రివ్యూ: దేవ‌దాస్‌

Devadas sameeksha

తెలుగు360 రేటింగ్ : 2.75/5

ఓ అభిమాన హీరో సినిమా వ‌స్తోందంటేనే పండ‌గ‌లా ఉంటుంది.
ఇద్ద‌రు హీరోలు క‌లిసొస్తే డ‌బుల్ బొనాంజానే.
అందుకే మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలంటే అంత ఆస‌క్తి. క‌థ‌, పాత్ర‌లు కుద‌రాలే గానీ, మ‌ల్టీస్టార‌ర్ల‌కు మించిన మ‌జా లేదు.
అటు నాగ్‌, ఇటు నాని..
ఇద్ద‌రూ క‌లిసి న‌టిస్తున్నార‌న‌గానే
‘వావ్‌..’ అనేశారంతే.
ఆ సినిమా టైటిల్ ‘దేవ‌దాస్‌’ అన‌గానే
‘వారెవా..’ అనుకున్నారు.
కాంబినేష‌న్‌, టైటిల్‌, హీరోలు, వాళ్ల గెట‌ప్పులు అన్నీ అందంగా కుదిరిపోయాయి. మ‌రి ఇన్ని ఆక‌ర్ష‌ణ‌లున్న ఈ సినిమా రిజ‌ల్ట్ ఏమిటి? ఆనాటి దేవ‌దాస్ ఓ క్లాసిక్‌గా మిగిలిపోతే… ఈనాటి దేవ‌దాస్ ఏమైంది??

క‌థ‌

దేవ (నాగార్జున‌) ఓ డాన్‌. ప్రాణాలంటే లెక్క‌లేదు. అతి తీయ‌డంలో మ‌జాని ఆస్వాదిస్తాడు. ఎవ్వ‌రికీ క‌నిపించ‌డు. దేవా ఎలా ఉంటాడో ఎవ్వ‌రికీ తెలీదు. దేవాకి వ్య‌తిరేకంగా ఓ ముఠా త‌యార‌వుతుంది. దేవాని ర‌ప్పించ‌డానికి ప‌థ‌కం ప‌న్నుతారు. అందులో భాగంగానే దేవాని పెంచి పెద్ద చేసిన దాదా (శ‌రత్‌కుమార్‌)ని చంపేస్తారు. దాదాని చంపిన‌వాళ్ల‌ని వెదుక్కుంటూ దేవా హైద‌రాబాద్ వ‌స్తాడు. అక్క‌డ పోలీసుల కాల్పుల్లో దేవాకి గాయాల‌వుతాయి. చికిత్స కోసం దాస్ (నాని) ఉన్న ఆసుప‌త్రికి వ‌స్తాడు. దాస్ చాలా మంచోడు. నిజాయ‌తీపరుడు. పేషెంట్‌ని కాపాడ‌డ‌మే త‌న ధ్యేయం అనుకుంటాడు. అందుకే దేవ‌ని కాపాడ‌తాడు. దాసు మంచి మ‌న‌సు దేవ‌కి న‌చ్చుతుంది. అందుకే ఫ్రెండ్‌షిప్ చేస్తాడు. దాసు కూడా దేవ‌ని ఇష్ట‌ప‌డ‌డం ప్రారంభిస్తాడు. త‌న‌లో ఉన్న మంచిని బ‌య‌ట‌కు తీసి, మార్చాల‌ని ప్ర‌య‌త్నిస్తాడు. మ‌రి ఆ ప్ర‌య‌త్నం ఎంత వ‌ర‌కూ స‌ఫ‌లీకృత‌మైంది. దేవాని దాసు మార్చాడా, లేదంటే దాసే దావాలా మారిపోయాడా? అనేదే క‌థ‌.

విశ్లేష‌ణ‌

డాన్ సినిమాలు చాలా వ‌చ్చాయి. డాన్ కోసం పోలీసులు వెదక‌డం, డాన్ ఓ చోట దాక్కోవ‌డం.. ఇదికూడా ఇదివ‌ర‌క‌టి సినిమాల్లో చూశాం. దానికి కాస్త హ్యూమ‌ర్‌, కాస్త రాజ్ కుమార్ హీరాణీ టైపు ట్రీట్‌మెంట్‌, మ‌రీ ముఖ్యంగా ఇద్ద‌రు హీరోల క‌థ‌గా మార్చుకోవ‌డంతో `దేవ‌దాస్‌` అనే పాత క‌థ‌కి కొత్త ఫ్లేవ‌ర్ అద్దే అవ‌కాశం వ‌చ్చింది. పైగా నాగ్‌, నానీల కాంబినేష‌న్‌. ప్రేక్ష‌కుల్ని థియేట‌ర్ల‌కు ర‌ప్పించ‌డానికి వాళ్లిద్ద‌రూ ఉన్న పోస్ట‌రు చాలు. అందుకే `క‌థ` పెద్ద‌గా అవ‌స‌రం లేదేమో అనుకుని ఓ మామూలు క‌థ‌ని ఎంచుకున్నారు. దేవ‌, దాసు ఇద్ద‌రూ క‌లిసే వ‌ర‌కూ.. సినిమా కాస్త గంభీరంగా, కాస్త బోరింగ్‌గా సాగుతుంది. ఎప్పుడైతే దేవ‌, దాసు క‌లిశారో అప్ప‌టి నుంచి ఫ‌న్ మొద‌ల‌వుతుంది. మ‌రీ విర‌గ‌బ‌డే న‌వ్వులు కాదు గానీ.. సీట్లో కులాసాగా కూర్చోవ‌చ్చంతే! నాగ్‌, నానిల కెమిస్ట్రీ, వాళ్ల మ‌ధ్య న‌డిచే స‌న్నివేశాల వ‌ర‌కూ అయితే `దేవ‌దాస్‌` ఎంట‌ర్‌టైన్ చేస్తుంది. రెండు త‌రాల హీరోల్ని ప‌క్క‌ప‌క్క‌న చూస్తూ… వాళ్ల మ‌ధ్య కెమిస్ట్రీని ఎంజాయ్ చేసేయొచ్చు. ఇద్ద‌రూ క‌లిసి మందు కొట్ట‌డం, ల‌వ్ స్టోరీల గురించి చెప్పుకోవ‌డం, దేవ ఫోన్ చేస్తే… ఆ ఫోన్లోనే దాసు ముద్దుల గురించి వివ‌రించ‌డం, చివ‌ర్లో `ప్రాణం తీసే నీకే అంత ఉంటే, ప్రాణం పోసే డాక్ట‌ర్ని నాకెంత ఉండాలి` అంటూ ఇద్ద‌రి మ‌ధ్య వ‌చ్చే కాన్ఫ్లిక్ట్‌….. ఇవ‌న్నీ బాగా కుదిరాయి. అస‌లు ఇద్ద‌ర్నీ అలా ప‌క్క ప‌క్క‌న చూస్తుండిపోవాల‌నిపిస్తుంది. అంత వ‌ర‌కూ `దేవ‌దాస్‌`కి ఎలాంటి ఢోకా ఉండ‌దు. నాని, నాగ్‌ల నుంచి క‌థ బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్పుడ‌ల్లా లాజిక్ లెస్‌గా, బోరింగ్ అనిపిస్తుంటుంది. డాన్‌ని ప‌ట్టుకోవ‌డానికి పోలీసులు చేసే ప్ర‌య‌త్నాలు, అండ‌ర్ క‌వ‌ర్ ఆప‌రేష‌న్లు సిల్లీగా అనిపిస్తాయి. డాన్ రోడ్లపై ద‌ర్జాగా తిరిగేస్తుంటాడు, పోలీసుల ముందు నుంచే వెళ్తుంటాడు.. కానీ ప‌ట్టుకోరు. `మేం.. వీడ్ని దాసు క్లినిక్‌లోనే ప‌ట్టుకోవాలి` అని కంక‌ణం క‌ట్టుకుని కూర్చున్న‌ట్టు అనిపిస్తుంది. చివ‌ర్లో అవ‌య‌వ‌దానం ఎపిసోడ్ కూడా… క‌థ నుంచి, సినిమాలో ఉన్న కామెడీ మూడ్ నుంచి పూర్తిగా బ‌య‌ట‌కు వెళ్లిపోయిన‌ట్టు అనిపిస్తుంది. దేవ్‌ని మార్చ‌డానికి ఆ ఎపిసోడ్ ఉప‌యోగ‌ప‌డినా.. అంత‌గా అత‌క‌లేద‌నే చెప్పాలి. క్లైమాక్స్ హెవీగా ముగిస్తాడ‌నుకుంటే.. అక్క‌డ మాత్రం కాస్త కామెడీ ట‌చ్ ఇచ్చి… క‌థ‌ని జాలీ మూడ్‌తో ముగించాడు. అది మాత్రం ఓకే అనిపిస్తుంది.

రాజ్‌కుమార్ హీరాణీ లాంటి ఓ ఫీల్ గుడ్ మూవీని తీయాల‌న్న‌ది చిత్ర‌బృంద సంక‌ల్పం. నాని ఆసుప‌త్రి సీన్ల‌న్నీ `మున్నాభాయ్‌` కి స్ఫూర్తి అనిపిస్తాయి. అయితే అవ‌న్నీ ఆల్రెడీ చూసేశాం క‌దా. అందుకే ఆ ఫీల్ ఇక్క‌డ క్యారీ అవ్వ‌లేదు. ఇది డాన్ క‌థ‌గా న‌డ‌పాలా? ఫ్రెండ్ షిప్ యాంగిల్ చూపించాలా? ఎమోష‌న్ల‌కే ప‌రిమితం కావాలా? కామెడీతో న‌డిపించేయాలా? ఇలా దేనికి స్ట్రిక్ అవ్వాలో ద‌ర్శ‌కుడు తేల్చుకోలేక‌పోయాడు. అందుకే త‌లో కొంత పేర్చుకుంటూ వెళ్లాడు. అందుకే ఏ విభాగానికీ సంపూర్ణ న్యాయం జ‌ర‌గ‌లేదు. చివ‌ర్లో ఫీల్ గుడ్ అనిపించే స‌న్నివేశాల్ని కూడా.. ఆ స్థాయిలో హృద‌యానికి హ‌త్తుకోవు. కొన్ని కొన్ని చోట్ల‌.. ద‌ర్శ‌కుడు ఈ క‌థ‌ని త‌న‌కు, త‌న స‌న్నివేశాల‌కు అనుగుణంగా మార్చేయ‌డానికి ఇష్ట‌మొచ్చిన రీతిలో న‌డిపించేశాడు.

న‌టీన‌టులు

నాగార్జున‌, నాని… వీరిద్ద‌రే ఈ చిత్రానికి ప్రాణం. వాళ్లు లేకుండా `దేవ‌దాస్`ని ఊహించ‌లేం. నాని, నాగ్‌ల‌లో ఎవ‌రు లేక‌పోయినా దేవ‌దాస్‌గురించి మాట్లాడుకోవ‌డం కూడా అన‌వ‌స‌ర‌మే. నాగ్ చాలా గ్లామ‌ర్ గా క‌నిపించాడు. త‌న లుక్ బాగుంది. స్టైల్ బాగుంది. దేవ పాత్ర‌కు మ‌రింత వ‌న్నె తేచ్చేశాడు నాగ్‌. చాలా క్యాజువ‌ల్‌గా క‌నిపించాడు. కాక‌పోతే… `నా కాలేజీ రోజుల్లో` అంటూ చెప్పే ఫ్లాష్ బ్యాక్‌లో మాత్రం నాగ్ విగ్గు, వేష‌ధార‌ణ మ‌రీ కామెడీగా ఉంది. వెనుక బుల్లెట్ల దాడి జ‌రుగుతున్నా.. రొమాంటిక్‌గా ప‌రిగెట్ట‌డం కూడా… నాగ్‌కే చెల్లింది. నాని కామెడీ టైమింగ్ ఈ సినిమాకి బాగా క‌లిసొచ్చింది. యావరేజ్ డైలాగ్‌ని కూడా త‌న టైమింగ్‌తో వేరే రేంజ్‌కి తీసుకెళ్లాడు నాని. వీరిద్ద‌రి కోస‌మైతే ఈ సినిమాని నిర‌భ్యంత‌రంగా చూడొచ్చు. ర‌ష్మిక‌, ఆకాంక్ష‌.. ఇద్ద‌రివీ అతిథి పాత్ర‌లే. ‘గీత గోవిందం’ త‌ర‌వాత ఏమాత్రం ప్రాధాన్యం లేని పాత్ర‌లో క‌నిపించింది ర‌ష్మిక‌. చిన్న చిన్న పాత్ర‌ల‌కు కూడా బాలు, న‌వీన్ చంద్ర లాంటి పేరున్న న‌టుల్నీ తీసుకున్నారు. కానీ.. ఆ పాత్ర‌లు ఆ స్థాయిలో మాత్రం పేల‌లేదు.

సాంకేతిక వ‌ర్గం

వైజ‌యంతీ మూవీస్ స్థాయికి త‌గ్గ‌ట్టున్నాయి నిర్మాణ విలువ‌లు. కెమెరాప‌నిత‌నం ఆక‌ట్టుకుంటుంది. మ‌ణిశ‌ర్మ పాట‌లు ఎలా ఉన్నా.. తీసిన ప‌ద్ధ‌తి మాత్రం బాగుంది. చాలా సాధార‌ణ‌మైన క‌థ‌ని హీరోలు, కాస్టింగ్‌, కెమెరా, సంగీతం.. ఇవన్నీ క‌ల‌సి నిల‌బెట్ట‌డానికి ప్ర‌య‌త్నించాయి. మాట‌లు అక్క‌డ‌క్క‌డ మెరిశాయి. `మ‌నిషిని బ‌తికించే డాక్ట‌ర్లున్న‌ట్టు మ‌నిషిలోని మంచినీ బ‌తికించే డాక్ట‌ర్లుంటే బాగుంటుంది` అనే డైలాగు బాగుంది. త‌న‌కిచ్చిన స్క్రిప్టునీ న్యాయం చేయ‌డానికి ప్ర‌య‌త్నించాడు ద‌ర్శ‌కుడు. స్క్రిప్టు బాగుంటే.. సినిమా ఇంకా బాగుండేదేమో.

తీర్పు

ఇద్ద‌రు హీరోలు, వాళ్ల‌పై జ‌నాల‌కున్న అంచ‌నాలు… వీటిని `దేవ‌దాస్‌` అందుకోలేక‌పోవొచ్చు. కానీ ఎలాంటి అంచ‌నాలూ లేకుండా ఖాళీ మైండ్‌తో వెళ్తే.. దేవ‌దాస్ ఎంట‌ర్టైన్ చేస్తాడు. ఈవారం `దేవ‌దాస్‌`కి పోటీ లేక‌పోవ‌డం కూడా క‌లిసొచ్చే అంశ‌మే.

తెలుగు360 రేటింగ్ : 2.75/5

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

జేడీ లక్ష్మినారాయణకు ప్రాణహాని – ఎవరి పని ?

సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మినారాయణ తనకు ప్రాణహాని ఉందని విశాఖ సీపీ రవిశంకర్ అయ్యన్నార్ కు ఫిర్యాదు చేశారు. ఇంత కాలం నిర్భయంగా తిరిగిన ఆయనకు హఠాత్తుగా ప్రాణభయం ఏర్పడటానికి...

వైసీపీలో చేరి అన్నీ పోగొట్టుకుని బయటకు వచ్చిన డొక్కా !

ఆయన ప్రముఖ దళిత నేత. కాంగ్రెస్ నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. రాయపాటి సాంబశివరావు రాజకీయాల్లోకి తీసుకు వచ్చారు. వైఎస్ఆర్ ప్రోత్సహించారు. ఆయనకు మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఆయన చనిపోయిన తర్వాత...

ఎక్స్ క్లూజీవ్‌: బెల్లంకొండ రూ.50 కోట్ల సినిమా

బెల్లంకొండ శ్రీ‌నివాస్ ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉన్నాడు. త‌ను హీరోగా చేస్తున్న `టైస‌న్ నాయుడు` సెట్స్‌పై ఉంది. 'చావు క‌బురు చ‌ల్ల‌గా' ద‌ర్శ‌కుడితో 'కిష్కింద పురి' అనే ఓ సినిమా చేస్తున్నాడు....

ప‌వ‌న్ కోసం మెగా హీరోలు వ‌స్తారా?

ప‌వ‌న్ క‌ల్యాణ్ పిఠాపురం నుంచి ఎం.ఎల్‌.ఏగా పోటీ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈసారి ప‌వ‌న్‌ని ఎలాగైనా ఏపీ అసెంబ్లీలో చూడాల‌న్న‌ది మెగా అభిమానుల ఆశ‌. జ‌న‌సైనికులు కూడా బాగా క‌ష్ట‌ప‌డుతున్నారు. ప‌వ‌న్‌కు క‌నీసం...

HOT NEWS

css.php
[X] Close
[X] Close