కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య కోల్డ్ వార్ రోడ్డున పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఇంత కాలం అన్న రాజకీయ వ్యూహంలో భాగంగానే తమ్ముడు అడుగులు వేస్తూంటాడని అందరూ అనుకుంటూ వచ్చారు. కానీ మంత్రి పదవి కోసం రాజగోపాల్ రెడ్డి చేస్తున్న రాజకీయంపై వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు చూసిన తర్వాత ఇద్దరి మధ్య గ్యాప్ నిజమేనని రాజకీయవర్గాలూ ఓ అంచనాకు వస్తున్నాయి.
రాజకీయాల్లో పదవులు రావాలంటే.. పార్టీ కోసం కష్టపడటం, విధేయత చూపడంతో పాటు సామాజిక సమీకరణాలు కలసి రావాలి. రాజగోపాల్ రెడ్డి పార్టీ కోసం కష్టపడ్డానని..తాను సీనియర్‌నని చెబుతున్నారు. కానీ ఆయన కాంగ్రెస్ పార్టీ పీక పితకడానికి బీజేపీలో చేరి ఉపఎన్నిక తెచ్చారన్నది అసలు నిజం. ఈ విషయం పక్కన పెడితే సామాజిక సమీకరణాలు ఆయనకు ఏ మాత్రం కలసి రావడం లేదు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు రెడ్డి మంత్రులు ఉన్నారు. మరో మంత్రి అదీ.. రెడ్డి వర్గం.. మరో మంత్రి సోదరుడికి అవకాశం కల్పించడం అసాధ్యం. ఈ విషయం తెలిసి కూడా రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి కోసం పట్టుబడుతున్నారు.
రాజగోపాల్ రెడ్డికి రావాల్సిన పదవి తాను తీసుకున్నానని వెంకటరెడ్డి ఫీలవుతున్నట్లుగా ప్రెస్మీట్లో మాట్లాడారు. తనకు పదవి హైకమాండ్ ఇచ్చిందని తాను అడగలేదన్నారు. రాజగోపాల్ రెడ్డికి హైకమాండ్ హామీ ఇచ్చిందేమో తనకు తెలియదని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి చేతుల్లో మంత్రి పదవి ఉండదని.. పదవి ఇప్పించే స్థాయిలో కూడా తాను లేనని చెప్పుకొచ్చారు. హైకమాండ్ చేతుల్లోనే ఉంటుందని .. ఎందుకీ రచ్చ అని సోదరుడికి పరోక్షంగా సందేశం ఇచ్చారు. అయితే రాజగోపాల్ రెడ్డి మాత్రం తన సోదరుడ్ని మంత్రి పదవి నుంచి పీకేసి అయినా సరే తనకు పదవి ఇవ్వాలని కోరుకుంటున్నట్లుగా రాజకీయం చేస్తున్నారు.
రాజగోపాల్ రెడ్డి బెదిరింపులకు భయపడి తనను పక్కన పెట్టి ఆయనకు చోటు ఇస్తారేమోనని వెంకటరెడ్డి జాగ్రత్త పడుతున్నారు. రేవంత్ రెడ్డి కోసం పూజలు చేస్తున్నారు. ఆయనకు మద్దతుగా మాట్లాడుతున్నారు. రేవంత్ కూడా కోమటిరెడ్డికి మద్దతుగా ఉంటున్నారు.