ఢిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం ఇప్పుడు సరికొత్త మలుపులు తిరుగుతోంది. దర్యాప్తు సంస్థలు, నిందితుల మధ్య సాగుతున్న ఈ పోరాటం ఇప్పుడు నేరుగా న్యాయమూర్తుల తీరుపై ప్రశ్నలు సంధించే స్థాయికి చేరడం దేశవ్యాప్త చర్చకు దారితీస్తోంది. దిగువ కోర్టు ఇచ్చిన తీర్పుతో ఊపిరి పీల్చుకున్న నిందితులకు, హైకోర్టులో సీబీఐ వేసిన పిటిషన్ ఇప్పుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది.
న్యాయమూర్తిపైనే పోరాటం – నిందితుల కొత్త వ్యూహం!
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో దిగువ కోర్టు ఇచ్చిన క్లీన్ చిట్ ను సవాలు చేస్తూ సీబీఐ హైకోర్టును ఆశ్రయించింది. అయితే, ఈ పిటిషన్‌ను విచారిస్తున్న న్యాయమూర్తి పట్ల నిందితులు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా అరవింద్ కేజ్రీవాల్ ఏకంగా ఆ న్యాయమూర్తిపైనే న్యాయపోరాటానికి దిగడం సంచలనం రేపుతోంది. సదరు న్యాయమూర్తి గతంలో ఇచ్చిన కొన్ని తీర్పులు, ఆయన పనితీరుపై సందేహాలు వ్యక్తం చేస్తూ కేజ్రీవాల్ పిటిషన్ వేశారు. తన వాదనలను తానే స్వయంగా వినిపించుకుంటానని కోర్టుకు తెలపడం వెనుక, ఈ వ్యవహారాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలనే రాజకీయ వ్యూహం ఉంది.
స్టే భయం.. ఒత్తిడి మంత్రం?
నిందితులలో ఈ స్థాయిలో టెన్షన్ పెరగడానికి ప్రధాన కారణం స్టే వచ్చే అవకాశం ఉండటమే. ఒకవేళ హైకోర్టు గనుక దిగువ కోర్టు తీర్పుపై స్టే విధిస్తే, నిందితులు మళ్లీ చట్టపరమైన చిక్కుల్లో పడతారు. ఈ ముప్పును ముందే పసిగట్టిన నిందితులు, విచారణ జరుపుతున్న న్యాయమూర్తిపై నైతిక ఒత్తిడి పెంచేలా ప్రవర్తిస్తున్నారని న్యాయకోవిదులు అభిప్రాయపడుతున్నారు. న్యాయమూర్తి నిష్పాక్షికంగా లేరు అనే ముద్ర వేయడం ద్వారా, విచారణను ఆలస్యం చేయడమో లేదా కేసును మరో బెంచ్‌కు బదిలీ చేయించుకోవడమో నిందితుల అసలు ఉద్దేశమని భావిస్తున్నారు.
న్యాయవ్యవస్థ సహిస్తుందా?
సాధారణంగా నిందితులు లేదా కక్షిదారులు న్యాయమూర్తులను టార్గెట్ చేయడాన్ని ఉన్నత న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తాయి. గతంలో ఇటువంటి ప్రయత్నాలు జరిగినప్పుడు సుప్రీంకోర్టు ,హైకోర్టులు కోర్టు ధిక్కరణ కింద కఠిన చర్యలు తీసుకున్న సందర్భాలు ఉన్నాయి. న్యాయమూర్తుల వ్యక్తిత్వాన్ని లేదా వారి తీర్పులను ప్రభావితం చేసేలా సామాజిక మాధ్యమాల్లో లేదా కోర్టు హాల్స్‌లో ఒత్తిడి తీసుకురావడం న్యాయవ్యవస్థ స్వతంత్రతకు గొడ్డలిపెట్టు అని సీనియర్ న్యాయవాదులు హెచ్చరిస్తున్నారు. నిందితులు చేస్తున్న ఈ బెంచ్ హంటింగ్ ప్రయత్నాలను న్యాయస్థానం ఉపేక్షిస్తుందా లేక ఘాటుగా స్పందిస్తుందా అన్నది వేచి చూడాలి.
మలుపులు తిరుగుతున్న లిక్కర్ కేసు
మరోవైపు, సీబీఐ దిగువ కోర్టు సాక్ష్యాధారాలను సరిగ్గా పరిశీలించలేదని, అసలైన కుట్రను విస్మరించిందని హైకోర్టుకు నివేదించింది. నిందితులు చేస్తున్న ఈ తాజా హడావుడిని సీబీఐ లాయర్లు కేసును తప్పుదోవ పట్టించే చర్య గా అభివర్ణిస్తున్నారు. హైకోర్టు ఇచ్చే తీర్పు లిక్కర్ స్కాం నిందితులకు కీలకం కానుంది.