చిన్న సినిమాలకు సంగీతమే బలం. పాటలు క్లిక్ అయితే.. సినిమా చూడాలన్న ఆసక్తి కలుగుతుంది. కనీసం ఒక్క పాటని హిట్ చేసుకొని, థియేటర్లకు జనాల్ని రప్పించిన చిన్న సినిమాలెన్నో. పాటలే వసూళ్లకు మూలం. పాటలే ప్రచార సాధనం. ఈనెల 12న రాబోతున్న ‘సైక్ సిద్దార్థ్’ కూడా అలాంటి ఓ పాటని నమ్ముకొంది. నందు హీరోగా నటించిన సినిమా ఇది. ఆయనే నిర్మాత కూడా. సురేష్ ప్రొడక్షన్స్ సంస్థ రిలీజ్ చేస్తోంది. టీజర్, ట్రైలర్ ఆకట్టుకొన్నాయి. ఇప్పుడు ‘థమ్ కుదమ్’ అనే పాట ఒకటి రిలీజ్ అయ్యింది. చాలా రోజుల తరవాత జెస్సీ గిఫ్ట్ పాడిన తెలుగు పాట ఇది. కాశర్ల శ్యామ్ సాహిత్యాన్ని అందించారు. స్మరణ్ సాయి సంగీతాన్ని ఇచ్చారు.
ఇదో ప్రేమ పాట. హీరో, హీరోయిన్ల తొలి ప్రేమ అనుభవాల్ని, సంగతుల్ని, అనుభూతుల్నీ అందించిన పాట. ట్యూన్ చాలా సింపుల్ గా ఉంది. పాటలో సాహిత్యం కూడా అంతే. చిన్న చిన్న పదాలతో రాసేశారు కాశర్ల శ్యామ్. ఓ అమ్మాయి ప్రేమలో పడినప్పుడు అబ్బాయి భావాలేంటో.. తెలిసిన పదాలతోనే వివరించే ప్రయత్నం చేశారు.
”అనగనగా అడ్డదిడ్డంగా పడి ఉన్న
సడన్గా నితో క్లిక్ అయ్యానా
గజిబిజిగా చిత్తు పేపర్లా పడిఉన్న
చిత్రంగా మారి సెట్ అయ్యానా… – ఇలా మొదలైంది పాట.
పొద్దున్నే గరమ్ చాయ్ లెక్క
నవ్విట్టా నాకు అలవాటైతే బాగుందే..” – లాంటి అలవాటైన పదాలు పాటలో వినిపించాయి. సాధారణంగా ప్రేమలో పడిన కుర్రాళ్ల ఆలోచనలు, అమ్మాయి పట్ల వాళ్ల అభిప్రాయాలు, తొలి ప్రేమలో జరిగే రొటీన్ వ్యవహారాలూ.. పాటలో ప్రతిఫలించాయి. వినగా.. వినగా అలవాటైపోయే పాట ఇది.
వరుణ్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో యామినీ భాస్కర్ కథానాయికగా నటించింది. ప్రమోషన్లు కొత్తరకంగా చేసే ప్రయత్నం చేస్తోంది టీమ్. మరి నందుకు ఎలాంటి బ్రేక్ ఇస్తుందో చూడాలి.