‘అంతా మీరే చేశారు’.. దిల్ రాజు బొమ్మరిల్లు సినిమాలో ఫేమస్ డైలాగ్ ఇది. దిల్ రాజు తాజా ప్రెస్ మీట్ చూస్తే అదే డైలాగ్ గుర్తుకు వచ్చింది. థియేటర్స్ బంద్ ఇష్యూ లో అంతా మీడియానే చేసిందని చెప్పడం ఈ ప్రెస్ మీట్ ఉద్దేశంగా తోచింది. ఈ ప్రెస్ మీట్ లో ఆయన చాలా విషయాలపై సుదీర్గంగా మాట్లాడారు. ఎగ్జిబిటర్స్ కి సమస్యలు వున్నాయని, దానికి పరిష్కారం దొరకడం లేదని చెప్పారు. అలాగే తన దగ్గర వున్న థియేటర్స్ కౌంట్ కూడా రివిల్ చేశారు.
అయితే అసలు విషయంలో మొత్తం తప్పుని మీడియా మీదకు నెట్టేసే ప్రయత్నం చేశారు. జూన్ 1న థియేటర్స్ బంద్ అని ప్రచారం చేసింది మీడియానే అని చెప్పుకొచ్చిన దిల్ రాజు.. జనానికి, ఏపీ ప్రభుత్వానికి మొత్తం ఇష్యూని రాంగ్ గా కమ్యునికేట్ అయ్యిందని, బంద్ వార్తని చాలా రాంగ్ గా తీసుకెళ్లారని అభిప్రాయపడ్డారు.
మా డిమాండ్లు నేరవేర్చకుంటే బంద్ చేస్తామని కార్మికులు చెబుతుంటారు. అలాగే ఎగ్జిబిటర్లు కూడా చెప్పారు. కానీ మీడియా మాత్రం విక్షణ పాటించకుండా జూన్ 1 నుంచి బంద్ ఖచ్చితం, థియేటర్స్ ని మూసేస్తారనే కోణంలో వార్తలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు.
అంతేకాదు.. పవన్ కళ్యాణ్ రిటన్ గిఫ్ట్ ప్రకటన పై కూడా ఆయన మీడియానే తప్పుపట్టినట్టుగా మాట్లాడారు. ఏపీ ప్రభుత్వానికి కొందరు తప్పుగా సమాచారం చేరవేశారని, పవన్ కళ్యాణ్ సినిమా సమయంలోనే థియేటర్స్ మూసేస్తున్నారనట్టుగా కథనాలు అల్లారని అసహనం వ్యక్తం చేశారు.
నిజంగా దిల్ రాజు చెప్పినట్లు విషయం రాంగ్ గా కమ్యునికేట్ అయ్యిందని భావించినట్లేయితే వెంటనే వార్తలు ఖండించాల్సింది. ప్రెస్ మీట్ పెట్టే చెప్పే సమయం లేకపోయిన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాల్సింది. మీడియా జూన్ 1 నుంచి బంద్ అని ప్రచారం చేస్తుంటే చాంబర్, గిల్డ్ నుంచి ఎలాంటి కదలిక రాలేదు. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రకటన వచ్చిందో అప్పడే అందరిలో కదలికలు వచ్చాయి.
నిన్న అల్లు అరవింద్ ప్రెస్ మీట్ పెట్టి సహేతుకంగా మాట్లాడారు. దిల్ రాజు మాత్రం మీడియాపై నెపం వేసే ప్రయత్నం చేయడం విచిత్రంగానే వుంది. ఏదేమైనా ఇకపై ఈ పరిస్థితికి తెరదించి ఇండస్ట్రీ పెద్దలు కాస్త ఐక్యతగా వుంటే ఇలాంటి సమస్యలు పరిష్కారించుకోవడం కష్టమేమి కాదు.