భారత రాష్ట్ర సమితి సోషల్ మీడియా కవితను టార్గెట్ చేసుకుని తమ పార్టీకి ఎంత నష్టం చేయాలో అంత నష్టం చేస్తోంది. కొత్తగా కేటీఆర్ కు కవితపై ప్రేమ ఉందా లేదా అన్న డిబేట్ ను ప్రారభించింది. అంత అవసరం ఏముందో కానీ.. జాగృతి సోషల్ మీడియా గట్టిగానే కౌంటర్ ఇస్తూ.. విషయాన్ని పెద్దది చేస్తున్నారు.
కవిత ఇటీవల ఓ ఇంటర్యూలో తనను బీజేపీ జైల్లో పెడితే కేటీఆర్ కూడా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ ఆరోపణలకు బీఆర్ఎస్ సోషల్మీడియా ఉలిక్కిపడి స్పందించింది. కవితను అరెస్టు చేయడానికి వచ్చినప్పుడు కేటీఆర్ అడ్డం పడ్డారని అప్పటి వీడియోలు చూపిస్తున్నారు. కానీ జాగృతి సోషల్ మీడియా మాత్రం అదంతా డ్రామానేనని.. కవితను త్వరగా జైలుకుపంపాలని ఈడీకి చెప్పారని.. జైలుకు తీసుకెళ్లేందుకు కారులో ఎక్కించుకున్న తరవాత హరీష్ రావు,కేటీఆర్ నవ్వుకున్నారని వీడియోలు పెట్టారు. కేటీఆర్ఎప్పుడూ కవితపై ప్రేమాభిమానాలు చూపించలేదని అంటున్నారు.
జాగృతి కార్యకర్తలు కొత్త కొత్త విషయాలు బయట పెడుతూండటంతో.. కేటీఆర్ మొదటి నుంచి కవితపై అంత సానుకూలంగా లేరన్నప్రచారం ప్రారంభమవుతోంది. కేటీఆర్ తన సోదరిపై ఎంతో ఆప్యాయంగా ఉంటారని నమ్మించేందుకు బీఆర్ఎస్ సోషల్ మీడియా తంటాలు పడుతోంది. కానీ ఇలాంటి చర్చ పెట్టి కేటీఆర్ పై కొత్త అనుమానాలు రేకెత్తించడంలో మాత్రం.. బీఆర్ఎస్ సోషల్ మీడియా సక్సెస్ అయింది. ఇదంతా ఆ పార్టీకి అవసరం లేని వివాదాలు తెచ్చి పెట్టడానికి తప్ప దేనికీ ఉపయోగపడవు.
