అధికార మదంతో ఇంట్లో పని చేసే మహిళపై అత్యాచారానికి పాల్పడి, వీడియోలు తీసుకుని ఆ వీడియోలతో బ్లాక్ మెయిల్ చేసి మరీ తన కీచకపర్వాన్ని కొనసాగించిన నేరంలో దేవేగౌడ మనవడు ప్రజ్వల్ రేవణ్ణకు బెంగళూరు ప్రత్యేక కోర్టు జీవిత ఖైదు విధించింది. ఈ కేసులో ఆయన దోషి అని శుక్రవారం కోర్టు నిర్దారించింది. శనివారం శిక్ష ఖరారు చేసింది. అంతకు కోర్టులో ప్రజ్వల్ రేవణ్ణ కన్నీరు పెట్టుకున్నారు. తనకు తక్కువ శిక్ష వేయాలని వేడుకున్నాడు. కానీ ఆయన ను కోర్టు క్షమించలేదు. జీవిత ఖైదుతో పాటు పది లక్షల జరిమామానా విధించింది. ఇందులో ఏడు లక్షల రూపాయలు బాధితురాలికి చెల్లించనున్నారు.
గత ఏడాది ఏప్రిల్లో ప్రజ్వల్ రేవణ్ణకు చెందిన వీడియోలు లీక్ అయ్యాయి. ఆయన కామాంధుడని చాలా మంది మహిళల్ని వేధించాడని ఆ వీడియోల సాక్షిగా బయటపడింది. కనీసం మూడు వేల వీడియోలు ఉన్నట్లుగా ప్రచారం జరిగింది. ఈ వీడియోలు బయటపడిన తర్వాతే బాధితురాలు కేసు పెట్టింది. అప్పటి వరకూ ఆమెకు ధైర్యం లేకపోయింది. కేసు పెట్టగానే ప్రజ్వల్ పారిపోయారు. విదేశాల నుంచి బెయిల్ కోసం ప్రయత్నించారు. కానీ సుప్రీకోర్టు వరకూ వెళ్లినా ప్రయోజనం లేకపోయింది. చివరికి ఆయన తప్పదన్నట్లుగా గత ఏడాది మే 31న ఇండియాకు వచ్చారు. ఎయిర్ పోర్టులోనే పోలీసులు అరెస్టు చేశారు.
అప్పటి నుంచి జైల్లో ఉన్న ప్రజ్వల్ రేవణ్ణకు బెయిల్ లభించలేదు. శరవేగంగా విచారణ జరిపిన కోర్టు శిక్షను ఖరారు చేసింది. దేవేగౌడకు ఇష్టమన మనవడు అయిన ప్రజ్వల్.. రేవణ్ణ కుమారుడు. కుమారస్వామి అన్న రేవణ్ణ. ఈ వివాదం బయటపడిన తర్వాత ప్రజ్వల్ ను జేడీఎస్ నుంచి బహిష్కరించారు.
రాజకీయ నేతలు, అదీ కూడా కేంద్రంలో మంత్రిగా ఉన్న కుమారస్వామి కుటుంబసభ్యుడిపై కేసులో శరవేగంగా విచారణ జరిపి శిక్ష వేయడం అందర్నీ ఆకర్షిస్తోంది. ఇలాగే అన్ని కేసుల విచారణలు జరగాలని కోరుకుంటున్నారు.