రివ్యూ: దేవ్‌

తెలుగు360 రేటింగ్‌ 1.5/5

ప్రేమ‌క‌థ‌లు తీయ‌డంలో త‌మిళ ద‌ర్శ‌కులు ఎప్పుడూ ముందు వ‌రుస‌లో ఉంటారు. వాళ్ల టేకింగ్‌లో, పాత్ర‌ల చిత్ర‌ణ‌లో స‌హ‌జ‌త్వం క‌నిపిస్తుంటుంది. బ‌రువైన భావోద్వేగాలు, మ‌ర్చిపోలేని స‌న్నివేశాలు… త‌ప్ప‌నిస‌రిగా ఉంటాయి. ‘ఇలాంటి ప్రేమికుడో, ప్రియురాలో మ‌న‌కెందుకు దొర‌క‌లేదు’ అనే ఫీలింగ్ క‌లుగుతుంది. ఎవ్వ‌రినైనా అర్జెంటుగా ప్రేమించేయాల‌న్న త‌ప‌న మొద‌ల‌వుతుంది. ‘ఇవేం లేకుండా కూడా మేం సినిమా తీయ‌గ‌లం’ అని చెప్ప‌డానికే `దేవ్‌` వ‌చ్చిన‌ట్టుంది. ఎమోష‌న్‌, ఎడ్వెంచ‌ర్ క‌లిస్తే దేవ్.. అని చిత్ర‌బృందం గొప్ప‌గా చెప్పుకుంటుంది గానీ.. ఆవి రెండూ మ‌చ్చుకైనా క‌నిపించ‌ని సినిమాగా దేవ్ మిగిలిపోతుందేమో అనిపిస్తుంది. ఎందుకో తెలియాలంటే.. రివ్యూలోకి వెళ్లాలి.

క‌థ‌

దేవ్ (కార్తి) గొప్పింటి బిడ్డ‌. బాగా చ‌దువుకున్నాడు. స్నేహితులంటే ఇష్టం. వాళ్ల‌తోనే గ‌డుపుతుంటాడు. ఎడ్వెంచ‌రెస్ అంటే చాలా ఇష్టం. ప్ర‌కృతిని బాగా ఎంజాయ్ చేస్తుంటాడు. అమ్మాయిలంటే గౌర‌వం. తొలిసారి మేఘ‌న (ర‌కుల్ ప్రీత్ సింగ్‌)ని చూసి ఇష్ట‌ప‌డ‌తాడు. త‌న‌ని ప్రేమిస్తాడు. దేవ్ ఒక‌ర‌క‌మైతే, మేఘ‌న మ‌రో ర‌కం. త‌న‌కు వ్యాపారం, డ‌బ్బు.. వీటి చుట్టూనే ఆలోచ‌న‌లు తిరుగుతుంటాయి. చిన్న‌ప్పుడే తండ్రి మోసం చేయ‌డం వ‌ల్ల మ‌గాళ్లన్నా, ప్రేమ అన్నా.. గౌర‌వం ఉండ‌దు. అందుకే దేవ్ ఇష్ట‌ప‌డుతున్నా దూరం పెడుతుంది. కానీ క్ర‌మంగా త‌ను కూడా దేవ్‌ని ఇష్ట‌ప‌డ‌డం మొద‌లెడుతుంది. ఇద్ద‌రూ ప్రేమ‌లో ప‌డిన త‌ర‌వాత వీళ్ల క‌థ ఎలాంటి మ‌లుపు తిరిగింది? చివ‌రికి ఏం జ‌రిగింది? అనేదే `దేవ్‌` సినిమా.

విశ్లేష‌ణ‌

ఇది అడ్వెంచెర‌స్‌ సినిమాలా చూపించాలా? ల‌వ్ స్టోరీలా మ‌ల‌చాలా? ఓ అబ్బాయి, అమ్మాయి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌పై దృష్టి పెట్టాలా? విషాదాంతంగా వినోద‌మా? ఇలా ఏదీ తేల్చుకోలేక‌.. ద‌ర్శ‌కుడికి ఏమొస్తే అది తీస్తూ పోతే.. చివ‌రికి సినిమా ఎలా త‌యార‌వుతుందో చెప్ప‌డానికి `దేవ్‌` ఓ ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తుంది. క‌థ‌లో కొత్త‌ద‌నం లేక‌పోతే… క‌థ‌న‌మైనా ర‌క్తిక‌ట్టేలా ఉండాలి. చిన్న చిన్న మ‌లుపుల‌తో సినిమాని న‌డిపించాలి. పాత్ర‌ల్ని బ‌లంగా తీర్చిదిద్దాలి. అయితే.. దేవ్‌లో ఇవేం క‌నిపించ‌వు. ల‌వ్ స్టోరీ అని చెప్పి.. తొలి స‌గం వ‌ర‌కూ హీరో, హీరోయిన్ల‌ను క‌ల‌ప‌లేదు. రెండో స‌గం కూడా అంతే. హీరో, హీరోయిన్ల మ‌ధ్య ప‌రిచ‌యం పెర‌గ‌డానికి దర్శ‌కుడు స‌గం సినిమాని వాడేసుకున్నాడంటే ప‌రిస్థితిని అర్థం చేసుకోవొచ్చు. పోనీ అప్ప‌టి వ‌ర‌కూ స‌ర‌దా స‌న్నివేశాల‌తో టైమ్ పాస్ చేశాడా? అంటే అదీ లేదు. స్టాండ‌ప్ కామెడీ పేరు చెప్పి – హీరో ఫ్రెండ్ ఏదేదో చెబుతుంటాడు. హీరో ఫ్రెండ్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి క‌థ మొద‌లెట్టి ఈ సినిమాని మ‌రింత బోరింగ్‌గా మార్చేశాడు. ఈ సినిమాలో మాట‌ల‌కంటే.. త‌న కామెంట్రీనే ఎక్కువ వినిపిస్తుంటుంది. ఓ ద‌శ‌లో కార్తి కంటే, కార్తి ఫ్రెండ్ పాత్రే ఎక్కువేమో అనిపిస్తుంది. హీరోని పాజిటీవ్ ఆటిట్యూడ్ ఉన్న వ్య‌క్తిగా చూపించి, హీరోయిన్ కాద‌నేస‌రికి ‘చ‌చ్చిపోవాల‌నిపిస్తుంది నాన్నా’ అంటూ దిగాలు ప‌డిపోవ‌డం.. క్యారెక్ట‌రైజేష‌న్‌ని దెబ్బ‌తీయ‌డ‌మే. హీరోయిన్ కూడా అంతే. స‌డ‌న్‌గా ఓ వీడియో చూపి, హీరోపై ప్రేమ పెంచేసుకుంటుంది. త‌న‌ది ప్రేమో.. కాదో తెలియ‌ని క‌న్‌ఫ్యూజ్ మైండ్ ఆమెది. ఇలా క‌థ‌లో, పాత్ర‌ల చిత్ర‌ణ‌లో ఎన్నో లోపాలు క‌నిపిస్తాయి. అవ‌న్నీ దేవ్‌ని బ‌ల‌హీన‌ప‌రుస్తుంటాయి. ప‌తాక స‌న్నివేశాలు కూడా ఏమంత ఉత్కంఠ‌త క‌లిగించ‌వు. అవి కూడా సోసో గానే సాగాయి. మొత్తానికి అన్ని విభాగాల్లోనూ దేవ్ నిరుత్సాహ‌ప‌రుస్తుంది.

న‌టీన‌టులు

కార్తి క‌థ‌ల ఎంపిక బాగుంటుంది. త‌న పాత్ర‌లో కొత్త‌ద‌నం చూపించ‌డానికి ప్ర‌య‌త్నిస్తుంటాడు. కానీ దేవ్ ఆ అవ‌కాశం ఇవ్వ‌లేదు. స‌న్నివేశాల్లో బ‌లం లేక‌పోయినా కార్తి త‌న మ్యాజిక్‌తో కొట్టుకుని రాగ‌ల‌డు. కానీ.. ఈసారి ఆ మ్యాజిక్ న‌డ‌వ‌లేదు. ర‌కుల్ కొన్నిసార్లు అబ్బాయిలా క‌నిపించింది. అలా ఉంటే.. హీరో హీరోయిన్ల మ‌ధ్య కెమిస్ట్రీ ఎక్క‌డ వ‌ర్క‌వుట్ అవుతుంది? హీరో హీరోయిన్లు ముద్దులు పెట్టుకున్నా, కౌగిలించుకున్నా ఆ ఫీలింగ్ రాదు. ప్ర‌కాష్‌రాజ్‌, ర‌మ్య‌కృష్ణ లాంటి న‌టుల్ని పెట్టుకుని స‌రైన పాత్ర‌లు ఇవ్వ‌లేదు. వాళ్ల డ‌బ్బింగులు కూడా కుద‌ర్లేదు.

సాంకేతిక వ‌ర్గం

స్టార్ హీరో సినిమా అంటే టెక్నిక‌ల్ ప‌రంగా ఎలాంటి లోటూ ఉండ‌దు. ఈ సినిమాకీ అదే జ‌రిగింది. కెమెరా, నేప‌థ్య సంగీతం ఇవ‌న్నీ బాగున్నాయి. పాట‌లు బాగా ఇబ్బంది పెడ‌తాయి. ఇంత సాధార‌ణ‌మైన క‌థ‌ని కార్తిని ఒప్పించాడంటే ద‌ర్శ‌కుడికి దండాలు పెట్టాల్సిందే. కార్తి జ‌డ్జిమెంట్ పై తొలిసారి అనుమానాలు క‌లిగించిన చిత్ర‌మిది.

ఫినిషింగ్ ట‌చ్‌: ‘దేవ్‌’డా….

తెలుగు360 రేటింగ్‌ 1.5/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

ఫిరాయించిన ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్సీలపై అనర్హతా వేటు..!?

మూడు రాజధానులు, సీఆర్డీఏ బిల్లు విషయంలో మండలిలో టీడీపీకి అనుకూలంగా ఓటు వేయకుండా.. వైసీపీ గూటికి చేరిపోయిన ఎమ్మెల్సీలు పోతుల సునీత, శివనాథరెడ్డిలపై అనర్హతా వేటు వేయడానికి టీడీపీ రంగం సిద్ధం చేసుకుంది....

ఏడాది యాత్ర 11 : అంచనాలు ఎక్కువ… ఆచరణ తక్కువ..!

ఇంత ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్ తట్టులేకపోతున్నాను భయ్యా..! .. అంటాడు ఓ సినిమాలో హీరో. నిజంగానే ఆ సినిమాకు హైప్ ఓ రేంజ్‌లో వచ్చింది. ఎంతగా అంటే.. సినిమా ఎంత అద్భుతంగా తీసినా .....

జగన్ సలహాదారులు కి కనీస అవగాహన లేదా ?

ఎస్‌ఈసీగా రమేష్‌కుమార్ తొలగింపు వ్యవహారంలో హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపధ్యలో ప్రతిపక్షపార్టీల నేతలు..జగన్మోహన్ రెడ్డి రాజీనామాకు డిమాండ్ చేస్తున్నారు. రాజ్యాంగ విరుద్దంగా ఆర్డినెన్స్ ఇచ్చి... రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని.. పదవిలో ఉండే అర్హత...

దేశం ఆశ్చర్యపోయేలా తెలంగాణ ప్రజలకు తీపి కబురు: కేసీఆర్

తెలంగాణ సీఎం కేసీఆర్.. తెలంగాణ ప్రజలకు త్వరలో ఓ తీపి కబురు చెబుతానని ప్రకటించారు. ఈ మాట ఆయన మామూలుగా చెప్పలేదు. దానికో విశేషణం జోడించారు. అదేమిటంటే.. తాను చెప్పబోయే తీపి కబురు...

HOT NEWS

[X] Close
[X] Close