సీపీఐ అగ్రనేత, కమ్యూనిస్టు ప్రముఖుడు సీపీఐ నారాయణలో ఏ మూలో బీజేపీ భావజాలం ఉన్నట్లుగా ఎవరికైనా అనిపిస్తే అందులో వింతేం ఉండదు. ఎందుకంటే ఆయన బూర్జువా విధానాల మీద కాకుండా.. ఎక్కువగా బిగ్ బాస్ షోలు.. మిస్ వరల్డ్ కాంటెస్టుల మీద మాట్లాడుతూ ఉంటారు ఇతర విషయాల మీద మాట్లాడినా.. ఓ కమ్యూనిస్టు లీడర్ వీటిపై మాట్లాడితే వచ్చే ఫోకస్ వేరు. ఈ విషయం ఆయనకు బాగా తెలుసు. అందుకో మరోసారి మాట్లాడారు. ఈ సారి మిస్ వరల్డ్ పోటీల మీద పడ్డారు.
హైదరాబాద్లో ప్రెస్మీట్ పెట్టిన ఆయన తెలంగాణ మంత్రులంతా సొల్లు కార్చుకుంటూ అందాల పోటీల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించేశారు. తెలంగాణ, హైదరాబాద్ నగరం అంతా అందాల భామల చుట్టే తిరుగుతోందని ప్రభుత్వం ఉద్యోగుల జీతాలు పెంచరు కానీ.. అందాల భామల కోసం కోట్లల్లో ఖర్చు పెట్టేది సొల్లు కార్చుకోవడానికా అని ప్రశ్నించారు. అసలు ఉద్యోగుల జీతాలు పెంచడానికి, మిస్ వరల్డ్ పోటీలకు పెట్టే పాతిక కోట్లకు లింక్ ఎక్కడ ఉందో సీపీఐ నారాయణకే తెలియాలి.
గతంలో బిగ్ బాస్ మీద ఆయన ఓ రేంజ్ లో విరుచుకుపడేవారు. ఎంతగా దాన్ని ఓ అసాంఘిక కార్యకలాపాల షోగా చెప్పేవారు. కోర్టులో పిటిషన్లు కూడా వేశారు. ఆ షోపై ఆయనకు ఎందుకు అంత కోపం వచ్చిందో ఎప్పుడూ చెప్పలేదు. కానీ బీజేపీ నేతుల చెప్పినట్లుగా ఆ షో సంస్కృతి, సంప్రదాయాలను నాశనం చేస్తూ యువతను పెడదోవ పెట్టేలా చేస్తోందని ఆరోపిస్తారు. మిస్ వరల్డ్ పోటీలను కూడా బీజేపీ అనుబంధ సంస్థలు వ్యతిరేకించాయి. సీపీఐ నారాయణ కూడా వ్యతిరేకించారు.