తుఫాన్ మొంథా అనూహ్యంగా తెలంగాణ మీదకు రావడం.. తెలంగాణ రైతులకు తీవ్ర నష్టం కలిగించింది. తుపాను దాగుడు మూతలు ఆడిందని.. కాకినాడ వద్ద తీరం దాటుతుందని అనుకుంటే.. అంతర్వేది వద్ద తీరం దాటి..తెలంగాణ వైపు వెళ్లిందని చంద్రబాబు సమీక్షలో అన్నారు. ఏపీలో నెల్లుూరులో అత్యధికంగా 24 సెంటిమీటర్ల వర్షం పడితే.. వరంగల్ లో 40 సెంటిమీటర్ల వర్షం పడిందన్నారు. ఎవరూ ఊహించని విధంగా తెలంగాణపై మొంథా ఎఫెక్ట్ పడిందని తెలిపారు. అంటే.. తుపాను తీరం దాటిన ఏపీ కంటే..తెలంగాణలోనే ఎక్కువ నష్టం జరిగిందని చంద్రబాబు చెప్పకనే చెప్పారు.
వరంగల్, ఖమ్మం పూర్తి స్థాయిలో నీట మునిగాయి.వాగులు, వంకలు పొగ్గి పొర్లిపోయాయి. ఇలాంటి పరిస్థితి వస్తుందని ప్రభుత్వం కూడా ఊహించకపోవడంతో కనీసం అలర్ట్ చేయలేకపోయారు. వర్షాలు పడితే ఓ మాదిరి వర్షాలు పడతాయని అనుకున్నారు. కానీ ఇలా.. ఒక్క సారిగా మిన్ను విరిగి మీద పడుతుందని అనుకోలేదు. దీంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అప్రమత్తమయ్యారు. అప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి రైతుల్ని ఆదుకునే చర్యలకు ఆదేశించారు.
తుఫాన్ మొంథా.. మొదటి నుంచి కాకినాడ వద్ద తీరం దాటి.. ఒడిషా వైపు వెళ్తుందని అనుకున్నారు. తీరం దాటేందుకు బలపడుతున్న సమయంలో.. తీవ్ర ప్రభావం చూపింది. కోస్తా ప్రాంతంలో భారీ వర్షాలు పడ్డాయి. కానీ తీరం దాటడానికి వచ్చేటప్పుడే అసలు అనూహ్యంగా కదలడం ప్రారంభమయింది. చివరికి తెలంగాణకూ ఇబ్బందికరంగా మారింది.