భారతీయ సినీ పరిశ్రమలో ఇప్పుడు జాతీయవాదం అనేది ఇప్పుడు ఒక తిరుగులేని సక్సెస్ ఫార్ములాగా మారింది. ఉరి: ద సర్జికల్ స్ట్రైక్ తో దేశవ్యాప్తంగా ఒక ఉద్వేగాన్ని రగిల్చిన దర్శకుడు ఆదిత్య ధర్, ఇప్పుడు ధురంధర్ తో ఆ స్కేల్‌ను మరో స్థాయికి తీసుకెళ్లారు. కేవలం ఒక యాక్షన్ సినిమాగా కాకుండా, పొరుగు దేశంలో జరిగిన వాస్తవ ఘటనలను, అంతర్జాతీయ గూఢచారి వ్యవస్థల ఎత్తుగడలను మేళవించి, వాటన్నింటికీ ఒక భారతీయ మాస్టర్ మైండ్ కారణమనే కల్పిత కథాంశంతో ఈ చిత్రాన్ని అద్భుతంగా మలిచారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జరుగుతున్న చర్చను గమనిస్తే, సినిమా కంటే కూడా అందులోని క్యారెక్టర్ల చుట్టూ అల్లిన రియల్ లైఫ్ పోలికలే అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి.
వాస్తవాల పునాదులపై బలమైన మాయా ప్రపంచం
ఈ సినిమాలో కనిపించే ప్రతి విలన్ పాత్రను ప్రేక్షకులు నిజ జీవితంలోని మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌తో పోల్చుకుంటున్నారు. రెహ్మాన్ బలూచ్ నుండి దావూద్ ఇబ్రహీం వరకు, గత కొన్నేళ్లుగా పాకిస్తాన్ గడ్డపై ముగిసిన ప్రతి ఉగ్రవాది కథను ఈ సినిమాలోని హీరో హీరోయిజానికి ముడిపెట్టారు. అక్కడ ఎవరు చనిపోయినా, అది మనవాళ్లు చేసిన పనే అనే సగటు భారతీయుడి బలమైన నమ్మకాన్ని ఆదిత్య ధర్ వెండితెరపై ఆవిష్కరించారు. ఈ క్రెడిట్ అంతా పరోక్షంగా కేంద్రంలో ఉన్న అధికార యంత్రాంగానికే దక్కుతుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతోంది. మెజారిటీ భారతీయుల మనోభావాలను, ప్రస్తుత రాజకీయ ముఖచిత్రాన్ని సరిగ్గా అంచనా వేయడంలో దర్శకుడు తన మార్క్ డీటెయిలింగ్ తో సక్సెస్ అయ్యారు.
అందరూ బయటకు వచ్చారు.. మరి ధురంధర్ ఎవరు?
ఈ సినిమాలోని అసలు ట్విస్ట్ హంజా అనే క్యారెక్టర్. ధురంధరుడైన ఈ పాత్ర చుట్టూ ఒక మిస్టరీని క్రియేట్ చేశారు. నిజానికి ఇలాంటి వ్యక్తి ఒకరు ఉన్నారా అంటే అది కేవలం కల్పితమే అని చెప్పాలి. కానీ, పాకిస్తాన్లో జరిగిన అంతర్గత పరిణామాలకు, గుర్తుతెలియని వ్యక్తుల దాడులకు ఒక భారతీయ ఏజెంట్ కారణమనే లింకును కలుపుతూ తీసిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తోంది. వాస్తవానికి అక్కడ జరిగినవి వేర్వేరు కారణాల వల్ల సంభవించినా, వాటన్నింటినీ ఒకే తాటిపైకి తెచ్చి మన హీరోకు ఆపాదించడం ద్వారా ఒక సూపర్ హీరో ఇమేజ్ను సృష్టించారు. సినిమాటిక్ లిబర్టీ పేరుతో వాస్తవాలను కల్పిత హీరోయిజంతో మిక్స్ చేయడం ఇక్కడ ప్రధానాంశం.
డీటెయిలింగ్ గురించే అంతా చర్చ
ఆదిత్య ధర్ గత చిత్రం ఉరి సమయంలోనే ఈ తరహా సబ్జెక్టులకు ఎంత సేలబిలిటీ ఉంటుందో అర్థం చేసుకున్నారు. దేశభక్తి అనే భావోద్వేగానికి టెక్నికల్ వాల్యూస్ తోడైతే బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురుస్తుందని ఆయన నిరూపించారు. అందుకే ఈసారి బడ్జెట్‌ను, కథా విస్తృతిని పెంచి ధురంధర్ ను ఒక గ్లోబల్ స్పై థ్రిల్లర్‌గా తీర్చిదిద్దారు. ఒకవైపు లేనిపోని హీరోయిజాన్ని కొందరికి కట్టబెడుతూనే, మరోవైపు వ్యూహాత్మక విశ్లేషణలతో విలన్లను మరింత క్రూరంగా చూపే ప్రయత్నం ఇందులో కనిపిస్తుంది. అయితే, ఈ సినిమాటిక్ కల్పనల గురించి సోషల్ మీడియాలో పెద్దగా చర్చ జరగకపోవడం గమనార్హం. కేవలం దర్శకుడు చూపించిన మేకింగ్ స్టైల్ మరియు సీన్ల డీటెయిలింగ్ గురించే అందరూ ముచ్చటించుకుంటున్నారు.
ఆదిత్యధర్ దే అసలైన విజయం
ప్రస్తుత భారతీయ ప్రేక్షకుల మూడ్ ను పట్టుకోవడంలో ఆదిత్య ధర్ మరోసారి పైచేయి సాధించారు. గతంలో ఇలాంటి కథలు డాక్యుమెంటరీ తరహాలో ఉండేవని, కానీ ఇప్పుడు వాటికి కమర్షియల్ ప్యాకేజింగ్ అద్ది ఒక మానియాగా మార్చడంలో ఆయన దిట్ట అని నిరూపించుకున్నారు. దేశ ప్రయోజనాల కోసం ప్రాణాలకు తెగించే రహస్య ఏజెంట్ల కథలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి, కానీ దానికి సమకాలీన రాజకీయాలను, వాస్తవ ఘటనలను జోడించడం ఈ సినిమాకు ప్లస్ పాయింట్ అయింది. బాక్సాఫీస్ వద్ద ఈ ధురంధరుడి హవా మరో నెల రోజుల పాటు కొనసాగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
వాస్తవంలో అవాస్తవం
ధురంధర్ కేవలం ఒక సినిమా కాదు, అది ఒక పక్కా వ్యూహంతో కూడిన వినోదం. వాస్తవాలను గౌరవిస్తూనే, కల్పిత హీరోయిజంతో ప్రేక్షకులను ఉర్రూతలూగించే విద్య ఆదిత్య ధర్‌కు బాగా తెలుసు. సినిమాలో చూపిస్తున్నవన్నీ నిజమని నమ్మేంతగా డీటెయిలింగ్ ఇవ్వడం ఆయన ప్రతిభకు నిదర్శనం. నిజ జీవిత సంఘటనలకు సినిమాటిక్ గ్లామర్ అద్ది, దేశభక్తి అనే రంగు పూస్తే వచ్చే ఫలితమే ఈ ధురంధర్ మానియా. కానీ ఈ సినిమాలోని ఘటనలు వాస్తవం.. ఆ ఘటనల చుట్టూ అల్లిని హీరోయిజం మాత్రం వాస్తవం కాదు. ఇప్పుడు అదెవరికీ అవసరం లేదు.


