పార్టీ ఫిరాయించిన పది మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు ఒత్తిడితో స్పీకర్ ప్రసాద్ కుమార్ నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం పడింది. సుప్రీం నిర్ణయించిన గడువు డిసెంబర్ 18 ముంచుకొచ్చిన తరుణంలో ఐదుగురిపై పిటిషన్లు తిరస్కరించారు. మిగిలిన ఐదుగురిలో నలుగురివి కూడా తిరస్కరిస్తారు. ఒక్క దానం నాగేందర్ విషయాన్ని మాత్రం పెండింగ్ పెడతారు. ఆయన పార్టీ మారలేదని చెప్పి తప్పించుకునే అవకాశం లేదు. ఆయన సంగతి పక్కన పెడితే మిగతా 9 మంది ఎమ్మెల్యేలు సేఫ్ అయినట్లేనా అంటే.. చెప్పడం కష్టమే. దానికి కారణం కోల్ కతా హైకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు.
స్పీకర్ నిర్ణయాన్ని కొట్టి వేసి ఓ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసిన కోల్‌కతా హైకోర్టు
నవంబర్‌లో కోల్ కతా హైకోర్టు బీజేపీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచి తృణమూల్‌లో చేరిన ముకుల్ రాయ్ పై అనర్హతా వేటు వేసింది. మొదట స్పీకర్ వద్ద బీజేపీ అనర్హతా పిటిషన్ వేసింది. రెండేళ్ల పాటు విచారణ చేసిన స్పీకర్ .. పిటిషన్ ను తోసి పుచ్చారు. దీనిపై బీజేపీ హైకోర్టును ఆశ్రయించింది. విచారణ జరిపిన హైకోర్టు స్పీకర్ ఇచ్చిన నిర్ణయాన్ని కూడా రద్దు చేసి.. ముకుల్ రాయ్ పై అనర్హతా వేటు వేసింది. సభా వ్యవహారాల్లో స్పీకర్ నిర్ణయాన్ని హైకోర్టు కొట్టి వేయడానికి అవకాశం ఉందా లేదా అన్నదానిపై రాజ్యాంగపరమైన చర్చలు ఉన్నాయి. కానీ ఇక్కడ తీర్పు వచ్చేసింది. ఇంకా సుప్రీంకోర్టులో సవాల్ చేయలేదు. ముకుల్ రాయ్.. పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ గా ఉన్నారు.
అక్కడి పరిస్థితులే తెలంగాణలోనూ!
బెంగాల్లో ఒక్క ఎమ్మెల్యే గురించి హైకోర్టు ఇలాంటి తీర్పు వచ్చింది. ఒక్కరైనా పది మంది అయినా కోల్ కతా హైకోర్టు ఇచ్చిన తీర్పు ఇక్కడ కూడా అన్వయిస్తే మాత్రం పది మందిపై అనర్హతా వేటు వేయాలి . బెంగాల్ లో ముకుల్ రాయ్ లానే.. ఇక్కడ పది మంది బీఆర్ఎస్ తరపున గెలిచి కాంగ్రెస్ లో చేరారు. వారిపై అనర్హతా పిటిషన్లను స్పీకర్ తోసి పుచ్చుతున్నారు. కానీ వారు పార్టీ మారారన్నది మాత్రం బహిరంగసత్యం. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ పీఏసీ చైర్మన్ గా ఉన్నారు. ఇది కూడా బెంగాల్ హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సరిపోలింది. అందుకే బీఆర్ఎస్ పార్టీ మరింత ఆత్మవిశ్వాసంతో న్యాయపోరాటం చేయనుంది. ఇది పిరాయింపు ఎమ్మెల్యేలకు మరింత టెన్షన్ పుట్టించే అవకాశం ఉంది.
రాజ్యాంగం ప్రకారం స్పీకరే సుప్రీం
హైకోర్టులో గతంలో కొంత మంది ఎమ్మెల్యేలపై అనర్హతా వేటు వేసిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఎప్పుడూ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద మాత్రం అలాంటి అనర్హతా వేయలేదు. అఫిడవిట్లో తప్పులు ఉన్నాయనో.. మరో కారణంతోనో అనర్హతా వేటు వేశారు. ఏపీలో ఓ ఎమ్మెల్యేపై అనర్హతా వేటు వేసి.. రెండో స్థానంలో ఉన్న అభ్యర్థితో ఎమ్మెల్యేగా ప్రమాణం చేయించారు. ఎక్కడైనా ఉపఎన్నిక పెడతారు కానీ ఇలా రెండో స్థానంలో ఉన్న వారితో ప్రమాణం చేయించడం అరుదు. అదే సమయంలో అనర్హతా చట్టం ప్రకారం స్పీకర్ నిర్ణయమే ఫైనల్. ఆయన చెప్పేదే తీర్పు. కోర్టులు ఈ చట్టాల్లో జోక్యం చేసుకుని తీర్పులు ఇవ్వలేదు. అందుకే ఫిరాయింపు ఎమ్మెల్యేలు ఎంత టెన్షన్ పడినా చివరి విజయం తమదే అవుతుందని గట్టి నమ్మకంతో ఉంటున్నారు. కానీ వారికి వచ్చే రెండు, మూడేళ్లూ టెన్షన్ తప్పదని అనుకోవచ్చు.
