ఈరోజుల్లో సినిమా చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని మార్కెటింగ్ చేసుకోవడం కూడా అంతే ముఖ్యం. మరీ ముఖ్యంగా చిన్న సినిమాలకు. పబ్లిసిటీ ఒక ఎత్తయితే, రిలీజ్ మరో ఎత్తు. సినిమాని ఎవరి చేతుల్లో పెడుతున్నాం అనేది.. సక్సెస్ రేటుని డిసైడ్ చేస్తుంటుంది. ఈ విషయంలో ‘దండోరా’ కాస్త అడ్వాంటేజ్ తీసుకొందని అనిపిస్తోంది. ఈనెలలో రాబోతున్న సినిమాల్లో ‘దండోరా’ ఒకటి. ఇప్పటికే టీజర్, పాటలతో జనంలోకి వెళ్లింది. ఇప్పుడు డిస్టిబ్యూషన్ విషయంలోనూ ‘దండోరా’ మంచి అడుగులే వేస్తోంది. ఈ సినిమాని నైజాంలో మైత్రీ మూవీస్ సంస్థ విడుదల చేస్తోంది. ఆంధ్ర ప్రదేశ్, కర్ణాటకలో ప్రైమ్ షో సంస్థ డిస్టిబ్యూషన్ చేస్తోంది. ఓవర్సీస్ బాధ్యత అధ్వర్య గ్లోబల్ సంస్థ తీసుకొంది.
శివాజీ, నవదీప్, నందు, బిందు మాధవి కీలక పాత్రలు పోషించిన చిత్రమిది. ఈనెల 25న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ‘కోర్ట్’ తరవాత శివాజీ పై మరింత బాధ్యత పెరిగింది. ఆయన ఓ సినిమా చేస్తున్నాడంటే అటువైపు ఆసక్తిగా చూస్తున్నారు. ప్రమోషన్ బాధ్యతనీ శివాజీ తన భుజాలపై మోస్తున్నారు. ‘దండోరా’ ప్రమోషన్లు కూడా శివాజీ చేతుల మీదుగానే జరుగుతున్నాయి. నందు నటించిన ‘సైక్ సిద్దార్థ్’ కూడా ఈనెలలోనే విడుదల అవుతున్న సంగతి తెలిసిందే. నిజానికి డిసెంబరు 12నే `సైక్ సిద్దార్థ్` రావాల్సివుంది. కానీ అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు ఒకే వారంలో నందు నటించిన రెండు సినిమాలు విడుదలకు క్యూ కట్టినట్టైంది.
