వేసవి సినిమాల రిలీజ్ డేట్లు ఒకొక్కటిగా ఫిక్సవుతున్నాయి. పెద్ది, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్లు అఫీషియల్ గా చెప్పేశారు. పారడైజ్ డేట్ కూడా ఒకట్రెండు రోజుల్లో ప్రకటిస్తారు. జూన్ చివరి వారంలో ఈ సినిమాని విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పుడు మీడియం రేంజ్ సినిమాలు సైతం మంచి రిలీజ్ డేట్ కోసం చూస్తున్నాయి. నిఖిల్ ‘స్వయంభూ’ ఏప్రిల్ 10న విడుదల చేసే అవకాశం ఉందని టాక్. రిలీజ్ డేట్ గ్లింప్స్ కూడా రెడీ చేస్తున్నారని, ఈ వీకెండ్ లో దాన్ని వదలొచ్చని టాక్. నిఖిల్ కథల ఎంపిక బాగుంటుంది. వైవిధ్యమైన స్క్రిప్టులకు ఓటేస్తాడు. ‘స్వయంభూ’ విజువల్ ఎఫెక్ట్స్ కి ప్రాధాన్యం ఉన్న సినిమా. ఫిబ్రవరిలో రావాల్సిన సినిమా ఇది. వీఎఫ్ఎక్స్ విషయంలో రాజీ పడకపోవడంతో సినిమా లేట్ అయ్యింది. మార్చి నాటికి ఫస్ట్ కాపీ సిద్ధం చేసుకొని, ఏప్రిల్ లో రిలీజ్ చేద్దామనుకొంటున్నారు. వాళ్ల టార్గెట్ ఏప్రిల్ 10నే.
మరోవైపు అడవిశేష్ – మృణాల్ ఠాకూర్ నటించిన ‘డెకాయిట్’ సైతం ఏప్రిల్ 10నే రిలీజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. రిలీజ్ డేట్ విషయంలో త్వరలో ఓ క్లారిటీ రాబోతోందని టాక్. ఇటీవల విడుదల చేసిన గ్లింప్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘కన్నెపెట్టరో’ పాటకు మోడ్రన్ టచ్ ఇచ్చి.. టీజర్ లో వాడుకొన్న విధానం ఆకట్టుకొంది. పైగా అడవిశేష్ మంచి ఫామ్ లో ఉన్నాడు. తన జోనర్ మార్చి ఈ సినిమా చేశాడు. మాస్ అంశాలు బాగా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది.
వేసవి సీజన్లో ఒకే రోజు రెండు మీడియం రేంజ్ సినిమాలు రావడం తప్పేం కాదు. ఆ స్పేస్ ఉంటుంది. కాకపోతే.. ఎవరైనా సరే, ఈ రోజుల్లో సోలో రిలీజ్ కోరుకొంటున్నారు. ఈ రెండు సినిమాలూ సోలో రిలీజ్ కావాలనుకొంటే మాత్రం ఒకరు తగ్గాల్సిందే.
