అధికారంలో ఉన్న వారికి కోటరీ పెద్దసమస్యగా మారుతుంది. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వారి తరపున పనులు చక్కబెట్టాడనికి కొంత మంది నమ్మకమైన వాళ్లు ఎప్పుడూ ఉంటారు. అయితే అంత మాత్రాన వారిని కోటరీ అనలేం. ఇతరులకు యాక్సెస్ లేకుండా చేయడం.. బయట ఏం జరుగుతుందో సీఎంకు తెలియనివ్వకపోవడం, తెలిసినా అదంతా ప్రతిపక్షాల రాజకీయాలు అని నమ్మించే భ్రమలో ఉంచడం ప్రారంభిస్తే కోటరీ గురించి చర్చ ప్రారంభమవుతుంది. ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చుట్టూ అదే చర్చ జరుగుతోంది.
రేవంత్ చుట్టూ ఉండే వారి వల్లే సమస్యలని ప్రచారం
రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఇద్దరి పేర్లు ప్రచారంలో ఉన్నాయి. వారిలో ఒకరు వేం నరేందర్ రెడ్డి, మరొకరు రోహిన్కుమార్ రెడ్డి. ఇటీవలి కాలంలో వీరిద్దరిపై కాంగ్రెస్ పార్టీలో అంతర్గతంగా ఎక్కువగా చర్చ జరుగుతోంది. ఈ కోటరీలో సీఎం సోదరుల పేర్లుఎక్కువగా వినిపించవు. ఒక సోదరుడు కొడంగల్ వ్యవహారాలు మాత్రమే చూసుకుంటారు. మిగతా విషయాల్లో ఆయన జోక్యం చేసుకున్నట్లుగా ఆరోపణలు లేవు. కానీ సలహాదారుగా ఎప్పుడూ రేవంత్ రెడ్డి పక్కనే ఉండే.. వేంనరేందర్ రెడ్డి.. సీఎం ఎక్కడికి వెళ్లినా కనిపించే రోహిన్కుమార్ రెడ్డిపై మాత్రం ఆరోపణలు వస్తున్నాయి.
వివాదాస్పదంగా మారుతున్న రోహిన్పై ఆరోపణలు
కొండా సురేఖ విషయంలో రోహిన్కుమార్ రెడ్డి పేరు ఎక్కువగా ప్రచారంలోకి వచ్చింది. తుపాకీతో ఆయన డక్కన్ సిమెంట్స్ యాజమాన్యాన్ని బెదిరించారని ఆరోపణలు వచ్చాయి. అలాగే టాలీవుడ్ విషయంలో ఆయన మితిమీరి జోక్యం చేసుకుంటున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. సినిమా నిర్మాతగా కూడా ఆయన కొంత అనుభవం ఉండటంతో ఆ వ్యవహారాలను రేవంత్ తో ఉన్న సాన్నిహిత్యం మేరకు చక్క బెడుతున్నారని అంటున్నారు. అలాగే అధికారిక హోదాలోనే వేంనరేందర్ రెడ్డి చాలా పనులు చక్క బెడుతున్నారు. తమ పనులు జరగని వారు ఆయనపై విమర్శలు గుప్పిస్తున్నారు.
వెంటనే చెక్ పెట్టకపోతే మరిన్ని ఆరోపణలు
కోటరీ గురించి ఎక్కువగా ప్రచారం జరగక ముందే రేవంత్ రెడ్డి స్పందించాల్సి ఉంది. వారిని దూరం చేసుకోవడం సమస్య పరిష్కారం కాదు. కానీ వారిపై వస్తున్న ఆరోపణల విషయంలో మాత్రం కాస్త క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని విషయాలు తనకు తెలుస్తున్నాయన్న సంకేతాలు పంపించడం కూడా రేవంత్ రెడ్డికి ముఖ్యమేనని రాజకీయవర్గాలు చెబుతున్నాయి. కోటరీ వల్ల సీఎంకు ఏమీ తెలియడం లేదని ..ఆయన అందుబాటులో ఉండటం లేదన్న భావన వస్తే ఎక్కువ నష్టం ఆయనకే జరుగుతుంది.
