డీయ‌స్ కి అంత అవ‌మానం జ‌రిగిందా..?

ఫిరాయింపు నేత‌ల‌కు ప‌ద‌వులు ద‌క్కొచ్చు. కానీ, పార్టీలో ఆశించిన స్థాయి గౌర‌వం ద‌క్కుతుందా.. అంటే, అనుమాన‌మే! ఎందుకంటే, వేరే పార్టీ నుంచి వ‌చ్చిన నాయ‌కుల్ని.. ఎప్ప‌ట్నుంచో పార్టీలో ఉన్న‌వారు ఓన్ చేసుకోవ‌డం అనుకున్న ఈజీ కాదు. పార్టీలు మారి ప‌ద‌వులు పొందిన కొంత‌మంది సీనియ‌ర్లు ఇలాంటి అనుభ‌వాలే ఎదుర్కొంటున్నారు. రెండుసార్లు పీసీసీ అధ్య‌క్షుడిగా ఉన్న సీనియ‌ర్ కాంగ్రెస్ నాయ‌కుడు డి. శ్రీ‌నివాస్ తెరాస‌లో చేరిన సంగ‌తి తెలిసిందే.

తెరాస‌లో చేరిన త‌రువాత ఆయ‌న‌కు బాగానే గౌర‌వం ద‌క్కిందని చెప్పాలి. స‌ల‌హాదారు ప‌ద‌వి ఇచ్చారు. సీనియ‌ర్ నేతగా ఆయ‌న‌కి తెరాస‌లో మంచి స్థాన‌మే ఇచ్చార‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే, తెరాస ప్లీన‌రీలో మాత్రం ఆయ‌న‌కి స‌ముచిత స్థానం ద‌క్క‌లేద‌ని స‌మాచారం. ఆయ‌న కాంగ్రెస్ లో ఉండ‌గా ఏ కార్యక్ర‌మానికి వెళ్లినా అగ్ర‌తాంబూలం ల‌భించేది. ఆయ‌న్ని వేదికపైకి సాద‌రంగా ఆహ్వానం ప‌లికేవారు. కానీ, ప్లీన‌రీలో మాత్రం ఆయ‌న‌కి అలాంటి గుర్తింపు, మర్యాద ల‌భించ‌లేద‌ని ఓ క‌థ‌నం చ‌క్క‌ర్లు కొడుతోంది. డి. శ్రీ‌నివాస్ కు ప్లీనరీలో చేదు అనుభ‌వం ఎదురైంద‌ని అంటున్నారు. ఇంత‌కీ ఆ చేదు అనుభ‌వం ఏంటంటే… అల‌వాటు ప్ర‌కారం వేదిక మీద కూర్చునేందుకు డి. శ్రీనివాస్ వెళ్లార‌ట‌. అయితే, అక్క‌డకి వెళ్లాక చూస్తే త‌న‌కంటూ ఏ కుర్చీ ఖాళీ లేద‌ట‌.

మాములూగా అయితే.. ఆయ‌న్ని చూడ‌గానే ఎవ‌రో ఒక‌రు లేచి సీటు ఇవ్వ‌డం కాస్త మ‌ర్యాద‌. కానీ, అందుకు భిన్నంగా హైద‌రాబాద్ మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్ ఈయ‌న ద‌గ్గ‌ర‌కి వ‌చ్చార‌ట‌. ప‌క్క‌కు తీసుకెళ్లి చెవిలో ఏదో చెప్పార‌ట‌. దీంతో అక్క‌డి నుంచి డీయ‌స్ నిష్క్ర‌మించార‌ని స‌మాచారం. ఈ విధంగా డీయ‌స్ కు ప్లీన‌రీలో స‌ముచిత స్థానం ద‌క్క‌లేద‌నీ, ఆయ‌న‌కు చేదు అనుభ‌వం ఎదురైంద‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చెప్పుకుంటున్నారు. అయితే, ఇదే విష‌య‌మై డీయ‌స్ ఇంత‌వ‌ర‌కూ స్పందించింది లేదు.

కాంగ్రెస్ లో ఉండ‌గా డీయ‌స్ కు చాలా గౌర‌వం ఉండేది. ఆయ‌న మంత్రిగా ప‌నిచేశారు, శాస‌న‌మండ‌లిలో ప్ర‌తిప‌క్ష నేతగా బాధ్య‌త‌లు నిర్వ‌హించారు. అంత‌టి అనుభ‌వం క‌లిగిన నేత‌కు ఇది క‌చ్చితంగా చేదు అనుభ‌వ‌మే అని చెప్పాలి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com