ఒసేయ్ రాములమ్మ దాసరి నారాయణరావు కెరీర్లోనే ఆఖరి.. బ్లాక్ బ్లస్టర్. ఆ తరవాత తనదైన సినిమాల్ని అందివ్వలేకపోయారు దాసరి. రాములమ్మ పాత్రని మరోసారి వెండి తెరపై చూపించాలన్నది ఆయన ఆశ, ఆలోచన. విజయశాంతి కూడా రాములమ్మ 2 లాంటి కథొకటి తయారు చేయించి… సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్రయత్నాలుచేసి విరమించింది. అయితే దాసరి మరోసారి రాములమ్మ పాత్రని తెరపై చూపించాలని భావిస్తున్నారు. ఆయనకు రాములమ్మ కూడా దొరికేసింది. ఈ నయా రాములమ్మ ఎవరో కాదు. మంచు లక్ష్మీ ప్రసన్న. మోహన్ బాబుకుటుంబానికీ దాసరి కీ ఉన్న అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. `మోహన్ బాబు పిల్లలంటే నా బిడ్డలే` అని చాలాసార్లు చెప్పారాయన. లక్ష్మీ ప్రసన్న సినిమా `లక్ష్మీ బాంబ్` ఆడియో ఫంక్షన్‌కి దాసరి విచ్చేశారు. ట్రైలర్ చూసి ముగ్థులైపోయారు. అందుకే… ‘మంచు లక్ష్మీని ఈ గెటప్పుల్లో చూస్తుంటే తనతో రాములమ్మ లాంటి సినిమా చేయాలనిపిస్తోంది’ అంటూ తన మనసులోని మాట బయటపెట్టారు. లక్ష్మీ ప్రసన్న కూడా స్టెప్పులేస్తుందని అనుకోలేదని, తాను అన్నిరకాల పాత్రలూ చేయగలదని ఈ సినిమాతో నిరూపించుకొంటుందన్న ఆశాభావం వ్యక్తం చేశారాయన.
”లక్ష్మి నా కళ్ల ముందు ఎదిగిన అమ్మాయి. నన్నూ మోహన్ బాబునీ ముందు పెట్టుకొని రవీంద్రభారతిలో ఓ నాటక ప్రదర్శన చేసింది. తన నటన చూసి కళ్లు చెమ్మగిల్లాయి. తొలి సినిమాలోనే విలన్ పాత్ర పోషించింది. ప్రతినాయకుడిగా నటించడం అంటే మామూలు విషయం కాదు. స్వచ్ఛమైన నటులే ఆ పాత్ర చేయగలరు. అలాంటిది తొలి సినిమాలోనే విలన్ గా చేసింది. తనతో రాములమ్మ లాంటి సినిమా చేయాలనిపిస్తోంది” అన్నారు దాసరి. ఆయన అనుకొంటే ఆలస్యం ఏముంది? రాములమ్మ 2కి రంగం సిద్దం అవుతున్నట్టే.