దానం నాగేందర్ తాను కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేనని ప్రకటించుకున్నారు. ఆయన గెలిచించి బీఆర్ఎస్ బీఫాం మీద. తాను కాంగ్రెస్ లో ఉన్నానని ఆయన స్పీకర్ కు లేఖ ద్వారా చెప్పడం లేదు. స్పీకర్ నోటీసులకు ఇప్పటి వరకూ వివరణ ఇవ్వలేదు. అయినా బయట మాత్రం
“నేను కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.. నేను కాంగ్రెస్ ఎమ్మెల్యేనే” అంటూ ఆయన ప్రకటించేశారు. రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించడమే లక్ష్యమని, గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న డివిజన్లలో కాంగ్రెస్ .. ఎంఐఎం సహకారంతో అన్ని డివిజన్లు గెలుస్తుందన్నారు.
బీఆర్ఎస్ గుర్తుపై గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఆయన స్పీకర్ కు మాత్రం ఇప్పటి వరకూ అలాంటి సమాధానం ఇవ్వకుండా ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. లఫిరాయింపు ఎమ్మెల్యేలు ఏ పార్టీలో ఉన్నారో తనకు తెలియదని, తన వరకు తాను మాత్రం కాంగ్రెస్ వాదినేనని దానం చెప్పుకొచ్చారు. బయట మైకుల ముందు ఇంత ధైర్యంగా తాను కాంగ్రెస్ ఎమ్మెల్యేనని చెప్పుకుంటున్న దానం నాగేందర్, ఇదే విషయాన్ని అసెంబ్లీ స్పీకర్ ముందు లేదా కోర్టు విచారణలో చెప్పగలరా అన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న.
ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు పడే అవకాశం ఉన్నప్పుడు మాత్రం, సాంకేతికంగా తాను ఇంకా బీఆర్ఎస్ సభ్యుడినేనని వాదించే నాయకులు, బయట మాత్రం ఇలాంటి సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. స్పీకర్ నోటీసులకు సమాధానం ఇచ్చేటప్పుడు కూడా ఇదే నిబద్ధతను ఆయన ప్రదర్శిస్తారా అని బీఆర్ఎస్ వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశం సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది.
