పవన్ కల్యాణ్‌కు వ్యక్తిగతంగా సనాతన ధర్మంపై నమ్మకం లేదని సీపీఐ నేత కె. నారాయణ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ అనుసరిస్తున్న సనాతన ధర్మం కేవలం రాజకీయ వ్యూహమని … కేంద్రంలోని ప్రధాని మోదీ, అమిత్ షాల మెప్పు పొందేందుకే పవన్ తన వేషభాషలను మార్చుకున్నారని ఆయన ఆరోపించారు. కేవలం బిజెపి అగ్రనేతల ప్రశంసల కోసం, వారి అజెండాను అమలు చేయడానికే ఈ “సనాతన ధర్మం” అనే నినాదాన్ని ఎత్తుకున్నారని ఆయన తన విశ్లేషణ చెప్పారు.
సనాతన ధర్మంలో విడాకులకు తావులేదని, కానీ పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం అందుకు భిన్నంగా ఉందని నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. సనాతన ధర్మం గురించి మాట్లాడే అర్హత పవన్‌కు లేదని ఆయన వాదించారు. పవన్ అనుసరిస్తున్న విధానాలు ఆ ధర్మానికి విరుద్ధంగా ఉన్నాయని, అటువంటి వ్యక్తి సనాతన ధర్మం గురించి ప్రచారం చేయడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. అభ్యుదయ భావాలు ఉండాల్సిన ఒక ఉపముఖ్యమంత్రి హోదాలో ఉండి, పాతకాలపు పద్ధతులను, సనాతన ధర్మాన్ని నెత్తికెత్తుకోవడం రాష్ట్ర ప్రజల దురదృష్టమని నారాయణ చెప్పుకొచ్చారు. పవన్ కళ్యాణ్ తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
పవన్ కల్యాణ్ గతంలో తనవి కమ్యూనిస్టు భావాలు అని చెప్పారు. కమ్యూనిస్టులతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు కూడా. అప్పట్లో పవన్ తో సీపీఐ నారాయణ తరచూ సమావేశమయ్యేవారు. తర్వాత పవన్ తన రాజకీయ వ్యూహాన్ని మార్చుకున్నారు. కమ్యూనిస్టులకు దూరమయ్యారు. అదే ఇప్పుడు అదే ఆయన ఆగ్రహానికి కారణంగా కనిపిస్తోంది.
