రాజీవ్ స్వగృహ కార్పొరేషన్ ఆధ్వర్యంలో అభివృద్ధి చేసిన ఓపెన్ ప్లాట్లకు కొనుగోలుదారుల నుండి విశేష స్పందన లభించింది. రంగారెడ్డి జిల్లా తొర్రూర్ ప్రాంతంలోని ప్లాట్ల కోసం శనివారం నిర్వహించిన బహిరంగ వేలంలో ప్రజలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. మొత్తం 105 ప్లాట్లకు గాను తొలిరోజు 70 ప్లాట్లను విక్రయించగా, వీటి ద్వారా ప్రభుత్వానికి సుమారు రూ. 56 కోట్ల ఆదాయం సమకూరింది. ఔటర్ రింగ్ రోడ్డు, ఎయిర్‌పోర్టుకు సమీపంలో ఉండటంతో ఈ ప్రాంత భూములకు విపరీతమైన పోటీ ఏర్పడింది.
వేలం పాటలో తొర్రూర్ భూములు మరోసారి రికార్డు ధర పలికాయి. ఇక్కడ చదరపు గజం కనీస ధర రూ. 25 వేలుగా నిర్ణయించగా, గరిష్టంగా రూ. 45 వేల వరకు ధర పలికింది. సగటున గజం రూ. 31 వేలకు అమ్ముడుపోగా, ఒక కార్నర్ ప్లాట్ కోసం సుమారు 20 సార్లు ధర పెంచుతూ పోటీ పడటం విశేషం. సుమారు 150 మంది దరఖాస్తుదారులు తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చి ఉత్సాహంగా వేలంలో పాల్గొన్నారు.
మధ్యతరగతి ,అల్పాదాయ వర్గాల కోసం నిర్మించిన ఫ్లాట్ల కేటాయింపు కూడా విజయవంతంగా ముగిసింది. బండ్లగూడ , పోచారం ప్రాంతాల్లోని రాజీవ్ స్వగృహ గేటెడ్ కమ్యూనిటీలలో మిగిలి ఉన్న 71 ఫ్లాట్లను లాటరీ పద్ధతిలో లబ్ధిదారులకు కేటాయించారు. ఇందులో బండ్లగూడలోని 15 ఫ్లాట్లు, పోచారంలోని 56 ఫ్లాట్లు ఉన్నాయి. ఈ ఫ్లాట్ల కేటాయింపు ద్వారా కార్పొరేషన్‌కు అదనంగా రూ. 11 కోట్ల ఆదాయం సమకూరింది. సొంత ఇంటి కలను నిజం చేసుకునే క్రమంలో అనేక మంది ఈ లాటరీ ప్రక్రియలో పాల్గొన్నారు.
తొర్రూర్ లేఅవుట్లో మిగిలిన 35 ఓపెన్ ప్లాట్లతో పాటు, బహదూర్ పల్లి, కుర్మల్ గూడ ప్రాంతాల్లోని 32 ప్లాట్లకు ఆదివారం బహిరంగ వేలం నిర్వహించనున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతాల్లో ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్న వారు భారీగా దరఖాస్తు చేసుకున్నారు. రెండో రోజు కూడా ఇదే స్థాయి స్పందన వస్తుందని అధికారులు భావిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలో ప్రభుత్వ లేఅవుట్లకు ఉన్న నమ్మకమే ఈ భారీ ధరలకు కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు.

