అయోధ్య సమస్య ఆధారంగా బలం పెంచుకోవడానికి ముందు నిలిచింది ఎల్‌కె అద్వానీ అయినా ఆయనకు ఆమోదయోగ్యత వుండదని అటల్ బిహారీ వాజ్‌పేయిని ప్రధానిగా ముందుకు తెచ్చారు.బిజెపి సిద్ధాంత బద్దమైన పార్టీ అనే ప్రచారం జోరుగా సాగుతుంటుంది. ఆరెస్సెస్ ఆజమాయిషీ దిశా నిర్దేశం కూడా జరుగుతుంటుంది. అయితే అంతిమంగా సంఘ పరివార్ అంతిమ సూత్రం మాత్రం అధికారం కైవశం చేసుకోవడమే. 2005లో జిన్నాపై ఆయన చేసిన వ్యాఖ్యల కారణంగా దూరం పెట్టారు. తర్వాత 2009లో ఒకసారి అద్వానీని ప్రధాని అభ్యర్తిగా ప్రకటించినా అది నామాకర్థమే.
2012 నుంచి అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీని ఆకాశానికెత్తుతూ ఆయన ప్రచార హౌరుతో ప్రధానిగా ప్రకటించారు. అద్వానీ దీన్ని జీర్ణించుకోలేకపోవడం తెలిసిన విషయమే. అయితే ఇప్పుడు మోడీ ముందు వారు చేయగలిగింది లేదు. మోడీ 2014 పార్లమెంటరీ పార్టీ తొలి సమావేశంలోనే దీనదయాళ్ ఉపాధ్యాయ పేరు ప్రస్తావించారు. మొన్న కేరళలో ఆయన శతజయంతి ఉత్సవాలను ఘనంగా ప్రారంబించారు. దీనదయాళ్ భావాల ప్రచారం భారీ ఎత్తున చేయబోతున్నారు. ఇందులో కనిపించని వ్యూహం వుంది. ఇప్పటి వరకూ వాజ్‌పేయి అద్వానీలే బిజెపికి అగ్రనేతలుగా వుంటూ వచ్చారు. ఎవరు ఆ పార్టీ అద్యక్షులుగా వున్న ముద్ర వీరిదే. దాన్ని చెరిపేసి మోడీని ప్రతిష్టించడానికి ఇదో అవకాశంగా భావిస్తున్నారు. వాజ్‌పేయి ఇప్పటికే మాట్లాడలేనిస్థితిలో నిస్సహాయంగా బతుకుతున్నారు. అద్వానీకి అంత ఆరోగ్య సమస్యలు లేకున్నా వార్థక్యం, నైరాశ్యం వెన్నాడుతున్నాయి. బిజెపిలో తరాల మార్పు జరగాల్సి వుంది. కనుకనే జనసంఫ్‌ు తొలితరం నాయకుడైన దీనదయాళ్ భావ జాలాన్ని ప్రచారం చేసి వారిద్దరి ముద్ర తగ్గించాలని ప్రయత్నిస్తున్నారు. ఈ క్రతువుతో బిజెపిలో ఇద్దరు పెద్ద నేతల కథ అధికారికంగా ముగిసిపోతుంది. వారు కూడా దీనదయాళ్ భావాలనే అనుసరించారని మోడీ ప్రత్యేకంగా వ్యాఖ్యానించడంలో సంకేతం అదే. ఇకమీదట బిజెపి ప్రచారంలో దీనదయాళ్ బొమ్మలే పెద్దగా వుంటాయి.