కొత్త నీరు ఎప్పుడూ ప్రవహిస్తూనే ఉండాలి. అప్పుడే నదికి జీవకళ. చిత్రసీమలోనూ అంతే. కొత్త హీరోలు, హీరోయిన్లు, నిర్మాతలు, దర్శకులు రావాల్సిందే. ముఖ్యంగా కొత్త దర్శకులు ఎంతగా వస్తే, చిత్రసీమ అంత కొత్తగా కనిపిస్తుంది. ప్రతీ యేటా కొత్త దర్శకులు పదుల సంఖ్యలో వస్తూనే ఉంటారు. కానీ వాళ్లలో మెరిసేది కొందరే. ఈ యేడాది కూడా కొత్త దర్శకుల హవా కనిపించింది. వాళ్లలో కొంతమంది విజయాలూ దక్కించుకొని, భవిష్యత్తుకు గట్టి పునాదులు వేసుకొన్నారు. కొత్త ఆశలు చిగురింపజేశారు.
ఈ యేడాది అందరికంటే ఎక్కువ ఆకట్టుకొన్న సినిమా ‘లిటిల్ హార్ట్స్’. రూ.3 కోట్లతో రూపొందించిన ఈ సినిమా ఏకంగా రూ.30 కోట్లు అందుకొంది. పది రెట్లు లాభాలు తెచ్చిపెట్టిన సినిమా తీస్తే… నిర్మాతలు ఎందుకు ఆగుతారు? అందుకే సాయి మార్తాండ్ వైపు అందరి కళ్లూ తిరిగాయి. బడా నిర్మాణ సంస్థల నుంచి ఈ కుర్ర దర్శకుడికి అడ్వాన్సులు అందాయి. నటుడు జగపతిబాబు కూడా ఈ కుర్రాడి ప్రతిభ మెచ్చి అడ్వాన్స్ ఇచ్చారు. తదుపరి సినిమా జగపతి ఆర్ట్స్ బ్యానర్ లోనే. నితిన్ కి కథ చెప్పి ఒప్పించినట్టు ఇన్ సైడ్ వర్గాల టాక్.
‘కోర్ట్’ సినిమాతో అందరి దృష్టిలో పడిన దర్శకుడు జగదీష్. నాని బ్యానర్ లో రూపొందించిన సినిమా ఇది. రిలీజ్‌కు ముందు గట్టిగా ప్రమోట్ చేశారు. సినిమాలో కూడా విషయం ఉంది. అందుకే పెద్ద విజయం సాధించింది. ఈ యేడాది ఎక్కువ వసూళ్లు సాధించిన చిన్న సినిమాల్లో ఒకటిగా కోర్ట్ నిలిచింది. త్వరలోనే నానితో ఓ సినిమా చేయబోతున్నాడట జగదీష్. ప్రస్తుతం స్క్రిప్టు పనులు జరుగుతున్నాయి. రామం – రాఘవం సినిమాతో దర్శకుడిగా అవతారం ఎత్తాడు ధనరాజ్. ఈ సినిమాతో దర్శకుడిగా మార్కులు కొట్టేశాడు. దర్శకుడిగా రెండో సినిమాపై ప్రస్తుతం కసరత్తులు మొదలెట్టాడు.
ఈ యేడాది ఫీల్ గుడ్ ఎమోషనన్తో సాగిన ఎంటర్టైన్ సినిమాల్లో ‘ది గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో’ ఒకటి. చిన్న పాయింట్ తో రెండుగంటల సినిమా నడిపిన విధానం ఆకట్టుకొంది. దాంతో.. దర్శకుడిగా రాహుల్ శ్రీనివాస్‌కి గుర్తింపు లభించింది. అడ్వాన్సులు అందాయి. ఓ యువ హీరోతో రాహుల్ ఓ సినిమా చేయబోతున్నాడని టాక్. ఈ యేడాది చివర్లో వచ్చిన ‘రాజు వెడ్స్ రాంబాయి’, ‘దండోరా’, ‘శంబాల’ సినిమాల దర్శకులకూ ఇదే తమ తొలి ప్రయత్నం. ఈ చిత్రాలు విమర్శకుల ప్రశంసలు అందుకొన్నాయి. ‘శంబాల’ అయితే ఆది సాయికుమార్‌కి చాలా కాలం తరవాత ఓ బ్రేక్ వచ్చేలా చేసింది. ఈ దర్శకులపై కూడా చిత్రసీమ దృష్టి పెట్టే అవకాశం ఉంది. వీరంతా 2026లో తమ కొత్త సినిమాలతో ప్రేక్షకుల్ని అలరించడం ఖాయం. మరి వీళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోందో?
