తెలంగాణ రాజకీయాలు ఆసక్తికర మలుపులు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. ఎమ్మెల్యేగా బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ తరపున ఎంపీగా పోటీ చేసిన దానం నాగేందర్ రాజీనామా చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇతర ఎమ్మెల్యేలు తాము పార్టీ ఫిరాయించలేదని వాదిస్తున్నారు. దాన్ని బీఆర్ఎస్ నిరూపించలేదు. కానీ దానం నాగేందర్ మాత్రం కాంగ్రెస్ తరపున పోటీ చేశారు కాబట్టి ఆయన రాజీనామా చేయక తప్పని పరిస్థితి ఏర్పడుతోంది. ఇప్పుడు రాజకీయాలు కూడా కలసి వస్తున్నాయి కాబట్టి రాజీనామా చేయడం ద్వారా మంత్రి పదవిని టార్గెట్ గా పెట్టుకోవాలని డిసైడయినట్లుగా చెబుతున్నారు.
జూబ్లిహిల్స్ ఉపఎన్నిక జరగాల్సి ఉంది. దాంతో పాటు ఖైరతాబాద్ ఉపఎన్నిక జరిగేలా చూసుకునేందుకు దానం రెడీ అయ్యారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రాజీనామా చేసి.. రెండు స్థానాల బాధ్యతల్ని తీసుకుని.. రెండింటిని గెలిపిస్తే మంత్రి పదవి ఇస్తామన్న ఆఫర్ కాంగ్రెస్ నుంచి వచ్చినట్లుగా తెలుస్తోంది. అందుకే ఇటీవల ఆయన మళ్లీ బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. ఈ రెండు స్థానాల్లో దానం బాధ్యతలు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి మరింత అడ్వాంటేజ్ అవుతుంది. ఆయనకు ఈ రెండు చోట్ల మంచి పట్టు ఉంది.
దానం నాగేందర్ మంత్రి పదవి మీద గురి పెట్టారు. అందు కోసం ఆయన దేనికైనా సిద్ధంగా ఉన్నారు. అధికార పార్టీ అడ్వాంటేజ్ తో పాటు.. గ్రేటర్ లో బీఆర్ఎస్ రాజకీయాల కారణంగా ఆ పార్టీకి ఆదరణ తగ్గిపోయిందని నమ్ముతున్నారు. ఆ పార్టీ ప్లేస్ లో ప్రత్యర్థిగా బీజేపీ రంగంలో ఉంటుంది. ఆ రెండు పార్టీల మధ్య ఓట్లు చీలిపోతాయి. ఎలా చూసినా కాంగ్రెస్ పార్టీకి ప్లస్ పాయింట్ కనిపిస్తోందని అందుకే దానం .. రాజీనామాకు సిద్ధమవుతున్నారని భావిస్తున్నారు. డైనమిక్ రాజకీయాలు చేయడంలో రేవంత్ రెడ్డికి ప్రత్యేక శైలి ఉంటుంది. ఇద్దరూ కలిసి.. గ్రేటర్ లో రాజకీయాలు మార్చాలనుకుంటే.. దూకుడుగా ఉంది. గ్రేటర్ ఎన్నికలు కూడా ఇద్దరు నేతలకు కీలకమే.