హెరిటేజ్ ఫుడ్స్ సంస్థ ప్రతిష్టను దెబ్బతీసేలా సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్న వారిపై ఆ సంస్థ న్యాయపోరాటం పై స్థాయిలోనే కాదు.. చాలా కింది స్థాయివారిపైనా చసేస్తోంది. కంపెనీ దాఖలు చేసిన పరువు నష్టం దావాను విచారించిన ఢిల్లీ హైకోర్టు, సంచలన ఆదేశాలు జారీ చేసింది. రాజకీయ విద్వేషాలతో సంస్థపై దుష్ప్రచారం చేస్తున్న దాదాపు 262 సోషల్ మీడియా అకౌంట్లకు నోటీసులు అందాయి. ఇందులో 85 ఎక్స్ , 52 ఇన్స్టాగ్రామ్, 70 యూట్యూబ్ , 55 ఫేస్బుక్ అకౌంట్లు ఉన్నట్లు సమాచారం. తప్పుడు కంటెంట్‌ను 24 గంటల్లోగా తొలగించాలని కోర్టు స్పష్టం చేసింది.
ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుబంధంగా భావించే సాక్షి మీడియా సంస్థపై హెరిటేజ్ ఏకంగా రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేసింది. తిరుమల లడ్డూ వివాదం ఇతర నాణ్యత సంబంధిత అంశాల్లో హెరిటేజ్ సంస్థకు సంబంధం ఉందంటూ ప్రసారమైన కథనాలు పూర్తిగా నిరాధారమని సంస్థ న్యాయవాదులు కోర్టుకు విన్నవించారు. ఈ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం, అటువంటి అసత్య కథనాలను తక్షణమే అన్ని డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల నుండి తొలగించాలని ఆదేశించింది. లేనిపక్షంలో గూగుల్, మెటా వంటి సంస్థలే నేరుగా ఆ కంటెంట్‌ను తొలగించేలా చర్యలు తీసుకోవాలని సూచించింది.
సాధారణంగా రాజకీయ పార్టీల మధ్య జరిగే ఆరోపణలు సంస్థల మీదకు మళ్లినప్పుడు చాలా కంపెనీలు మిన్నకుండిపోతాయి. కానీ, హెరిటేజ్ సంస్థ ఈసారి అత్యంత కఠినంగా వ్యవహరిస్తోంది. కేవలం కంటెంట్ తొలగిస్తే సరిపోదని, తప్పుడు వార్తలు వ్యాప్తి చేసిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసే దిశగా కూడా అడుగులు వేస్తోంది. ఒక కార్పొరేట్ సంస్థపై రాజకీయ లబ్ధి కోసం ఆరోపణలు చేసి సులభంగా తప్పించుకోవచ్చని భావించిన వారికి, ఈ కోర్టు ఉత్తర్వులు ఒక హెచ్చరికగా మారాయి.
ఢిల్లీ హైకోర్టు తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ వేదికలపై బాధ్యతాయుతమైన ప్రచారానికి నాంది పలుకుతుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఫేక్ ఐడీలతో, మార్ఫింగ్ వీడియోలతో తప్పుడు ప్రచారం చేసే వారు ఇప్పుడు చట్టపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మేము ఎప్పుడూ నాణ్యత విషయంలో రాజీ పడలేదు.. రైతులకు, వినియోగదారులకు మాపై ఉన్న నమ్మకాన్ని దెబ్బతీసే ప్రయత్నాలను సహించబోము అని హెరిటేజ్ యాజమాన్యం స్పష్టం చేసింది. ఈ పరిణామంతో వైసీపీ సోషల్ మీడియా విభాగంలో ఒక్కసారిగా కలకలం రేగింది.
