తెరాస ఎంపీలు ట‌చ్ లో ఉన్నార‌న్న ద‌త్తాత్రేయ‌..!

గ‌డ‌చిన లోక్ స‌భ ఎన్నిక‌ల్లో ముఖ్య‌మంత్రి కేసీఆర్ కుమార్తె క‌విత నిజామాబాద్ ఎంపీగా ఓడిపోయారు. అయితే, ఆ ఓట‌మి గురించి పెద్దగా చ‌ర్చ జ‌రిగితే… త‌మ‌కే ఇబ్బంద‌న్న‌ట్టుగా పార్టీ అంత‌ర్గ‌త విశ్లేష‌ణ‌ల్లో కూడా ఆ టాపిక్ కు తెరాస‌ ప్రాధాన్య‌త ఇవ్వ‌కుండా వ‌స్తోంది. చివ‌రికి, క‌విత కూడా ఓట‌మి గురించి ఇంత‌వ‌ర‌కూ వివ‌ర‌ణాత్మ‌కంగా మాట్లాడ‌కుండానే, ఇత‌ర అంశాల‌పై స్పందిస్తున్న ప‌రిస్థితి. అయితే, క‌విత ఓట‌మిని త‌మకు అనుకూలంగా ప్ర‌చారం చేసుకునే ప్ర‌య‌త్నంలో భాజపా నేత‌లున్నారు. సీనియ‌ర్ నేత, మాజీ కేంద్ర‌మంత్రి బండారు ద‌త్తాత్రేయ మాట్లాడుతూ… ముఖ్య‌మంత్రి కుమార్తె క‌విత ఓట‌మితోనే తెలంగాణ‌లో తెరాస‌కు ప‌త‌నం ప్రారంభ‌మైంద‌న్నారు. వినోద్ కుమార్ ఓట‌మి కూడా దానికే సంకేత‌మ‌న్నారు.

తెరాస నుంచి కొంత‌మంది ఎమ్మెల్యేలూ ఎంపీలూ త‌మ‌కు ట‌చ్ లో ఉన్నార‌ని ఆయ‌న చెప్ప‌డం ఒకింత సంచ‌ల‌న‌మే. డీఎస్ తోపాటు మ‌రికొంతమంది నేత‌లు త్వ‌ర‌లోనే భాజ‌పాలో చేర‌డం ఖాయ‌మ‌న్నారు. రాష్ట్రంలో భాజ‌పా ప్ర‌త్యామ్నాయ‌మ‌నే భావ‌న చాలామందిలో క‌లుగుతోంద‌న్నారు. తెరాస నేత‌లు కూడా అదే భావ‌న‌కు వ‌స్తున్నార‌నీ, స‌మ‌యం ఆస‌న్న‌మైనప్పుడు అంద‌రూ బ‌య‌ట‌కి వ‌స్తార‌నీ, ఆ స‌మ‌యం కూడా ద‌గ్గ‌ర్లోనే ఉంద‌న్నారు. ద‌క్షిణాదిన భాజ‌పా బ‌ల‌ప‌డుతోంద‌నీ, తెలంగాణ‌లో మ‌రింత బ‌లోపేతం కావ‌డం ఖాయ‌మ‌ని నిజా‌మాబాద్ లో జ‌రిగిన స‌భ్య‌త్వ న‌మోదు కార్య‌క్ర‌మంలో చెప్పారు.

భాజ‌పాలోకి తెలంగాణ‌కు చెందిన మరింతమంది ఎంపీలు రాబోతున్నార‌న‌డం క‌చ్చితంగా మైండ్ గేమ్ అన‌డంలో సందేహం లేదు. ఎలాగూ కాంగ్రెస్ బ‌లంగా క‌నిపించ‌డం లేదు, దాంతో చాలామంది త‌మ‌తో ట‌చ్ లో ఉన్నార‌ని ప్ర‌చారం చేసుకుంటే… కొంతమందైనా స‌హ‌జంగానే ట‌చ్ లోకి వ‌చ్చేసే అవ‌కాశం ఉంటుంది క‌దా! అయితే, కాంగ్రెస్ నుంచి ట‌చ్ లో ఉన్నారంటే కొంత ఓకే అనుకోవ‌చ్చు. కానీ, తెరాస నుంచి కూడా కొందరున్నారంటే… వారెవ‌రా అనే ఆస‌క్తి క‌లుగుతోంది. డీఎస్ తెరాస‌కు ఎప్ప‌ట్నుంచో దూరంగా ఉంటున్న ప‌రిస్థితి. ఆయ‌న చేరిక‌ను తెరాస నుంచి వ‌ల‌స‌గా చెప్పుకున్నా… అది తెరాస‌కు ఫ‌ర‌క్ ప‌డే అంశం కాదు. ప్ర‌స్తుతం తెరాస ఎంపీలుగా ఎమ్మెల్యేలుగా ఉంటున్న‌వారిలో కొంద‌ర్ని ఆక‌ర్షించే ప్ర‌య‌త్న‌మే చేస్తే…. అది భాజ‌పాకీ ప్ల‌స్ అవుతుంది. మ‌రి, ఆ ఆప‌రేష‌న్ కూడా ఇప్పుడు ఉండే అవ‌కాశాలున్నాయ‌న్న‌ట్టుగా ద‌త్త‌న్న వ్యాఖ్య‌లున్నాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com