ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాన్ని వణికించిన మొంథా తుఫాను నర్సాపురం వద్ద తీరం దాటింది. అక్కడ్నుంచి తెలంగాణ మీదుగా చత్తీస్ ఘడ్ వైపు వెళ్తూ బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు. ఈ ప్రభావం వల్ల ఏపీతో పాటు తెలంగాణలోనూ భారీ వర్షాలు పడనున్నాయి. గాలులు కూడా వీస్తాయి కానీ తీవ్రత కాస్త తక్కువగా ఉండనుంది. తీరం దాటిన దగ్గర నుంచి గాలుల తీవ్రత తగ్గుతూ వస్తుంది. ప్రస్తుతం ఏపీలోని కోస్తా ప్రాంతాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. గాలుల తీవ్రత తగ్గుతోంది.
గాలుల తీవ్రతకు పలు చోట్ల విరిగిపడిన చెట్లు
తుపాను కోస్తా తీరాన్ని తాకిన సమయంలో గాలులు బీభత్సం సృష్టించాయి. పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు నేలవాలాయి. అయితే ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ముందుగానే కరెంట్ నిలిపివేయడంతో పాటు చెట్లను తొలగించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసింది. అదే సమయంలో హైవేలు, ప్రమాదకరంగా ఉంటాయని భావించే రహదారులపై వాహనాలను నియంత్రించారు. ఉదయం ఆరు గంటల నుంచి.. రోడ్లపై ఎలాంటి ఆటంకాలు లేదనుకున్న తర్వాతే వదిలి పెట్టారు.
అప్రమత్తతతో మేలు !
తుపాను గమనంపై నాలుగు రోజుల నుంచి స్పష్టత ఉండటంతో ప్రభుత్వం పూర్తి స్థాయిలో అప్రమత్తమయింది. వీలైనంత వరకూ ఆస్తి నష్టాన్ని.. ఒక్క ప్రాణనష్టం కూడా ఉండకూడదన్న ఉద్దేశంతో ప్రణాళికాబద్ధంగా వ్యవహరించింది. ఎక్కడెక్కడ సహాయ బృందాలు అవసరం అవుతాయో పక్కాగా అంచనా వేసి రెడీ చేసి పెట్టుకున్నారు. వృద్ధుల్ని, గర్భిణీలను ముందుగానే ఆస్పత్రికి తరలించారు. ప్రభుత్వం ఇలా అప్రమత్తంగా చర్యలు తీసుకోవడం ఆస్తి, ప్రాణ నష్టాలు వీలైనంత తగ్గడానికి ఉపయోగపడింది.
మరో రెండు రోజులు వర్షాలు కొనసాగే అవకాశం
తుపాను దాటిపోయింది. అయితే వర్షాలు మాత్రం రెండు రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రభుత్వం సహాయబృందాలను యాక్టివ్ గా ఉంచాలని నిర్ణయించుకుంది. గాలుల కారణంగా పడిపోయిన చోట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగిస్తున్నారు. విద్యుత్ సరఫరాకు సమస్యలు ఏర్పడిన చోట్ల.. చాలా వరకూ ఇప్పటికే క్లియర్ చేశారు. సముద్రంలో అలలు అంతే తీవ్రంగా ఉంటాయి కాబట్టి మరో రెండు రోజులు మత్స్యకారులు చేపల వేటకు వెళ్లవద్దని ప్రభుత్వం సూచించింది. వారికి యాభై కేజీల బియ్యం ప్రభుత్వం పంపిణీ చేస్తోంది.
