ప్రత్యేక హోదా పేరుతో ప్రతిపక్ష నాయకుడు జగన్ డ్రామాలు ఆడుతున్నారని ఏపీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని నేరుగా ఎదుర్కోలేకనే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆరోపించారు. 29 రాష్ట్రాల్లోనూ ప్రతిపక్ష నాయకులున్నారనీ, జగన్ మోహన్ రెడ్డిలాంటి అసమర్థ ప్రతిపక్ష నేత ఏ రాష్ట్రంలోనూ లేరని దేవినేని విమర్శించారు. ప్రత్యేక హోదాకు సమానమైన ప్యాకేజీని కోరుతూ శాసనసభలో చర్చ జరుగుతున్నప్పుడు జగన్ను మాట్లాడమంటే, సమాధానం చెప్పలేక, మాట్లాడే సత్తాలేక నోరు తెరవలేకపోయిన అసమర్థ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి అని దేవినేని అన్నారు. విదేశాలకు వెళ్లి చంద్రబాబు పరిశ్రమలు తెస్తుంటే… చూసి ఓర్వలేకపోతున్నారంటూ జగన్ పై తీవ్రంగా విమర్శించారు. ఇక్కడే ఉంది అసలు విషయం!!
ప్రత్యేక హోదాపై మరోసారి నిరసన గళం పెరుగుతూ ఉండటంతో చంద్రబాబు సర్కారుకు కాస్త టెన్షన్ మొదలైందన్న విషయం దేవినేని తత్తరబాటులోనే వినిపిస్తోంది. సందర్భం ఏదైనా సరే, జగన్ ను విమర్శించడం అనేది తెలుగుదేశం అజెండాలో ఫస్ట్ పాయింట్. కాబట్టి, ఈ సందర్భంలో కూడా ప్రతిపక్ష నేత జగన్ పై దేవినేని దుమ్మెత్తిపోశారు. అయితే, ఈ క్రమంలో ఆయన నిరూపించాలనుకుంటున్న అసమర్థత ఎవరిది అనేది అసలు ప్రశ్న..? ప్యాకేజీ కోసం అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు, జగన్ ను మాట్లాడమంటే పారిపోయారని దేవినేని అంటున్నారు! జగన్ విషయాన్ని కాసేపు పక్కనపెడదాం. ఇంతకీ.. హోదాకి బదులుగా ప్యాకేజీ కోరాల్సిన పరిస్థితిని తీసుకొచ్చిన అసమర్థత ఎవరిది..? చట్టప్రకారం రావాల్సిన హోదాను సాధించుకోవాల్సింది పోయి… ప్యాకేజీ కావాలంటూ అసెంబ్లీలో నిర్ణయించడం ఏ తరహా సమర్థతకు నిదర్శనం..? ఇస్తామన్న హోదా ఎందుకివ్వలేదని కేంద్రాన్ని ధైర్యంగా నిలదీయలేని చంద్రబాబు సర్కారు చేతగాని తనం, ఎవరి సమర్థతకు సాక్ష్యం..?
ప్రతిపక్ష నేత చేస్తున్న పోరాటాన్ని విమర్శిస్తున్న దేవినేని… ప్రత్యేక హోదా కోసం అధికార పక్షం ఎంత సమర్థంగా ప్రయత్నించిందో ఒక్కసారి వెనక్కి చూసుకోవాలన్నది పలువురి అభిప్రాయం. తెలుగుదేశం పార్టీకి కేంద్రంలో అధికారంలో ఉన్న భాజపా మిత్రపక్షమే కదా! తెలుగుదేశం ఎంపీలు కూడా కేంద్రమంత్రులుగా ఉన్నారు కదా! పార్లమెంటు సభ్యులూ చాలామందే ఉన్నారు కదా! జాతీయ స్థాయిలో ప్రత్యేక హోదా కోసం వారు ఎంత సమర్థవంతంగా ప్రయత్నించారో దేవినేని వివరిస్తే బాగుంటుంది. ప్రస్తుతం జరుగుతున్న పోరాటాన్ని జగన్ ప్రేరేపిత చర్యగా చిత్రించే ముందు… ఎవరి అసమర్థత కారణంగా ఇవాళ్ల రాష్ట్రంలో ఈ పరిస్థితులు నెలకొన్నాయో కూడా దేవినేని ప్రశ్నించుకుంటే బాగుంటుందేమో..!
ఈ క్రమంలో ప్రత్యేక హోదా కోసం అధికార పార్టీగా తెలుగుదేశం చేసిన ప్రయత్నం ఏంటో చెప్పకుండా దాటేస్తున్నారు. ఇతరుల అసమర్థతను వెలెత్తి చూపేముందు.. తమలోని సమర్థతను సమర్థవంతంగా నిరూపించుకోవాలి కదా! ప్రత్యేక హోదా విషయంలో తమ వైఫల్యంవైపు ఎవ్వరి దృష్టినీ పోనియ్యకుండా రక్షణ కల్పించుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని జగన్ పై దేవినేని విమర్శిస్తున్నట్టుగా ఉంది!