సమీక్ష….డియర్ కామ్రేడ్

Telugu360 Rating – 2.75/5

“…ప్రారంభమైనపుడు ఎంతో అందంగా వుండే ప్రేమ, ముగిసేసరికి ఎందుకు ఇంత బాధపెడుతుంది…”

కాస్త అక్షరాలు అటు ఇటు అయినా, ఇలాంటి డైలాగ్ నే వుంది. డియర్ కామ్రేడ్ సినిమాలో.

విజయ్ దేవరకొండ, రష్మిక కాంబినేషన్, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణం, కొత్త దర్శకుడు భరత్ కమ్మ రెండేళ్ల కష్టం.

ఇవన్నీ కలిసి డియర్ కామ్రేడ్ థియేటర్ వైపు ఉత్సాహంగా అడుగులు వేసేలా చేస్తాయి. కానీ తీరా సినిమా అయిపోయన తరువాత బాగుందా? బాగులేదా? లెంగ్త్ ఎక్కువైందా? మరేమన్నా లోపమా?

ఇలాంటి ప్రశ్నలు కామన్ ఆడియన్స్ ను వెంటాడుతాయి.

అప్పుడు అనిపిస్తుంది.

“…ప్రారంభమైనపుడు ఎంతో ఆసక్తి అనిపించిన సినిమా, ముగిసేసరికి ఎందుకింత బాధపెడుతుంది..” అని.

కాస్త రియలిస్టిక్ ఎమోషనల్ డ్రామా గా తీయాలని దర్శకుడు భరత్ అనుకోవడం ఇలాంటి భావనకు కారణం అని సరిపెట్టుకోవడం ఎంత వరకు సబబు అన్నది కూడా ఆలోచించాల్సి వుంటుంది. కథలో బలం వుండి, దానికి సరిపడా సన్నివేశాలు సమకూరినపుడు, రియలిస్టిక్ అప్రోచ్ బాగుంటుంది తప్ప, సరైన సన్నివేశాలు లేనపుడు, ఆ అప్రోచ్ కావాలని కొని తెచ్చి పెట్టుకున్నట్లు వుంటుంది.

సాహిత్యంలో బ్రివిటీ ఆఫ్ వర్డ్స్ ఎంత అవసరమో, సినిమాకు షార్ప్ నెరేషన్ అంతకన్నా అవసరం. ఎంత పొయిటిక్ గా చెప్పాము అనే విషయంతో పాటు, ఎంత రంజింపచేసేలా చెప్పాము అన్నది కూడా చూసుకోవాలి. పైగా కథలో విస్తారమైన వ్యవహారం వున్నపుడు, నిడివిని ప్రేక్షకుడు క్షమిస్తాడు. అర్జున్ రెడ్డి సినిమా నిడివి మూడు గంటలు అయినా జనం మెచ్చుకున్నారు. కానీ డియర్ కామ్రేడ్ నిడివి చూసి మాత్రం నొచ్చుకుంటారు. అలా అని కత్తెర చేతికిస్తే చకచకా కట్ చేసేసే సీన్లు కనిపించవు. ఆ సన్నివేశాల కల్పన, వాటికి లీడ్, వాటి ఎగ్జిక్యూషన్ లోనే వుంది లోపం.

డియర్ కామ్రేడ్ లో మంచి లైన్ వుంది. మంచి విషయం వుంది. కమర్షియల్ సినిమాల్లో ఆవారాగా తిరుగుతూ, అందరి సమస్యలు భుజాన వేసుకునే హీరో, కాస్త పద్దతిగా వుండాలనుకునే హీరోయిన్ వైనం చాలా చూసాం. దాన్నే స్టూడెంట్ లీడర్ గా సమస్యలపై పోరాటం అవశ్యం అనుకునే హీరో, ప్రశాంతంగా బతకాలనుకునే మిడిల్ క్లాస్ అమ్మాయిగా మార్చారు. వాస్తవానికి ఇది మంచి ఐడియా కూడా. దీనికి ఓ మంచి మెసేజ్ ను జోడించారు. అది కూడా మంచి పనే.

కానీ ఈ ఐడియాను సినిమాగా మార్చడంలోనే తడబడ్డారు. సినిమా క్రమం చూస్తే, హీరో, హీరోయిన్, పరిచయం, ప్రేమ, కానీ ఇద్దరి ఐడియాలజీ కాన్ ఫ్లిక్ట్..బ్రేక్ అప్..మళ్లీ కలయిక..మళ్లీ అదే కాన్ ఫ్లిక్ట్..బ్రేక్ అప్..కానీ అక్కడే ముగింపు. కానీ ఈ లైన్ ఆఫ్ ఆర్డర్ మధ్య అల్లుకున్న అనవసరపు సీన్లు బోలెడు వున్నాయి.

అమ్మాయిని కావాలని దూరం చేసుకుని, దేశాలు పట్టిన హీరో మళ్లీ అమ్మాయితో మాట్లాడాలనుకున్నాడు. కానీ ఆ అమ్మాయి ఫోన్ దొరకలేదు. దాని కోసం దేశాలు పట్టి, పిచ్చోడు అయిపోవడం ఎందుకు? అన్ని రాద్దాంతపు సీన్లు ఎందుకు? అమ్మాయి ఇంటికి వెళ్లి పలకరించే ప్రయత్నం చేయవచ్చుగా?

సరే, అదలా వుంచుదాం. హీరోలో మార్పు వచ్చింది. అప్పుడు కూడా దేశాలు పట్టి తిరిగిన సీన్లు ఎందుకు? ఇంటికి వచ్చేయవచ్చుగా? సౌండ్ థెరపీ అన్న కొత్త పాయింట్ ను పక్కన పెట్టి, అది ద్వితీయార్థంలో అవసరం అన్నది తీసేసి, వేరే విధంగా చేసుకుంటే చాలా నిడివి తగ్గేది కదా?

దీనివల్ల కీలకమైన సీన్లు కూడా ప్రేక్షకుడి ఆసక్తికి నోచుకోకుండా పోయాయి. ఈ సాగదీత, ఆ అనవసరపు సీన్లు అన్నీ కలిసి సినిమాను కాస్త అనాసక్తికరంగా చేసాయి.

సినిమా తొలిసగం బాగానే టేకాఫ్ తీసుకుంటుంది. హీరోయిన్ పరిచయం తరువాత అది మరి కాస్త స్పీడ్ అందుకుంటుంది. హీరో, హీరోయిన్ల మధ్య వ్యవహారాలు అన్నీ ఆసక్తికరంగానే వుంటాయి. పాటలు, వాటి చిత్రీకరణ ఆకట్టుకుంటుంది. కానీ బ్రేక్ అప్ తరువాత నుంచి విశ్రాంతి మధ్యలో సీన్లు కానీ, ఇతరత్రా వ్యవహారాలు కానీ ప్రేక్షకుడిని కాస్త బోర్ ఫీలయ్యేలా చేస్తాయి.

వాస్తవానికి సినిమా ద్వితీయార్థంలోకి వచ్చాక ఈ స్లో నెరేషన్ అన్నది కాస్త తగ్గింది. అయితే అక్కడ మళ్లీ పెళ్లి సీన్లు, పాటలు పెట్టి, నడకకు బ్రేక్ వేసారు. అయితే సినిమా క్లయిమాక్స్ కు చేరుకున్న తరువాత, దాని చిత్రీకరణ, అక్కడ పండిన సీన్లు అన్నీ కలిసి సినిమా ఫరావాలేదు అనే భావన మిగిల్చే ప్రయత్నం చేసినట్లు అవుతుంది.

డియర్ కామ్రేడ్ కు అతి పెద్ద సమస్య విజయ్ దేవరకొండ గత సినిమాలు అర్జున్ రెడ్డి, గీత గోవిందం ప్రభావం చాలా భయంకరంగా వున్నట్లు కనిపిస్తుంది. విజయ్ దేవరకొండ క్యారెక్టరైజేషన్ పై అర్జున్ రెడ్డి ప్రభావం నూటికి నూరు పాళ్లు వుంది. అందులో సందేహం లేదు. అలాగే రొమాంటిక్, ఫ్యామిలీ సీన్ల మీద గీతగోవిందం ప్రభావం కొంత వరకు వుంది. గీత గోవిందం ప్రభావం వల్ల వచ్చిన నష్టం లేదు కానీ, అర్జున్ రెడ్డి ప్రభావం వల్ల బిల్డప్ లు ఎక్కువై, అనవసరపు సీన్లు అనేకం చోటుచేసుకున్నాయి.

సరే, ఇవన్నీ నెగిటివ్ సైడ్ అనుకుంటే, పాజిటివ్ సైడ్ చూస్తే, విజయ్ దేవరకొండ సినిమా ఫుల్ సపోర్ట్ గా నిల్చుకున్నాడు. డిఫరెంట్ షేడ్స్ ను చాలా ఈజీగా పండించాడు. అతనిదైన డైలాగ్ మాడ్యులేషన్ కానీ, చూపులు కానీ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. పాటల్లో రష్మిక తో కలిసి ఆల్ మోస్ట్ మ్యాజిక్ చేస్తాడు విజయ్.

వాళ్లద్దరి మధ్య కెమిస్ట్రీ అంత బాగా పండింది. విజయ్ కు తోడుగా రొమాంటిక్ సీన్లలో, అల్లరి సన్నివేశాల్లో రష్మిక చూపులు, హావభావాలు ఆకట్టుకుంటాయి. సినిమాకు సంభాషణలు పెర్ ఫెక్ట్ గా కుదిరాయి. అదే విధంగా నేపథ్యసంగీతం ప్రతి ఒక్కరి చేత బాగుంది అనిపించుకుంటుంది. రెండు మూడు పాటలు బాగుండడమే కాదు, వాటి చిత్రీకరణ కూడా బాగుంది. అదే విధంగా క్లయిమాక్స్ ను డీల్ చేసిన విధానం బాగుంది.

ఇవన్నీ బాగుండడంతో, బాగా లేని సీన్లు మైనస్ చేసుకుని, సినిమా బాగుందా? బాగాలేదా? అన్న డిస్కషన్ తో ఆడియన్స్ థియేటర్ బయటకు వస్తారు.

ఫినిషింగ్ టచ్… తిరగలి గిరా గిరా తిరిగినా దినుసు నలగలేదు అంటూ పాట వుంటుందీ సినిమాలోనే. ఇలా పాట రాయించుకున్న దర్శకుడు సన్నివేశాలు ఎన్ని తరుగుతున్నా, కథ ముందుకు ఎందుకు నడవలేదు అని ఆలోచించి వుంటే సినిమా ఇంకా బాగుండేది.

Telugu360 Rating – 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com