ఏబీ డివిలియర్స్ ఆట తీరు గురించి పరిచయం అవసరం లేదు. ప్రొఫెషనల్ క్రికెట్ కెరీర్‌ను ముగించినప్పటికీ ఏబీ అంటే క్రేజ్ తగ్గలేదు. తాజాగా వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ 2025లో పాల్గొన్న ఏబీడీ.. తన దేశానికి ఒంటిచేత్తో టైటిల్ సాధించిపెట్టాడు. నిన్న రాత్రి పాకిస్థాన్ ఛాంపియన్స్‌తో జరిగిన వరల్డ్ ఛాంపియన్షిప్ ఆఫ్ లెజెండ్స్ ఫైనల్లో ఏబీడీ అద్భుత సెంచరీతో జట్టుకు విజయాన్ని అందించాడు.
ఈ టోర్నీలో టీమిండియా ఛాంపియన్స్ టీమ్ సెమీ ఫైనల్ నుంచి తప్పుకోవడంతో పాకిస్థాన్ టీమ్ నేరుగా ఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. దీంతో దక్షిణాఫ్రికాతో తలపడాల్సి వచ్చింది. ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 195 పరుగులు చేసింది. అనంతరం ఛేజింగ్‌కు దిగిన సఫారీ జట్టు.. ఏబీ డివిలియర్స్ విధ్వంసంతో మరో 19 బంతులు మిగిలి ఉండగానే 9 వికెట్ల తేడాతో టైటిల్‌ను అందుకుంది.
ఏబీడీ ఈ టోర్నీలో అద్భుతంగా రాణించాడు. ఏకంగా మూడు సెంచరీలు చేశాడు. ఫైనల్లోనూ 60 బంతుల్లో 120 రన్స్ చేసి అజేయంగా నిలిచాడు. ఒంటిచేత్తో తన జట్టుకు టైటిల్ అందించాడు. మొత్తానికి రిటైర్ అయ్యాక తన దేశానికి ఒక వరల్డ్ టైటిల్‌ను అందించడం ఏబీ అభిమానుల్లో ఆనందం నింపింది.
ఈ టోర్నీలో ఏబీ ఆట తీరుని చూసిన క్రికెట్ ప్రముఖులు ప్రశంసలు కురిపించారు. మరోవైపు అభిమానులు ఏబీడీ మళ్లీ క్రికెట్ కొనసాగించాలని కోరుతున్నారు. ఇప్పుడు ఐపీఎల్లో స్టార్ ప్లేయర్స్‌గా కొనసాగుతున్న చాలా మంది ఆటగాళ్ల కంటే ఏబీడీ ఎన్నో రెట్లు బెస్ట్, తను ఆట కొనసాగిస్తే వేలంలో అత్యధిక ధర పలికే ఆటగాడు అవుతాడని సోషల్ మీడియాలో అభిప్రాయపడుతున్నారు.