ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు ఇవ్వాలని జగన్ కు రాజ్ నాథ్ సింగ్ ఫోన్ చేశారని వైసీపీ వర్గాలు ప్రకటించుకున్నాయి. బీజేపీ వైపు నుంచి మాత్రం ఎలాంటి ప్రకటన లేదు. లోక్ సభలో నలుగురు, రాజ్యసభలో ఐదుగురు సభ్యులు వైసీపీకి ఉన్నారు. మరి బీజేపీ ఇప్పుడు.. భారత రాష్ట్ర సమితిని సంప్రదించలేదా అన్న ప్రశ్నలు వస్తున్నాయి. ఇండియా కూటమితో సంబంధం లేని పార్టీలు, బీజేపీకి పరోక్షంగా అయినా మద్దతు పలుకుతున్న పార్టీలకు మరో దారి లేదు. అడిగినా అడగకపోయినా బీజేపీకి మద్దతివ్వాల్సిందే.
అయితే కనీసం అడిగారు కాబట్టి మద్దతిస్తున్నాం అని చెప్పుకోవడానికైనా ఇలా కాల్ వచ్చింది అని చెప్పుకోవచ్చని అనుకుంటున్నారు. కానీ బీఆర్ఎస్ వైపు నుంచి అలా ఫోన్ చేశారన్న లీక్ కూడా రాలేదు. నిజానికి భారత రాష్ట్ర సమితికి లోక్ సభలో ఎంపీలు లేరు. కానీ రాజ్యసభలో నలుగురు ఉన్నారు. నాలుగు ఓట్లు కీలకం కాకపోవచ్చు కానీ.. ఓ పార్టీ ఇతర కూటమి వైపు పోకుండా ఉండాలని బీజేపీ చూసుకుంటుంది. ఇప్పటి వరకూ భారత రాష్ట్ర సమితి ఉపరాష్ట్రపతి ఎన్నికపై ఎలాంటి ప్రకటన చేయలేదు.
ప్రస్తుతం బీఆర్ఎస్ కు జాతీయ స్థాయిలో ఓ స్ట్రాటజీ తీసుకునే పరిస్థితి లేదు. పూర్తిగా తెలంగాణకే పరిమితవ్వాలని నిర్ణయించుకుంది. ఇప్పుడు బీజేపీని వ్యతిరేకించి..కాంగ్రెస్ ను సపోర్టు చేయలేరు. కాంగ్రెస్ ను వ్యతిరేకించి బీజేపీని సపోర్టు చేయలేరు. అందుకే ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏకగ్రీవం కావాలని కోరుకుంటారు. ఒక వేళ ఎన్నిక జరిగితే.. రెండు పార్టీలకు దూరం అని .. ఎన్నికల్లో పాల్గొనకుండా ఉండే అవకాశం ఉంది.