డిజిటల్ సమాంతర న్యాయస్థానాల’పై కఠిన చర్యలు తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని తాజా పరిణామాలు నిరూపిస్తున్నాయి. ఒక ప్రైవేటు ప్రాపర్టీలోకి చొరబడి బెదిరింపులకు పాల్పడటం.. చట్టరీత్యా నేరం. ఇప్పుడు అదే యథేచ్చగా చేస్తున్నారు.
డిజిటల్ విప్లవం, సోషల్ మీడియా విస్తృతి తెచ్చిన అతిపెద్ద ముప్పు.. బాధ్యతారహితమైన యూట్యూబ్ జర్నలిజం. ఇటీవలి కాలంలో రెండు తెలుగు రాష్ట్రాల్లో, ముఖ్యంగా తెలంగాణలో ఒక స్మార్ట్‌ఫోన్, చేతిలో ఒక మైక్ పట్టుకుని తిరిగే కొందరు యూట్యూబర్ల హడావుడి హద్దులు దాటిపోతోంది. తామే స్వయంగా రెవెన్యూ అధికారులుగా, సర్వేయర్లుగా , న్యాయమూర్తులుగా అవతారమెత్తి క్షేత్రస్థాయిలో తీర్పులు ఇచ్చేస్తున్నారు. ధరణి రికార్డులను పట్టుకుని, వివాదాస్పద భూములే లక్ష్యంగా ఫీల్డ్‌లోకి వెళ్లి కొలతలు తీయడం, అక్కడ యజమానులతో గొడవలకు దిగడం, తద్వారా సదరు యజమానులను బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయల వసూళ్లకు పాల్పడటం నేడు ఒక లాభసాటి భూదందాగా రూపాంతరం చెందింది. ఈ తరహా దందాలతో ఇప్పటికే వందలాది మంది సామాన్యుల, వ్యాపారవేత్తల దగ్గర లక్షలు, కోట్లు గుంజినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ముఠాలు.. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు చెందిన ప్రైవేట్ ఆస్తిని టార్గెట్ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది.
తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో పవన్ కల్యాణ్‌కు చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ఒక ఫామ్‌హౌస్ ఉంది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లలో కూడా దీనికి సంబంధించిన పూర్తి వివరాలను పారదర్శకంగా ప్రకటించారు. అయితే, గత కొన్ని రోజులుగా కొందరు యూట్యూబర్లు , కొన్ని డిజిటల్ ఛానళ్ల ప్రతినిధులు ఒక పక్కా పొలిటికల్ స్కెచ్‌లో భాగంగా ఈ ప్రాపర్టీపై పడ్డారు. అనుమతి లేకుండా ఒక ప్రైవేట్ ప్రాపర్టీలోకి చొరబడటం చట్టరీత్యా నేరమని తెలిసి కూడా.. కెమెరాలతో ఫామ్‌హౌస్ లోపలికి వెళ్లి రచ్చ చేయడం, అది ఎఫ్టీఎల్ పరిధిలో ఉందంటూ, శిఖం భూమిని కబ్జా చేశారంటూ తప్పుడు డాక్యుమెంట్లు, మార్ఫింగ్ మ్యాప్‌లతో నానా హంగామా సృష్టించారు.
ఒకవేళ సదరు ఆస్తిలో ఏవైనా చట్టపరమైన లోపాలు ఉంటే, వాటిని నిరూపించాల్సింది, చర్యలు తీసుకోవాల్సింది రెవెన్యూ, హైడ్రా , స్థానిక మున్సిపల్ అధికారులు మాత్రమే. అంతే తప్ప, ప్రైవేటు వ్యక్తులు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, సరిహద్దు గోడలు దాటి లోపలికి వెళ్లి యజమానులను, అక్కడ పనిచేసే సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసే హక్కు ఎవరికీ లేదు. ఈ యూట్యూబ్ బ్యాచ్ ఉద్దేశం నిజంగా అక్రమాలను ప్రశ్నించడం కాదు.. పవన్ కల్యాణ్ లాంటి అగ్ర నాయకుడి పేరు వాడుకుని బ్లాక్మెయిల్ దందాలకు తెరతీయడమేనని క్షేత్రస్థాయి పరిశీలనలో స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో సదరు ఫామ్‌హౌస్ యాజమాన్యం , లీగల్ టీమ్ ఇప్పటికే పోలీసులకు అధికారికంగా ఫిర్యాదు చేయడానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది.
ఈ మొత్తం ఉదంతం భారత రాజ్యాంగం పౌరులకు కల్పించిన అత్యంత ప్రాథమిక హక్కు అయిన రైట్ టు ప్రైవసీ, ప్రైవేటు ఆస్తుల రక్షణను తీవ్రంగా ప్రశ్నిస్తోంది. ల్యాండ్ గ్రాబింగ్ లేదా కబ్జా పేరుతో బడా బాబుల ప్రాపర్టీల వద్దకు వెళ్లి వీడియోగ్రఫీ చేయడం, తెరవెనుక సెటిల్మెంట్లు కుదరకపోతే వాటిని సోషల్ మీడియాలో పెట్టడం అనేది వ్యవస్థీకృత నేరంగా మారింది. సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తున్న ఇటువంటి డిజిటల్ బ్లాక్‌మెయిలర్లపై తెలంగాణ పోలీస్ శాఖ కఠినమైన నిఘా పెట్టాల్సిన అవసరం ఉంది. ఐపీసీ , ప్రస్తుత భారతీయ న్యాయ సంహిత లోని క్రిమినల్ ట్రెస్పాస్, ఎక్స్టార్షన్, సైబర్ క్రైమ్ సెక్షన్ల కింద వీరిపై కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపితేనే.. భవిష్యత్తులో సామాన్య పౌరుల ఆస్తులకు, ప్రైవసీకి పూర్తి రక్షణ లభిస్తుంది. ముసుగు వీరుల డిజిటల్ దోపిడీకి అడ్డుకట్ట పడాలి.
