శల పర్వానికి తెర తీశారు. దీనిపై వెంకయ్య ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.