పెళ్లిచూపులు సినిమాతో ప్రేక్షకులకు చేరువైన నటి రీతూ వర్మ. ఆమె కథల ఎంపిక చాలా సెలెక్టివ్‌గా వుంటుంది. తొలిసారిగా ఆమె ప్రధాన పాత్రలో నటించిన వెబ్‌సిరీస్ ‘దేవిక అండ్ డానీ’. ‘శ్రీకారం’ ఫేమ్ బి. కిషోర్ దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ‘జియో హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్‌లోకి వచ్చింది. మరి సిరీస్ ప్రేక్షకులకు ఎలాంటి కొత్తదనం పంచింది? ఆత్మల చుట్టూ అల్లుకున్న ఈ కథలో థ్రిల్ ఇచ్చే ఎలిమెంట్స్ ఏమిటి?
దేవిక (రీతూ వర్మ)కి జగ్గీ (సుబ్బరాజు)తో పెళ్లి కుదురుతుంది. అయితే జాతకం ప్రకారం దేవిక జీవితంలోకి మరో అబ్బాయి వస్తాడని చెబుతాడు పంతులు. అదే సమయంలో.. ఆమెకు డానీ (సూర్య వశిష్ఠ) పరిచయం అవుతాడు. ఆ పరిచయం ప్రేమగా మారుతున్న సమయంలో డానీ అసలు మనిషి కాదు ఓ ఆత్మ అనే నిజం దేవికకి తెలుస్తుంది. తర్వాత ఏం జరిగింది? అసలు ఆత్మగా మారిన డానీ, దేవికకే ఎందుకు కనిపించాడు? డానీ ఎందుకు దేవికని వెతుక్కుంటూ వచ్చాడనేది మిగతా కథ.
ఓటీటీ కంటెంట్‌ను కోరుకునే ఆడియన్స్ చాలా అడ్వాన్స్ అయిపోయారు. కథ, నేపథ్యం, సన్నివేశాల అల్లిక ఇవన్నీ కొత్తగా వుంటేనే ఎంగేజ్ అవుతున్నారు. ఓటీటీ అసలు లక్ష్యం కూడా అదే. వెండితెరపై చెప్పలేని కథల్ని ఇక్కడ ఆసక్తికరంగా చూపించగలగాలి. దేవిక అండ్ డానీ వెబ్‌సిరీస్ లో మరీ అంత కొత్త పాయింట్ కనిపించదు కానీ చుస్తున్నంత సేపు కాలక్షేపమయ్యే కంటెంట్ ఇందులో వుంది. కథపరంగా చూసుకుంటే ఎందుకంటే ప్రేమంట, కాంచన ఛాయలు కనిపిస్తాయి. అయితే ఈ కథని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ లా ఆహ్లదకరంగా తీర్చిదిద్దారు.
మొత్తం 7 ఎపిసోడ్లు (ఒక్కొక్క ఎపిసోడ్ నిడివి దాదాపు 30 నిమిషాలు) వుండే ఈ సిరీస్‌లో తొలి రెండు ఎపిసోడ్లు ఎంగేజింగా సాగుతాయి. దేవిక, డానీ పాత్రలు, వాటి జర్నీ ఆకట్టుకునేలా వుంటాయి. ఐతే కథలో ట్విస్ట్ రివీల్ అయిన తర్వాత కొత్త మలుపులు వుండేలా చూసుకుంటే బావుండేది. డానీ ఫ్లాష్‌బ్యాక్ లో ఎమోషన్ వుంది. కానీ అది ఇదివరకు చూసిన ఫీలింగే కలిగిస్తుంది. హీరో లక్ష్యాన్ని హీరోయిన్ ఎలా పూర్తి చేసిందనే కోణంలో సాగిన మిగతా ఎపిసోడ్స్ మరీ అంత థ్రిల్ ఇవ్వకపోయినప్పటికీ చివరి వరకూ ఆ ప్రయాణం సాఫీగానే సాగుతుంది. సుబ్బు (శివ కందుకూరి) పాత్ర కూడా ఓ ఎమోషన్ ని యాడ్ చేస్తుంది.
దేవిక పాత్రలో రీతూ వర్మ పద్దతిగా కనిపించింది. డానీగా సూర్య వశిష్ఠ డీసెంట్‌గా కనిపించాడు. ఆ పాత్రలో వచ్చే ట్విస్ట్ బావుంది. సుబ్బరాజు పాత్రని ఇంకాస్త బెటర్ గా వాడాల్సింది. వైవా హర్ష అలా వచ్చి ఇలా వెళ్లిపోయే ‘నథింగ్’ రోల్. దేవిక తాత పాత్రలో యోగినందన్ క్యారెక్టర్ కథలో కీలకం. సెకండ్ సీజన్ లో ఆ పాత్రకి మరింత ప్రాముఖ్యత వుండే అవకాశం వుంది. క్లైమాక్స్‌లో దివి పాత్రని ప్రవేశపెట్టి సీజన్ 2కి లీడ్ ఇచ్చారు.
మ్యూజిక్, కెమెరా వర్క్ పర్వాలేదనిపిస్తాయి. మేకింగ్ లో కొన్ని పరిమితులు కనిపిస్తాయి. ఈ సిరీస్ చెప్పుకోదగ్గ మరో విషయం…ఎలాంటి అశ్లీల దృశ్యాలు, సంభాషణలు లేకుండా చాలా హోమ్లీగా తీశారు. ఆత్మలు చుట్టూ సాగే కథల్లో హింస ఎక్కువ వుంటుంది. కానీ దర్శకుడు ఈ కథని పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లో హోమ్లీగా ప్రజెంట్ చేశాడు. వెబ్‌సిరీస్ అంటే మోడతాదుకి మించిన హింస, పరుష పదజాలం యధేచ్చగా వాడేస్తుంటారు. అందుకు భిన్నంగా ఫ్యామిలీ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకొని సిరిస్ ని మలచడం బావుంది.