ఊరంతా ఓ దారి.. ఉలిపికట్టెది మరో దారి అని అంటారు. దేశ రాజకీయాల్లో కమ్యూనిస్టులది అదే దారి. చిక్కి శల్యమై.. రాజకీయ సమాధికి దగ్గరగా ఉన్న కమ్యూనిస్టులు కనీసం మారే ప్రయత్నం కూడా చేయడం లేదు. ఇప్పటికీ బూజు పట్టిన బూర్జువా రాజకీయాలు చేస్తే.. ప్రచారంలో ఉండాలనుకుంటున్నారు. ఆ పార్టీ వృద్ధ నాయకత్వం తమతోనే కమ్యూనిజం లేకుండా పోవాలని కోరుకుంటున్నారు. అలాంటి వారిలో నారాయణ ఒకరు.
సనాతన ధర్మం పేరుతో పవన్ పై అవాకులు,చెవాకులు
సనాతన ధర్మంపై అనుచిత వ్యాఖ్యల్ని చేసి కుల, మత రాజకీయాలు చేసే వారిని అరెస్టు చేయాలని పవన్ కల్యాణ్ ఎప్పుడో అన్నారు. ఇప్పుడు నారాయణ నిద్ర లేచారు. అసలు సనాతన ధర్మాన్ని సమర్థించేవారిని అరెస్టు చేయాలని …ఎడ్డేమంటే, తెడ్డేమనే విధానంతో వీడియో రిలీజ్ చేశారు. ఇందులో పవన్ పై అనుచిత వ్యాఖ్యలు ఉన్నాయి. వ్యక్తిగత జీవితంపై కామెంట్లు ఉన్నాయి. సనాతన ధర్మం అంటే కుల, వర్ల వివక్ష అని తనకు తాను చెప్పుకున్నారు. అసలు ఇప్పుడు ఈ మాటలు మాట్లాడాల్సిన అవసరం ఏమిటి? సందర్భం ఏమైనా ఉందా ?
కమ్యూనిస్టుల బుర్రల్లో ఇంకా అదే బూజు
సనాతన ధర్మం అంటే తన ఉద్దేశంలో మానవత్వం అని.. అందర్నీ సమానంగా చూడటం అని పవన్ కల్యాణ్ చాలా సార్లు చెప్పారు. హిందూత్వానికి సంబంధించి ఒక్క సనాతన ధర్మాన్నే విమర్శించడం సమానత్వం కాదని అంటున్నారు. ఇతర మతాల గురించి కూడా అలా మాట్లాడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి వివక్ష చూపించడం వల్ల సమాజంలో చీలికలు వస్తున్నాయని అందరూ సమానంగా ఉండాలంటే.. సనాతన ధర్మాన్ని కూడా గౌరవించాలని అంటున్నారు. కానీ ఇతర వర్గాల ఓట్ల కోసం సనాతన ధర్మాన్ని విమర్శించడం కొన్ని పార్టీలకు ఫ్యాషన్ గా మారింది. దీన్నే పవన్ ప్రశ్నించారు. కానీ నారాయణ ఏం మాట్లాడుతున్నారు ?
కమ్యూనిస్టులకు భవిష్యత్ ఉందా ?
నారాయణ వంటి నేతలు కమ్యూనిజాన్ని అంతం చేస్తున్నారు. ఎంతో స్ఫూర్తివంతమైన సిద్ధాంతాల నుంచి పార్టీలను వ్యక్తిగత ప్రయోజనాల కోసం.. శిథిలంగా మార్చారు. యువ నాయకత్వాన్ని పెంచుకోలేదు. వయసుడిగిపోయి ఇంట్లో ఉండాల్సిన సమయంలోనూ ఆయన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ కమ్యూనిజంపై వ్యతిరేకత పెంచుతున్నారు. తాను మాత్రం ప్రచారం పొందుతున్నారు. కమ్యూనిస్టుల్లో తర్వాత తరం నాయకత్వం ఎక్కడ ఉంది?. ఎవరో తెలుసా?. హిందూత్వాన్ని తిట్టి ఇతర వర్గాలను సంతోషపట్టే రాజకీయం ఎప్పటికీ రాజకీయం కాదు.. విజయవంతం కాలేరు. నారాయణ లాంటివాళ్లు ఇప్పటికీ నేర్చుకున్నా ప్రయోజనం ఉండదు. ఎందుకంటే చేయి దాటిపోయింది.