పెద్ద నోట్లను కేంద్రం రద్దు చేయడం వల్ల ఆ ప్రభావం రాష్ట్రాల ఆదాయంపై తీవ్రంగా ఉంటోందంటూ ఈ మధ్య కొంతమంది ముఖ్యమంత్రులు ఆందోళన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే, రాజకీయ పార్టీలపై కూడా నోట్ల ప్రభావం తీవ్రంగా ఉంటుందని తెలుగుదేశం పార్టీకి అనుభవంలోకి వచ్చింది. ఎలా అంటే… తెలుగుదేశం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జనచైతన్య యాత్రలకు నోట్ల రద్దు నిర్ణయం గండికొట్టిందని చెప్పాలి. చంద్రబాబు సర్కారు చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఈసారి తమ్ముళ్లు బాగానే ప్రిపేర్ అయ్యారు. భారీ ఎత్తున జనసమీకణ చేసి ఈ యాత్రలను విజయవంతం చేసుకోవాలని సర్వశక్తులూ ఒడ్డారు.
ప్రత్యేక హోదా రాలేదన్న అసంతృప్తి ప్రజల్లో ఉండటం, ఇంకోపక్క పవన్ కల్యాణ్ హోదాపై పోరాటం ఉద్ధృతం చేయడం, కాపుల రిజర్వేషన్ల ఉద్యమ స్థాయి పెరుగుతూ ఉండటం… ఈ నేపథ్యంలో తెలుగుదేశం ఉక్కిరి బిక్కిరైంది. అందుకే, భారీ ఎత్తున ప్రచారం కోసం ఈ యాత్రల్ని ప్రారంభించింది. తొలి వారం రోజులూ ఈ యాత్రలు బాగానే జరిగాయి. అయితే, నవంబర్ 8న ప్రధానమంత్రి మోడీ పెద్ద నోట్లను రద్దు చేస్తూ నిర్ణయం వెల్లడించడంతో తెలుగుదేశం ప్రచారానికి గాలి తీసేసినట్టైంది! జన చైతన్య యాత్రలకు జనం రావడం మానేశారు. పాత నోట్లను డిపాజిట్ చేసుకునేందుకు బ్యాంకుల చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. ఆ తరువాత, ఏటీఎమ్‌ల ముందు లైన్లు కడుతున్నారు. దీంతో తెలుగుదేశం సభలు బోసి పోతున్నాయి.
చివరికి తెలుగుదేశం కార్యకర్తలు కూడా ఈ సభలకు హాజరయ్యేందుకు మొగ్గుచూపలేని పరిస్థితి. అంతేకాదు, తెలుగుదేశం పార్టీలో ఎక్కువమంది వ్యాపారులు ఉన్నారు. నోట్ల రద్దు నిర్ణయం కారణంగా ఎవరి ఇబ్బందుల్లో వారు పడ్డారు. పాత నోట్లను మార్చుకోవడం కిం కర్తవ్యం, అంతేగానీ తెలుగుదేశం సభలు ముఖ్యం కాదు కదా! కేంద్ర నిర్ణయంతో సామాన్య ప్రజలు బిజీ అయిపోయారు. ప్రచార సభలకు వెళ్లి, ఉపన్యాసలు ఆలకించేంత కోరికా తీరికా ఇప్పుడు ప్రజలకు లేదు. మొత్తానికి, పెద్ద నోట్ల రద్దు నిర్ణయం ఆ విధంగా తెలుగుదేశం ప్రచార కార్యక్రమంపై ప్రభావం చూపింది. పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వెనక చంద్రబాబు చొరవ ఉందని చెప్పిన నేతలు కూడా తరువాత మాట మార్చుకున్నారు! అయినా, చేసింది చెప్పుకోవడం కోసం యాత్రలేంటండీ.. చేయాల్సింది చెప్పాలిగానీ..!