భారతదేశంలో సీనియర్ లివింగ్ మార్కెట్ రియల్ ఎస్టేట్ రంగంలో అత్యంత ఆకర్షణీయమైన అవకాశంగా మారుతోంది. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ మారిపోయింది. వృద్ధులు అయినా పిల్లలతో ఉండటం కంటే.. విడిగా ఉండాలని కోరుకుంటున్నారు. అలా అయితేనే మానవ సంబంధాలు మెరుగ్గా ఉంటున్నాయి. ఉరుకుల పరుగుల జీవితంలో పిల్లలను డిస్ట్రబ్ చేయాలని అనుకోవడం లేదు. అదే సమయంలో కెరీర్ కోసం పిల్లలు ఉన్న చోట ఉండటం కష్టం. అందుకే రిటైర్మెంట్ హోమ్స్ కోసం ఎక్కువ మంది ఆలోచిస్తన్నారు.
2023లో భారతదేశంలో 60 ఏళ్లు పైబడిన జనాభా 10 కోట్లుగా ఉంది. ఇది 2050 నాటికి 30 కోట్లకు మూడు రెట్లు పెరుగుతుంది. 2025లో 162 మిలియన్ల నుంచి 2030 నాటికి 191 మిలియన్లకు చేరుతుంది. పట్టణ ప్రాంతాల్లో ఆర్థికంగా స్వతంత్రంగా ఉండే సీనియర్ సిటిజన్లు డిమాండ్ 2025లో 1.7 మిలియన్ యూనిట్ల నుంచి 2030 నాటికి 2.3 మిలియన్ యూనిట్లకు పెరుగుతుందని రియల్ ర్గాల అంచనా. ప్రస్తుతం సీనియర్లుగా మారుతున్న సిటిజన్లకు ఆర్థిక శక్తి మెరుగ్గా ఉంటోంది. పెట్టుబడులు ఇతర పద్దతుల ద్వారా తమ రిటైర్మెంట్ జీవితానికి సరిపడా మిగుల్చుకుంటున్నారు.
సీనియర్ లివింగ్ కేవలం రియల్ ఎస్టేట్ నిర్ణయం కాదు .. ఇది రిటైర్మెంట్ ప్లానింగ్, హెల్త్‌కేర్ , వారసత్వ ఎంపికలకు సంబంధించినదని మార్కెట్ వర్గాలంటున్నాయి. ఈ ప్రాజెక్టులు ఇంటిగ్రేటెడ్ హెల్త్‌కేర్, ఎమర్జెన్సీ సేవలు, వెల్నెస్ సౌకర్యాలను అందిస్తాయి, ఇవి భవిష్యత్ వైద్య ఖర్చులను తగ్గిస్తాయి. కమ్యూనిటీ లివింగ్, 24/7 సెక్యూరిటీ సీనియర్లకు , వారి కుటుంబాలకు మనశ్శాంతిని అందిస్తాయి.
బెంగళూరు, చెన్నై, పుదుచ్చేరి, హైదరాబాద్ వంటి దక్షిణ నగరాలు సీనియర్ లివింగ్ మార్కెట్లో 60 శాతం వాటాను కలిగి ఉన్నాయి. రానున్న రోజుల్లో ఇతర ప్రాంతాల్లోనూ మార్కెట్ పెరుగుతుందని అంచనా వేస్తున్నారు.
