“చరిత్రను పుస్తకాల్లో మార్చడం కంటే, సినిమాల ద్వారా జనం మెదళ్లలో మార్చడం సులభం. ఎందుకంటే సినిమా ఇచ్చే భావోద్వేగం ముందు వాస్తవాలు వెలవెలబోతాయి.”
ధురంధర్ ది రివెంజ్ సినిమాలో “రిసిన్” అనే ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విషాన్ని ఒక ఇండియన్ స్పై దావూద్ ఇబ్రహీంపై ప్రయోగిస్తాడు. ఆ విషం ప్రభావం ఎంత ఉంటుందంటే దావూద్ అటు చావడు.. ఇటు బతకడు…అంత నరకం అనుభవిస్తూ ఉంటాడు. ధురంధర్ 2 సినిమా చూసే ప్రేక్షకులకూ వారికి తెలియకుండానే అలాంటి ప్రభావం కనిపిస్తుంది. తమ మెదళ్లలోకి ఎక్కుతోంది విషమా, అమృతమా అన్నది వారికి తెలియదు. వారికి అర్థం కాదు కూడా. ఎందుకంటే ఆదిత్య ధర్ ప్రేక్షకులపై ప్రయోగించిన ఆ రిసిన్ ప్రభావం అలా ఉంటుంది.
ప్రజల ఆలోచన వ్యవస్థపై ప్రయోగించిన సైకలాజికల్ టూల్ ధురంధర్
ధురంధర్: ది రివెంజ్ కేవలం ఒక గూఢచారి యాక్షన్ చిత్రం కాదు. అది ప్రేక్షకుల ఆలోచనా వ్యవస్థపై ప్రయోగించిన ఒక శక్తివంతమైన సైకలాజికల్ టూల్. సినిమా చూసి థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకుడికి తాను చూసింది కేవలం సినిమా అనిపించదు. ఇప్పటి వరకు తనకు తెలియని నిజం ఇదేనన్న భ్రమలో ఉంటాయ్. ఎందుకంటే సినిమాలో చూపించినవన్నీ జరిగినవే. కళ్ల ముందు జరిగినవే. ఆ పాత్రధారులూ వేష, భాషలూ అలాగే ఉంటాయి. కానీ ఇక్కడే దర్శకుడు అసలైన ప్రయోగం చేశాడు. ఆ కళ్ల ముందు జరిగిన వాటికి.. లింక్ ఒకటి ఉందని ఆ వైఫల్యాలకే కాదు..దేశంలో కొన్ని రాజకీయ శక్తులూ దేశవ్యతిరేకులతో చేతులు కలిపినట్లుగా చూపిస్తూ.. అంతర్లీనంగా మనసులో ఓ ముద్ర వేసేస్తాడు. అందుకే సినిమా చూసిన ప్రేక్షకుడు అటు వాస్తవాన్ని అంగీకరించలేక, ఇటు అబద్ధాన్ని వదలలేక ఒక రకమైన జ్ఞానాత్మక వైరుధ్యం కు లోనవుతాడు. ఈ సినిమా ఎక్కడా ఒక రాజకీయ సిద్ధాంతాన్ని నేరుగా బోధించదు. కానీ, అంతర్లీన ప్రేరణ ద్వారా కొన్ని కీలక అంశాలను ప్రజల మనసులోకి అత్యంత చాకచక్యంగా ఇంజెక్ట్ చేస్తుంది. గత పది, ఇరవై ఏళ్లుగా దేశంలో జరిగిన వివాదాస్పద ఆర్థిక, సామాజిక పరిణామాలకు ఒకే ఒక శత్రువును ముడిపెట్టడం ద్వారా సంక్లిష్టమైన సమస్యలకు ఒక సింపుల్ ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం జరిగింది. వైఫల్యాలను విషయాలుగా చిత్రీకించారు. నోట్ల రద్దు వంటి నిర్ణయాల వల్ల సామాన్యుడు అనుభవించిన కష్టాలను మర్చిపోయేలా చేస్తూ, దాని వెనుక ఒక గొప్ప దేశభక్తి ఉందనే రీ-బ్రాండింగ్ వ్యూహాన్ని దర్శకుడు అద్భుతంగా అమలు చేశారు. ఇది పాలకుల వైఫల్యాలను విజయాలుగా మార్చే ఒక అపూర్వమైన సినిమాటిక్ క్రియేటివిటీ.
మొదడులోకి ఇంజెక్ట్ చేసే భావోద్వేగ రిసిన్
ఒక అబద్ధాన్ని వంద సార్లు చెబితే నిజం అవుతుందో లేదో కానీ, ఒక ఊహను వెండితెరపై అత్యున్నత సాంకేతికతతో, కదిలించే భావోద్వేగాలతో మేళవించి చెబితే అది చరిత్రగా రూపాంతరం చెందుతుంది. “చరిత్రదేముంది.. చింపేస్తే చెరిగిపోతుంది” అనే డైలాగ్ సినిమాల్లో పాపులర్ అయింది. కానీ ఆదిత్య ధర్ సినిమా చూసే ప్రేక్షకుడికి అలాంటి అవకాశం ఇవ్వడు. పాత చరిత్రను చింపేయడం కంటే, కొత్తగా జరగని చరిత్ర ను ప్రజల మెదళ్లలోకి ఎక్కించడం సులభమని ఆదిత్య ధర్ నిరూపించారు. కాంగ్రెస్ నేతలే దొంగ నోట్ల ముద్రణకు సహకరించారని, కేరళలో వామపక్షాలకు ఐఎస్ఐ నిధులు అందుతాయని నేరుగా నిజాలే అన్నట్లు చూపించడం ద్వారా ప్రేక్షకుల ఆలోచనా పరిధిని కుంచించుకుపోయేలా చేశారు. చీకటి థియేటర్లో ఆ సినిమాటిక్ వెలుగు ఇచ్చే కిక్కులో ప్రేక్షకుడు తన సొంత విజ్ఞతను పక్కన పెట్టి, దర్శకుడు గీసిన బొమ్మనే ప్రపంచం అని నమ్ముతాడు. దర్శకుడు కేవలం కథను మాత్రమే అల్లలేదు, తన టార్గెట్ ఆడియన్స్ మనోభావాలను అత్యంత శాస్త్రీయంగా చదివారు. వాస్తవాలను వక్రీకరిస్తున్నారని వేలెత్తి చూపలేనంత పకడ్బందీగా సీన్లను డిజైన్ చేశారు. పంజాబ్ డ్రగ్స్ సమస్య వంటి లోతైన సామాజిక మూలాలను విస్మరించి, దాన్ని కేవలం ఒక విదేశీ కుట్రగా పరిమితం చేయడం ద్వారా అసలైన బాధ్యుల నుంచి దృష్టిని మళ్లించారు. చీకటి థియేటర్లో ఆ సినిమాటిక్ వెలుగు ఇచ్చే కిక్కులో ప్రేక్షకుడు తన సొంత విజ్ఞతను పక్కన పెట్టి, దర్శకుడు గీసిన బొమ్మనే ప్రపంచం అని నమ్ముతున్నాడు. అదే కోణంలో నోట్ల రద్దు అంశం.
నోట్ల రద్దుకు కొత్త చరిత్ర
భారత ఆర్థిక, సామాజిక చరిత్రలో ఒక పెను సంచలనంగా నమోదైన ఘటన నోట్ల రద్దు.ఈ నోట్ల రద్దు అంశం గుర్తుకు వచ్చినప్పుడల్లా ప్రజలకు కోపం వస్తుంది. తమను ముప్పు తిప్పలు పెట్టారని ప్రజలు అనుకుంటారు. ఎందుకంటే ఈ నోట్ల రద్దు లక్ష్యం ఏమిటో కేంద్రానికి స్పష్టత లేదు. ఈ నోట్ల రద్దు ఎందుకు చేశారో కానీ ప్రధాని మోదీ ప్రాథమిక లక్ష్యాలను మార్చుకుంటూ వచ్చిన తీరు విస్మయానికి గురిచేసింది. మొదట నల్లధనంపై సర్జికల్ స్ట్రైక్ అని ప్రచారం చేశారు. అంతా బయటకు వస్తుందని చెప్పారు. తర్వాత నకిలీ నోట్ల అంతమే ధ్యేయమని ప్రకటించారు. ఆ తర్వాత రకరకాల కారణాలు చెప్పారు. చివరికి దొంగనోట్లు ప్రింట్ చేసే వారికి అవకాశం లేకుండా చేశామనికూడా చెప్పారు. ఈ అంశంపై పాలకవర్గ వాదనలు క్షేత్రస్థాయిలో విఫలమయ్యాయని గణంకాలు చెబుతున్నాయి. కానీ ఇప్పుడు ఈ సినిమాలో నోట్ల రద్దు అంశంలో దేశం పాక్ టెర్రరిస్టులపై సాధించిన విజయమని వాటికి ఒక కృత్రిమమైన దేశభక్తి రంగును పులిమారు. వేల కోట్ల విదేశీ నకిలీ నోట్ల ముప్పును అడ్డుకోవడమే ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు రహస్యమని చిత్రీకరించడం ద్వారా, సామాన్య ప్రజలు అనుభవించిన అంతులేని ఇబ్బందులను మర్చిపోయేలా చేసే ప్రయత్నం చేశారు. సినిమాటిక్ మేధావి తన ట్రాన్స్ శైలి కథనంతో ప్రేక్షకుల తార్కిక ఆలోచనా శక్తిని మొద్దుబారుస్తాడు. పాకిస్తాన్లో ఒక సమర్థుడైన గూఢచారి ఆ నకిలీ నోట్ల కుట్రను ఛేదించగలిగే అవకాశం ఉన్నప్పుడు, 140 కోట్ల మంది ప్రజల ఆర్థిక జీవనాన్ని అతలాకుతలం చేయాల్సిన అవసరం ఏముందనే కనీస లాజిక్ ప్రేక్షకుడికి తట్టకుండా దర్శకుడు జాగ్రత్త పడ్డాడు. ఆర్థిక వ్యవస్థకు జరిగిన నష్టాన్ని పక్కన పెట్టి, దీనిని ఉగ్రవాదంపై జరిగిన ఒక వీరోచిత దాడిలా ప్రదర్శించడం ద్వారా ఒక వ్యూహాత్మకమైన భ్రమను కల్పించారు. చీకటి థియేటర్లో సృష్టించే ఈ భావోద్వేగ వెల్లువలో, సామాన్యుడి కష్టార్జితం కంటే దర్శకుడు గీసిన ఆ కృత్రిమ విజయమే గొప్పదిగా కనిపిస్తుంది. కళ అనేది వాస్తవాలను వక్రీకరించి అధికారాన్ని సమర్థించే సాధనంగా మారినప్పుడు, చరిత్ర వక్రీకరణకు గురవుతుంది. నోట్ల రద్దు వల్ల కుప్పకూలిన చిన్న పరిశ్రమలు, ఉపాధి కోల్పోయిన లక్షలాది మంది కార్మికుల వాస్తవ గాథలను ఈ సినిమాటిక్ గ్లోరిఫికేషన్ పూర్తిగా కప్పివేసింది. విఫలమైన ఆర్థిక ప్రయోగాలను సైతం అద్భుత విజయాలుగా ప్రజల మెదళ్లలోకి ఎక్కించే ప్రయత్నం ఊహించని రీతిలో జరిగింది.
పంజాబ్ డ్రగ్స్ సమస్యకూ అదే తరహా సమర్థన
పంజాబ్ యువతను పట్టిపీడిస్తున్న మాదకద్రవ్యాల మహమ్మారిని కేవలం పాకిస్తాన్ కుట్రగా, సరిహద్దు అవతలి యుద్ధం గా చిత్రీకరించడం క్షేత్రస్థాయి వాస్తవాలను పక్కదారి పట్టించడమే అవుతుంది. దశాబ్దాలుగా పంజాబ్ ఆర్థిక వ్యవస్థను వెన్నెముకలా కాపాడిన వ్యవసాయ రంగం కుంటుపడటం, హరిత విప్లవం తర్వాత ప్రత్యామ్నాయ ఉపాధి అవకాశాలు పెరగకపోవడం వల్ల అక్కడి యువతలో తీవ్ర నిరాశ నిస్పృహలు అలుముకున్నాయి. ఈ ఆర్థిక శూన్యతను ఆసరాగా చేసుకున్న స్థానిక మాఫియా, యువతను వ్యసనాల ఊబిలోకి నెట్టింది. అంతర్గత ఆర్థిక సంక్షోభాన్ని విస్మరించి, బాధ్యతను పూర్తిగా పొరుగు దేశాల మీదకు నెట్టేయడం సిద్ధాంతపరమైన వంచన. డ్రగ్స్ సరఫరా వ్యవస్థ ఇంత పకడ్బందీగా విస్తరించడానికి రాజకీయ , అధికార యంత్రాంగంలోని కొన్ని వర్గాల అండదండలు ఉన్నాయన్నది బహిరంగ రహస్యం. కానీ వీటన్నింటినీ మర్చిపోయేలా దర్శకుడు చేస్తాడు. కేవలం పాకిస్తాన్ కుట్ర మాత్రమే కనిపిస్తుంది. విచిత్రం ఏమిటంటే.. యూపీలో యోగి సర్కార్ అందరి ముందు కాల్చి చంపిన ఓ గ్యాంగ్ స్టర్ ను పాకిస్తాన్ ఐఎస్ఐతో లింకులు పెట్టారు. అతన్ని అలా చంపడానికీ జస్టిఫికేషన్ ఇచ్చారు. ఈ చిత్రంలో కేరళలోని వామపక్ష పార్టీలకు, దేశంలోని స్వచ్ఛంద సంస్థలకు , ప్రధాన ప్రతిపక్షమైన కాంగ్రెస్ పార్టీకి పాకిస్థాన్ గూఢచారి సంస్థ ISIతో సంబంధాలు ఉన్నాయని అర్థమయ్యేలా చేస్తారు. అది ఒక ప్రమాదకరమైన రాజకీయ ముద్ర . దశాబ్దాల చరిత్ర కలిగిన జాతీయ పార్టీలను, రాజ్యాంగబద్ధమైన వ్యవస్థలను శత్రు దేశపు ఏజెంట్లుగా చిత్రీకరించడం ద్వారా, ప్రజాస్వామ్యంలోని విభిన్న భావజాలాల పట్ల సామాన్యుడిలో తీవ్రమైన అనుమానాలను రేకెత్తించే ప్రయత్నం జరిగింది. ఆధారాలు లేని ఇటువంటి ఆరోపణలను వెండితెరపై సత్యాలు గా ఆవిష్కరించడం వల్ల, రాజకీయ ప్రత్యర్థులను దేశద్రోహులుగా చూసే ధోరణి పెరుగుతుంది.
ఇది కథనం కోసం చేసిన కల్పన కాదు.. పకడ్బందీగా చేసిన ప్రయత్నం
ఇవన్నీ కేవలం కథనం కోసం చేసిన కల్పన అని పక్కన పెట్టలేం. ఎందుకంటే, ఇది ప్రజల ఆలోచనా విధానాన్ని ప్రభావితం చేస్తూ సమాజంలో విద్వేషపూరిత చీలికలను సృష్టించే సమాచార యుద్ధం లాంటిది. కాంగ్రెస్ పార్టీ , లెఫ్ట్ పార్టీలను దే శవ్యతిరేక, పాకిస్తాన్ అనుకూల పార్టీలుగా సినిమా చూసే వారి మెదళ్లలోకి ఎక్కించారు. కానీ కాస్త ఆలోచిస్తే.. కాంగ్రెస్ దేశంలోని ముస్లింల ఓట్ల కోసం ఓటు బ్యాంక్ రాజకీయాలు చేస్తుంది కానీ పాకిస్తాన్ లో ముస్లింలకు అనుకూలంగా వ్యవహరిస్తే ఆ పార్టీకి ఏం లాభం వస్తుంది? అలాగే లెఫ్ట్ పార్టీల భావజాలం అంతే. అంత మాత్రాన వారిని దేశానికి నష్టం చేసేలా ఇతర శక్తులకు చేతులు కలిపారన్న ముద్ర వేయడం పకడ్బందీ గాజరిగింది. ప్రేక్షకులపైకి ఆదిత్య ధర్ ప్రయోగించిన ఈ ‘రిసిన్’ ప్రభావం ఒక్క రోజుతో పోయేది కాదు. అది ప్రజల సామాజిక దృక్పథాన్ని, రాజకీయ నిర్ణయాలను ప్రభావితం చేసే ఒక దీర్ఘకాలిక వ్యూహం. కళ అనేది సమాజానికి అద్దం పట్టాలి, కానీ ఇక్కడ అద్దం మీద తనకు కావలసిన బొమ్మ గీసి, అదే సమాజం అని నమ్మించే ప్రయత్నం జరుగుతోంది. మేధావి వర్గం ఈ వక్రీకరణలను గుర్తించి విశ్లేషిస్తున్నప్పటికీ, భావోద్వేగాల వెల్లువలో కొట్టుకుపోయే సామాన్య ప్రేక్షకుడు మాత్రం ఈ సినిమాటిక్ భ్రమలో బందీ అవుతున్నాడు.
ఈ సినిమా సైకలాజికల్‌గా ఎంత ప్రభావం చూపుతోందంటే.. కొన్ని సన్నివేశాలు వచ్చినప్పుడు ప్రేక్షకుల భావోద్వేగంతో కేకలు వేస్తూంటారు. ఆ సన్నివేశాలన్నీ పైన చెప్పుకున్నవే. అంటే అవే వారి మనసులో ఉండిపోతాయి. వాటినే నిజాలనుకుంటారు. ఈ సినిమా రెండు భాగాల్లోనూ ఇంతే ఉంది. ఈ సినిమాను నమ్మిన వారు.. అదే నిజమని నమ్ముతారు. బాధ్యుల వైఫల్యాలు మసకబారుతాయి. చరిత్రను వెండితెరపై తిరిగి రాసే ఈ ప్రక్రియలో వాస్తవాలు శాశ్వతంగా సమాధి అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. సినిమా చూసి బయటకు వచ్చిన వాడు శత్రువుపై పగతో ఊగిపోతాడు తప్ప, వాస్తవాలను వెతికే ఓపికను కోల్పోతాడు. అదే ఆదిత్య ధర్ సాధించిన అసలైన సినిమాటిక్ విజయం.


