రాజకీయంగా రచ్చ చేయడానికి ఎలాంటి అవకాశం వచ్చినా పార్టీలు వదిలి పెట్టవు. చిలువలు పలువలు చేసి చెప్పడానికి చాన్స్ దొరికితే విలువలు లేని మీడియాలు కూడా అంతే. ఇప్పుడు కర్ణాటకలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ధర్మస్థల విషయంలోనూ అదే జరుగుతోంది.
మీడియా మసాలాకు తగ్గ ఆరోపణలు చేసిన మాజీ పారిశుద్ధ్య కార్మికుడు
ఉద్యోగం పోగొట్టుకున్న ధర్మస్థలలోని శ్రీ మంజునాథ స్వామి ఆలయంలో పని చేసే మాజీ పారిశుద్ధ్య ఉద్యోగి ఒకరు 1995 నుంచి 2014 వరకు వందలాది మహిళలు, యువతులు, మైనర్ బాలికలు అనుమానాస్పద స్థితిలో మరణించారని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తాను ఈ మృతదేహాలను బలవంతంగా పాతిపెట్టినట్లు లేదా కాల్చినట్లుగా చెప్పుకున్నాడు. ఈ ఆరోపణలను ఆలయ యాజమాన్యంతో సంబంధం ఉన్న కొందర్ని టార్గెట్ చేసి ఫిర్యాదు చేశాడు. ఈ ఆరోపణలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆలయ ప్రాముఖ్యత దృష్ట్యా ఈ విషయం జాతీయ, అంతర్జాతీయ దృష్టిని ఆకర్షించింది.
హై లెవల్ విచారణ – ఇప్పటి వరకూ దొరికింది పాక్షిక మానవ అస్థిపంజరం
ఆరోపణల తీవ్రత దృష్ట్యా కర్ణాటక ప్రభుత్వం స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) ఏర్పాటు చేసింది. ఆ టీం ద్వారా ఆ పారిశుధ్య కార్మికులు ఆరోపించిన ప్రాంతాల్లో తవ్వకాలు నిర్వహిస్తున్నారు. ఈ తవ్వకాల్లో ఒకే ఒక్క పాక్షిక మానవ అస్థిపంజరం మాత్రమే దొరికింది. నేత్రావతి నది సమీపంలోని అటవీ ప్రాంతంలో ఇది పడి ఉంది. ఈ శరీర భాగాలలో 15 ఎముకలు ఉన్నాయి, కానీ పుర్రె లభించలేదు. ఫోరెన్సిక్ నిపుణుల ప్రాథమిక విశ్లేషణ ప్రకారం, ఈ ఎముకలు ఒక పురుషుడివిగా అనుమానిస్తున్నారు. పూర్తి ివరాలు బయటకు రావాల్సి ఉంది. మొత్తం 13 సైట్లలో తాను మృతదేహాలను పాతి పెట్టానని..కాల్చానని అతను చెప్పుకున్నాడు. ఆ ప్రాంతాలన్నింటిలోనూ తవ్వకాలు చేస్తున్నారు. ఇప్పటివరకు 10 సైట్లలో తవ్వకాలు జరిగాయి, మరియు ఆరవ సైట్లో తప్ప మిగిలిన 9 సైట్లలో మానవ అవశేషాలు లభించలేదు.
పుకార్లతో హోరెత్తిస్తున్న సోషల్ మీడియా
సోషల్ మీడియా, బాధ్యత లేని యూట్యూబ్ చానళ్లు ఇష్టం వచ్చినట్లుగా కథనాలు ప్రసారం చేస్తున్నాయి. 13 ఏళ్ల చిన్నారి అస్థిపంజరం దొరికిందని ఒకరు.. 450 మంది మహిళలు అదృశ్యమయ్యారని మరికొందరు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటి వరకూ మహిళలు లేదా మైనర్ల అస్థిపంజరాలకు సంబంధించిన ఆధారాలు లభించలేదు.
ధర్మస్థల ఆలయం హెగ్గడే కుటుంబం నిర్వహణలో ఉంది, వీరెంద్ర హెగ్గడే 1968 నుంచి ధర్మాధికారిగా ఉన్నారు. ఆలయంలో వర్గాల మధ్య ఉండే ఆధిపత్య పోరాటం
అసలు వందల మందిని ఎందుకు చంపుతారు ?
ధర్మస్థల పుణ్యక్షేత్రం. ఎప్పుడూ భక్తులతో రద్దీగా ఉంటుంది. డబ్బుల ప్రభావం తక్కువగా ఉంటుంది. అక్కడ ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు జరుగుతాయని ఎవరూ అనుకోరు. కానీ పుకార్లను పుట్టించి ఎప్పటికప్పుడు పెంచుతూ పోవడం వల్ల సమస్యలు వచ్చాయి. ఇప్పుడు మాజీ ఉద్యోగి చేసిన ఆరోపణతో మొత్తం ఆలయ ఇమేజ్ దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారు. నిజాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపించడంలేదు.