ప్రజలకు రేషన్ సరుకుల పంపిణీ బాధ్యతలు చూసే పౌర సరఫరాల శాఖలో అవినీతి తారా స్థాయిలో ఉంటుందనేది బహిరంగ రహస్యమే. రేషన్ షాపుల్లో సరుకుల పంపిణీయే కాదు, ధాన్యం కొనుగోలు కేంద్రాలు, మిల్లర్ల ధాన్యం నాణ్యతనుపరీక్షించడం వంటి చాలా పనులు ఈ శాఖ చేస్తుంది. కాబట్టి అధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకూ చాలా మంది అవినీతికి అలవాటు పడ్డారు. ఈ పరిస్థితిని మార్చడానికి ఆ శాఖ కమిషనర్ సీవీ ఆనంద్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు.
అధికారికగా ఆనంద్ ట్రాక్ రికార్డ్ చాలా ఘనమైంది. ఆయన ఐ పి ఎస్ అధికారి. ఆయన్ని పౌరసరఫరాల శాఖ కమిషనర్ గా సుమారు మూడు నెలల క్రితం నియమించినప్పుడు కొందరు ఐ ఎ ఎస్ అధికారులు నిరసన తెలిపారని వార్తలు వచ్చాయి. ఆ శాఖకు ఐ ఎ ఎస్ లనే కమిషనర్ గా నియమించడం ఆనవాయితీ అని ప్రభుత్వం వద్ద వాదించారట. అయితే ఆ శాఖలో అవినీతిని అరికట్టడానికి ఆయనే కరెక్టని ప్రభుత్వం చెప్పిందని వార్తలు వచ్చాయి.
ఆనంద్ వచ్చిన తర్వాత ఆ శాఖలో భారీగానే మార్పులు కనిపిస్తున్నాయి. చివరకు చాలా మంది మిల్లర్ల లీలలు కూడా ఆగిపోయాయట. కానీ ఉద్యోగుల్లోనే ఇంకా చాలా మంది అవినీతి మానడం లేదు. అందుకే,
వారిపై ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చేయి చాచకుండా బతకలేరా అని ప్రశ్నించారు. ఎవరెక్కడ లంచాలు తీసుకుంటున్నారో తెలుసని హెచ్చరించారు. మిల్లర్ల దగ్గర పర్సంటేజీలు మానుకోవాలని సూచించారు. నలుగురికి ఉద్వాసన పలికారు. ఆనంద్ వచ్చిన తర్వాత పౌరసరఫరా రెవెన్యూలో కూడా పెరుగుదల నమోదైందని సమాచారం. ఆ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేయడానికి ఆనంద్ కంకణం కట్టుకున్నారట.
ఆనంద్ కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ ట్రాఫిక్ అదనపు కమిషనర్ గా ఉన్నకాలంలో అనేక వినూత్న పద్ధతులను అనుసరించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు ఆయన తీసుకున్న చర్యల వల్ల నగరంలో వాహనాల సగటు వేగం పెరిగింది. ఆ తర్వాత సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా అనేక సంస్కరణలు చేపట్టారు. షి టీమ్స్ ఆయన ఆలోచనే అంటారు.
క్యాబ్ లపై నిరంతర నిఘా, తనిఖీ, మై వెహికిల్ ఈజ్ సేఫ్ అనే పత్రాలు జారీచేసి మహిళల భద్రతకు చర్యలు తీసుకోవడం ఆయన సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడే జరిగాయి. సైబరాబాద్ కమిషనర్ గా తనదైన ముద్ర వేయడం వల్లే ఆనంద్ ను పౌర సరఫరాల కమిషనర్ గా నియమించారు. ఆ శాఖలో జీరో కరప్షన్ కాకపోయినా మినిమం కరప్షన్ అనే ఆనంద్ లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందో చూద్దాం.