జూబ్లిహిల్స్ టిక్కెట్ విషయంలో దానం నాగేందర్ కూడా ఓ ప్రయత్నం చేశారు. అక్కడ గెలిచిన వారికి మంత్రి పదవి ఖాయమన్న అభిప్రాయం ఉండటంతో ఎవరికో ఎందుకు ఆ చాన్స్ తానే తీసుకుంటానని ప్రతిపాదన పెట్టారు. తాను ఎంపీగా కాంగ్రెస్ తరపున పోటీ చేసినందున.. తన అనర్హతపై నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చని.. రాజీనామా చేయాల్సిన పరిస్థితి వస్తుందని ఆయన అనుకుంటున్నారు. అందుకే ముందుగానే రాజీనామా చేసి.. జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేస్తానంటున్నారు.
జూబ్లిహిల్స్ నియోజకవర్గంలోనూ దానంకు మంచి పట్టు ఉంది. మంత్రి పదవి కోసం రిస్క్ తీసుకునేందుకు ఆయన ఏ మాత్రం సంకోచించడం లేదు. అయితే దానం ప్రతిపాదనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంత ఆసక్తి చూపించలేదని కాంగ్రెస్ పార్టీ వర్గాలంటున్నాయి. రాజీనామా చేసే పరిస్థితి రాదని.. అనర్హతా వేటు అనే అంశం అసలు చర్చకే రాదని దానంకు సర్దిచెప్పినట్లుగా తెలుస్తోంది. అయితే దానం మంత్రి పదవి అంశంపై ఆయన క్లారిటీ ఇవ్వలేకపోతున్నారు.
జూబ్లిహిల్స్ నుంచి పోటీ చేయడానికి ఓ ఎమ్మెల్యేతో రాజీనామా చేయించడం కూడా మంచిది కాదని అనుకుంటున్నారు. లోకల్ గా పేరు ఉన్న అభ్యర్థిని నిలబెట్టడం ద్వారా మంచి ఫలితం సాధించాలని అనుకుంటున్నారు. గతంలో రెండు సార్లు పోటీ చేసి ఓడిపోయిన చిన్న శ్రీశైలం యాదవ్ కుమారుడు నవీన్ యాదవ్ వైపే రేవంత్ మొగ్గుతున్నారు. ఆయన అయితే మజ్లిస్ కూడా మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.