ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా లేదా దానికి తీసిపోని ప్రత్యేక ప్యాకేజి, ఇతర హామీలపై కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 2వ తేదీన ప్రకటన చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ కూడా రంగంలోకి దిగినట్లయితే ఈ సమస్య ఇంకా జటిలం అవుతుందనే భయం వల్ల కావచ్చు లేదా ఆయనని దూరం చేసుకొని రాష్ట్రంలో మరో బలమైన రాజకీయ ప్రత్యర్ధిని సృష్టించుకోవడం ఎందుకనే ఉద్దేశ్యంతో కావచ్చు..కారణాలు ఏవైతేనేమి ఈసారి కేంద్రప్రభుత్వం నిర్దిష్టమైన ప్రకటన చేయడానికి సిద్దం అవుతోంది. ఈసారైన మాట తప్పకుండా ప్రకటిస్తే అదే ఇంక రాష్ట్రానికి ఇచ్చే ఫైనల్ ప్యాకేజి అని భావించవచ్చు. కానీ ఈసారి కూడా న్యాయనిపుణుల సలహా రాలేదనో లేక మరొక కుంటిసాకుతోనో హామీల అమలు గురించి ప్రకటన చేయకపోతే కేంద్రప్రభుత్వం మళ్ళీ మోసం చేసిందని ప్రజలు ఆగ్రహం చెందవచ్చు. అప్పుడు పవన్ కళ్యాణ్ ప్రత్యేక హోదా కోసం పోరాటం మొదలుపెడితే ప్రజలందరూ ఆయనతో చేతులు కలిపే అవకాశం ఉంటుంది. అప్పుడు భాజపాతో సహా తెదేపా కూడా ప్రజాగ్రహానికి గురవడం తధ్యం. కనుక ‘కీలక సమావేశాలు’, ‘కమిటీలు, సంఘాలతో సంప్రదింపులు’ పేరుతో జాప్యం చేస్తే ఆ రెండు పార్టీలు చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవలసి రావచ్చు.
ఒకవేళ కేంద్రప్రభుత్వం సెప్టెంబర్ 2న ప్రత్యేక హోదాకి ప్రత్యమ్నాయంగా ప్రత్యేక ప్యాకేజిని ప్రకటించి మిగిలిన హామీల అమలు గురించి నిర్దిష్టమైన ప్రకటన చేసినట్లయితే, అప్పుడు పవన్ కళ్యాణ్ ఏవిధంగా స్పందిస్తారో చూడాలి. ఒకవేళ ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రకటనతో సంతృప్తి చెందినట్లయితే, తెదేపా-భాజపాలకి ఆయనే ఒక బలమైన ఆయుధంగా ఉపయోగపడవచ్చు. ఆయన ద్వారానే ప్రజలకి నచ్చజెప్పే ప్రయత్నం చేయవచ్చు. ప్రత్యేక హోదా కోసం పోరాటాలు మొదలుపెట్టేందుకు పవన్ కళ్యాణ్ వచ్చేనెల 9న కాకినాడలో బహిరంగ సభ నిర్వహించాలనుకొన్నారు. ఒకవేళ ఆయన కేంద్రం ప్రకటనతో సంతృప్తి చెందినట్లయితే, ఆయన చేత అదే సభలో ప్రత్యేక హోదాకి బదులుగా ఇస్తున్న ప్యాకేజి, రాయితీలు వగైరాల గురించి ప్రజలకి వివరింపజేయవచ్చు. లేదా కేంద్రం దిగివచ్చి హామీలు అమలుచేయడానికి సిద్దపడింది కనుక ఆ సభని రద్దు చేస్తున్నట్లు పవన్ కళ్యాణ్ ప్రకటించవచ్చు. సెప్టెంబర్ 2 తరువాతే అన్ని విషయాలపై స్పష్టత వస్తుంది కనుక అంతవరకు వేచి చూడక తప్పదు.