పోలీసులపై తప్పుడు ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని స్వయంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా హెచ్చరికలు జారీ చేయాల్సి వచ్చింది. దీనికి కారణం ఓ ఖైదీ చనిపోతే..లాకప్ డెత్ అని కొంత మంది ప్రచారం చేయడమే. నిజానికి పోలీసులపైనే ఫేక్ న్యూస్ వేస్తున్నారంటే.. ఆ ఫేకింగ్ స్టార్లకు ఎంత ధైర్యం ఉండాలి ?. పోలీసులు కూడా తమను ఏమీ చేయలేరని.. తాము చేస్తున్నది తప్పు కాదని.. రాజ్యాంగం ఇచ్చిన హక్కు అని వారు గట్టిగా నమ్ముతున్నారు. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నారు.
తెలిసి కూడా తప్పుడు ప్రచారం చేసేవాళ్లదే ఇప్పుడు రాజ్యం. రాజకీయ పార్టీలన్నీ ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచడానికి ఫేక్ న్యూస్ చాలని అనుకుంటున్నాయి. అందుకే సైన్యాలను పెట్టుకుని ఫేక్ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైసీపీ సోషల్ మీడియాను చూస్తే ఒక్కటంటే ఒక్కటి నిజం చెప్పడం లేదు. అన్నీ ఫేక్ పోస్టులే. కనీసం అరకొర సమాచారం చెప్పి.., మిస్ లీడ్ చేస్తున్నారా అని చూస్తే అది కూడా కాదు. అచ్చమైన అబద్దాలు అచ్చు వేస్తున్నారు. కళ్ల ఎదురుగా కనిపించే నిజాల విషయంలోనూ అంతే. టీటీడీ మీద ఎన్ని నిందలు వేస్తున్నారో చెప్పాల్సిన పని లేదు. పాత ఫోటోలతో గోవులు చనిపోతున్నాయని ప్రచారం చేశారు.
కుల, మత విద్వేషాలను రెచ్చగొట్టడానికి సోషల్ మీడియాను ఓ ఆయుధంగా వినియోగించుకుంటున్నారు. ఇందు కోసం భారీఖర్చు పెడుతున్నారు. ఇలా ఫేక్ చేసి దొరికిపోయిన వారిపై కేసులు పెడితే.. అది రాజ్యాంగ హక్కు అని లాయర్లతో వాదించేందుకు భారీ ఖర్చుతో సిద్ధపడుతున్నారు. అంటే ఫేక్ న్యూస్ కోసం ఎంతగా బరి తెగించారో అర్థమవుతుంది. వాక్ స్వేచ్చ రాజ్యాంగ హక్కు దాని ప్రకారం ఏదైనా మాట్లాడవచ్చని అనుకుంటే కష్టం. వాక్ స్వేచ్చ అందరికీ ఉంటుంది. అలాగే ఎవరి గౌరవం.. వారికి ఉంటుంది. నాకు వాక్ స్వేచ్చ ఉందని ఎదుటివారి నిజాయితీని, గౌరవాన్ని దెబ్బతీస్తే అది నేరం అవుతుంది.
కారణం ఏదైనా వ్యవస్థలు కూడా సరిగ్గా పట్టించుకోవడంలేదు. ప్రతి ఒక్కరూ యూట్యూబ్ చానల్ పెట్టేసి..తప్పుడు ప్రచారాలు చేసేస్తున్నారు. కొన్ని వ్యూస్ కోసం లేదా రాజకీయ పార్టీలు ఇచ్చే డబ్బు కోసం కక్కుర్తి పడుతున్నారు. ఇలాంటి వారికి భవిష్యత్ ఉండదని చట్టం ద్వారా చెబితేనే ఎంతో కొంత కట్టడి అవుతుంది. లేకపోతే అది అలా పెరుగుతూనే ఉంటుంది.