`మ్యాడ్` సినిమాతో ఆకట్టుకొన్న దర్శకుడు కల్యాణ్ శంకర్. `మ్యాడ్ 2`తో మరో హిట్టు కొట్టాడు. ఇప్పుడు `మ్యాడ్ జూనియర్స్`ని రూపొందిస్తున్నాడు. `మ్యాడ్ 2` తరవాత రవితేజతో ఓ సినిమా చేయాలి. సితార ఎంటర్టైన్మెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుందని చెప్పుకొన్నారు. కానీ ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు.
అయితే ఇప్పుడు కార్తికి ఓ కథ చెప్పి ఒప్పించారు కల్యాణ్ శంకర్. ఈ చిత్రాన్ని నాగవంశీ నిర్మిస్తారు. కార్తిని కలిసి కథ చెప్పేశారు కల్యాణ్. ఆయనకు కథ బాగా నచ్చింది. వీలైనంత త్వరలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్తారు. రవితేజకు చెప్పిన కథే.. కార్తి దగ్గరకు వచ్చిందని సమాచారం అందుతోంది. రవితేజ కోసం కల్యాణ్ ఓ సూపర్ మ్యాన్ కథని తయారు చేశారు. ఇప్పుడు కార్తితో చేస్తోంది కూడా అదే కథ. అప్పట్లో బడ్జెట్ వర్కవుట్ అవ్వట్లేదని ఆ ప్రాజెక్ట్ ముందుకు వెళ్లలేదు. రవితేజతో వర్కవుట్ కాని బడ్జెట్ కార్తితో ఎలా వర్కవుట్ అవుతుంది? అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. కార్తికి తమిళంతో పాటుగా తెలుగులోనూ మార్కెట్ ఉంది. కాబట్టి.. బడ్జెట్ లో వెసులు బాటు దక్కుతుందని నాగవంశీ భావించి ఉంటారు. ఈ సినిమా కోసం దాదాపు రూ.100 కోట్లు ఖర్చు పెడుతున్నారని టాక్. వంద కోట్లయితే కార్తిపై కూడా రిస్కే. మరి ఇంత రిస్క్ చేయడానికి నాగవంశీ ఎలా ఒప్పుకొన్నారు అనేది ఆసక్తి కలిగిస్తోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి వివరాలు త్వరలో వెల్లడవుతాయి.
